Shuklambaradharam Vishnum
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye
ఈ ప్రక్రుతి కన్నుకి వేదవ్యాసునికీ సంబధం ఏమిటి ?
- లక్ష్మి రమణ
ద్వీపము ఎలా ఉంటుంది ? చుట్టూ ఆవరించిన నీటిలో తేలియాడే భూభాగం చూడడానికి ఎలా కనిపిస్తుంది ? భూమిలో మొలిచిన ఒక పెద్ద కన్నులా ఉంటుందా ? నిజమేనేమో అనిపిస్తుంది, కమ్రునాగ్ సరస్సుని చూస్తే. ఈ సరస్సు ప్రత్యేకత ఇందులో తేలియాడే భూభాగం. అంతేనా , లోతెంతో తెలియని స్వచ్ఛమైన నీటి కుండం. అద్భుతమైన ప్రక్రుతి సౌందర్యం మధ్య పరాశర మహర్షికి సంబంధించిన పురాణ , ఆధ్యాత్మిక ఔన్నత్యంతో విప్పారిన ఈ ప్రకృతికన్ను గురించి తెలుసుకుందాం రండి .
మహర్షులు , మహనీయులు ఎందరో మన భారతీయుల జీవన వేదాన్నిస్వరపరిచారు. అటువంటి మహనీయుల్లో పరాశర మహర్షి ఒకరు. ఈయన సప్తరుషుల్లో ఒకరైన వశిష్టుని మనవడు. తన తండ్రి శక్తి మహర్షిని రాక్షసులు సంహరించారనే కోపంతో , జనమేజయుడు సర్ప యాగం చేసినట్టు, రాక్షస యాగం చేసి లోకంలో ఉన్న రాక్షసులందరినీ మట్టు పెట్టడానికి పూనుకున్న మహానుభావుడు . ఆ యాగాన్ని వశిష్టుడే స్వయంగా వచ్చి ఆపించాల్సి వచ్చింది . అది వేరే కథ . పరాశర సంహిత ని ఇచ్చింది, జ్యోతిష్య శాస్త్రాన్ని లోకానికి అందించింది ఈ మహానుభావుడే . ఇవే కాక , పరాశర స్మృతిశాస్త్రం, పరాశర హోరశాస్త్రం, కృషి పరాశర (వ్యవసాయం),
వృక్షాయుర్వేద విజ్ఞాన గ్రంధాలనీ ఆయన అనుగ్రహించారు . ఈయనకీ ఈ ద్వీపము లాంటి సరస్సుకీ సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాం .
పరాశర మహర్షి తపస్సు చేసిన ప్రదేశమే ఈ కమ్రునాగ్ సరస్సు లేదా పరాశర సరస్సు ప్రాంతం . ఇది హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నగారానికి తూర్పున 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు సముద్ర మట్టానికి 2,730 మీ (8,960 అడుగులు) ఎత్తులో ఉంది. దీని చుట్టూ వేగంగా ప్రవహించే బియాస్ నది, మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి. సరస్సును మండీ నుండి లేదా కులు జిల్లాలోని బజౌరా నుండి చేరుకోవచ్చు. ఈ సరస్సులో ఒక గుండ్రని, తేలియాడే భూభాగం ఉంటుంది. మన కంట్లో ఉన్న నల్లని గుడ్డులా ఈ భూభాగం కొన్ని మొక్కలతో, కుళ్ళిపోయిన వివిధ పదార్ధాలతో కూడి ఉంటుంది. దీన్నే మనం ద్వీపం అంటున్నాం . అయితే సాధారమైన ద్వీపాల్లా ఈ ప్రాంతం ఉన్న చోటులోనే ఉండదు. సరస్సులోని అన్ని దిశల్లోకి కదులుతుంది. ఇది సరస్సు మొత్తం విస్తీర్ణంలో 7% మాత్రం ఆవరించి ఉంటుంది. ఈ సరస్సు లోతును ఇప్పటి వరకూ ఎవరూ లెక్కించలేదు. తుఫానులు, సునామీలు వచ్చినపుడు చుట్టుపక్కల ఉన్న అనేక పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు ఇందులో పడి పూర్తిగా మునిగిపోయాయి.
ఈ సరస్సుని సృష్టించింది కూడా భీమసేనుడు కావడం విశేషం . మహాభారతంలోని మత్స్యగంథి, పరాశరుని కూడి సుగంథగంథి గా మారి వేదవ్యాసునికి జన్మనివ్వడం ఆతర్వాత సత్యవతిగా భీష్మునికి సవతితల్లిగా కురుసామ్రాజ్యంలోకి ప్రవేశించడం అందరికి తెలిసిన గాథే ఆ తరవాత ఆ వేదవ్యాసుని దయతోటె దృతరాష్ట్రుడు , పాండురాజు, విదురుడు జన్మించారు. ఆ విధంగా పరాశరుడికీ కురు వంశానికీ విడదీయరాని సంబంధమే ఉంది.
కురుక్షేత్ర మహాయుద్ధం తరువాత, పాండవులు ఈ ప్రదేశానికి చేరుకుంటారు. అపుడు పరాశర మహర్షి ఇక్కడి ప్రశాంతమైన పరిసరాలను చూసి ఇష్టపడతారు . ఎప్పటికీ ఇక్కడే నివసించాలని నిర్ణయించుకుంటారు. అపుడు భీముడు, ఆయన నివసించడానికి తన మోచేతితో ఒక పెద్ద కొండను కదిలిస్తాడు తద్వారా ఈ సరస్సు ఏర్పడుతుంది. కాబట్టి ఈ సరస్సు మోచేతి ఆకారంలో ఉంటుంది. పూర్వ కాలంలో చాలా మంది భక్తులు ఈ సరస్సును పవిత్రమైనదిగా భావించి, ఇక్కడికి వచ్చి అనేక నగలు, ఆభరణాలు వంటి వాటిని ఈ సరస్సులో వదిలేసి మొక్కు తీర్చుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఈ సరస్సు కింద అపారమైన సంపద దాగి ఉందని ప్రజల నమ్మకం.
ఈ నమ్మకాల సంగతి ఎలా ఉన్నా , ఈ పరాశర సరస్సు , దాని పక్కనే ఉన్న పరాశర ఆలయం దర్శనీయమైనవి. ఇంకా విశేషం ఏమిటంటే, ఈ ఆలయాన్ని ఒక చెట్టు నుండీ ఉద్భవించిన శిశువు ఆలయాన్ని నిర్మించామని ఆదేశించగా 13వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారట.
ఈ చరిత్ర, పురాణ ప్రశస్తి వింటేనే చాల గొప్పగా అనిపిస్తున్నాయి కదా ! అక్కడి మంచు నిండిన వాతావరణం, ఆధ్యాత్మిక శోభతో కూడిన పరిశరాల నడుమ కాసేవు ధ్యానం మనసుకి ఒక జీవితానికి సరిపోయే అనుభూతులని, ప్రశాంతతని అనుగ్రహిస్తాయనడంలో సందేహం లేదు.
శుభం !
Vedavyasa Maharshi, Vyasa Maharshi
#vyasamaharshi #vyasa