Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

నాగదోషం అంటే ఏమిటి ? పరిహారాలు ఎలా ఉంటాయి ? 
- లక్ష్మి రమణ 

నాగదోషం, సర్పదోషం లేదా కాలసర్పదోషం జీవితంలో ఎన్నో అవరోధాలని కలుగజేస్తాయి. వ్యక్తిగత , ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా నిరోధకాలుగా ఉంటాయి. ఈ దోషం అసలు ఎందుకు ప్రాప్తిస్తుంది ? దీనికి ఎటువంటి పరిహారాలు ఉంటాయి? అనే విషయాలని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.  

“అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ 
సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్”
అని శాస్త్రం చెబుతోంది. 

నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.

సర్పదోషం ఎందుకు ప్రాప్తిస్తుంది ?

సర్పదోషం లేదా నాగదోషం అనేది జన్మతః ప్రాప్తిస్తూ ఉంటుంది. జన్మించిన కాల నిర్ణయాన్ని బట్టి జాతకములో కాల సర్పదోషం ఉన్నటువంటి వారు, పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు సర్పదోషాన్ని పొందుతారు.  అదే విధంగా అనేకమైన  మంత్రములు , ఔషదులతో సర్పములని బంధించినవారు, పుట్టలను త్రవ్వినవారు, పుట్టలను తొలగించి వాటిపై ఇళ్ళు కట్టి నివసించేవారు కూడా సర్పదోషాన్ని పొందుతారు.  జన్మ జాతకములలో రాహు, కేతువుల మద్య గ్రహాలు ఉన్నా , జాతకములో పంచమంలో  రాహువు ఉన్న నాగదోషం ప్రాప్తిస్తుంది. ఇన్ని విధాలుగా “కాల సర్పదోషం” లేదా ‘నాగదోషం’ ప్రాప్తిస్తూ ఉంటుంది. 

దోష ప్రభావాలు : 

సర్ప దోషం ఉన్నవారికి వివాహం, సంతానం, కుటుంబం, అభివృద్ధి,ఆరోగ్యము తదితర విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి బాధిస్తుంది. జాతకచక్రంలో నాగదోషం ఉండడం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతుంది. సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. 

జాతకచక్రం - ప్రభావం : 

జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి, ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు.

జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉండి శుభగ్రహ దృష్టి లేనట్లయితే ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి.

జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనట్లయితే  సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. 

పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు.

జాతకచక్రంలో సప్తమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న బార్యా భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.

జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. దాంతో పాటు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, దురుసుగా మాట్లాడడం , పాము కలలు రావటం జరుగుతుంది.

శుభ తిధులు ఎంచుకోవాలి : 

నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు.

అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.

దోష ప్రభావాన్ని బట్టే పరిష్కారం: 

*నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే, దుర్గా ఆరాధన మంచిది.  అమ్మవారి ఆలయంలో నిద్రచేసి, తర్వాతి రోజు  శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజ,  దానాదికాలు చేసినట్లయితే నివారణ జరుగుతుంది.

*ఆరు ముఖాలున్నా రుద్రాక్ష గాని, గణేశ్ రుద్రాక్ష గాని, ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకల తో చేసిన రింగ్ని గాని,  చేతికి కడియం గాని ధరించడం శుభప్రదం.

*ప్రతీ శుక్లపక్ష పాడ్యమి, అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం ,పక్షులకు ఆహారం పెట్టడం వలన కూడా దోష నివారణ కలుగుతుంది .

*నాగ ప్రతిమ(సుబ్రహ్మణ్య ప్రతిమ) 27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయడం వలన నాగదోషం తొలగే అవకాశం ఉంటుంది. 

*ప్రతీ సోమవారం రాహుకాలములో  నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నాగదోషం నివారణ అవుతుంది.

*నవగ్రహములకు ఇరవై ఒక్క రోజులు ప్రదక్షిణలు చేయడం వలన శుభం జరుగుతుంది. రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా ఈ దోషం నివృత్తి అవుతుంది. 

*ప్రతీ ఆదివారం ఉపవాసముంటూ  నాగదేవతాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తు, లలితా సహస్రనామావళి గాని, దుర్గా సప్త శ్లోకి గానీ పఠిస్తే  శుభం జరుగుతుంది.

*సర్పదోష  ప్రభావం అధికంగా ఉన్నవారు  దేవాలయములో  సుబ్రహ్మణ్య/ నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం (నాగప్రతిష్ట) వలన పూర్తి దోష నివృత్తి జరుగుతుంది.

*అమ్మవారికి వీలున్నప్పుడు కుంకుమార్చన జరిపించడం , చేయడం వలన కూడా దోషం నివారణ జరుగుతుంది. 

*నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయడం ,  మంగళవారం/ ఆదివారం  ఉపవాసం ఉండడం శుభ ఫలితాలనిస్తుంది.

*రాహు కేతువులకు మూలమంత్ర జపములు తర్పనములు హోమము దానము చేయడం గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. 

*ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం/అభిషేకించడం సత్ఫలితాలనిస్తుంది.

*వెండి నాగ ప్రతిమ చేయించి, పదకొండు రోజులు మూలమంత్ర సహితముగా పూజించి (గురూపదేశం ఉన్నవారు)  బ్రాహ్మణునకు దానము చేయుట వలన కూడా దోష నివారణ జరుగుతుంది .

*మినుములు, నువ్వులు, ఉలువలు ప్రతీ మంగళవారం దానము చేస్తూ ఉండాలి.  ఇలా చేసినా దోష నివృత్తి అవుతుంది.

ఇవన్నీ చేయాలని కాదు. వీటిలో పాటించగలిగినవి, మనకి అనుకూలమైనవి , విశేషించి జ్యోతిష్యవేత్తలు సూచించిన పరిష్కారాలని పాటించి నాగదోషం/ సర్ప దోషము నుండీ విముక్తిని పొందవచ్చు.  

Nagadosham, Naga, Dosham, Sarpa, Solutions, Parishkaram, 

#nagadosham #sarpadosham

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi