"Yanmaya Vashvarti Vishwamkhilambrahamadidevasura,
Yat Sat Vadmrishave Bhati Sakalam Rajoo Yadhaahaibharama,
Yatpadah Palvmaive Bhati Hi Bhavambhodhaisitatti Shravtam,
Vandeaham Tamsheshkaranparam Ramakhayamesham Harim"
రాముడే స్థాపించిన ఏటా పెరిగే ప్రాణలింగం .
లక్ష్మీ రమణ
పంచభూతాత్మకమైన వాడు , ఆ పంచభూతాలకీ అతీతమైన వాడు ఈశ్వరుడు. ఆయన రూప నామ గుణ విశేషాలు ఎన్ని చెప్పుకున్న తనివి తీరదు. నిజానికి వాటన్నింటికీ అతీతమైనవాడేగా పరమేశ్వరుడు. పంచభూత తత్వాలతో ఆవిర్భవించిన శివస్వరూపాలుగా పరమేశ్వరుడు వాయులింగమై, జలలింగమై , పృధివీలింగమై , ఆకాశలింగమై, అగ్ని లింగమై దర్శనమిస్తున్నారు. అయితే ఈ పంచభూతాత్మకమైన వేదిక పైన ఆ విష్ణు స్వరూపమే స్థాపించిన ఏటా పెరిగే ప్రాణలింగం ఉన్న క్షేత్రాన్ని ఇప్పుడు మనం దర్శనం చేయబోతున్నాం .
భారత భూభాగం చేసుకున్న పుణ్యం అనంతం. అందుకే ఆ అనంతుడు అనేక రూపాల్లో వ్యక్తమై తన దివ్యానుగ్రహాన్ని అన్ని వైపుల నుండీ పూలజల్లులా కురిపిస్తున్నాడు. ఆస్వాదించడానికి, అనుభవించడానికి మనం చేతులు ముకుళించి భక్తిగా ఒక్కమారు తలుచుకుంటే చాలు . అంతకు ముంచి ఆ పుష్ప వర్షంలో తడిసి తరించిపోవడానికి చేయవలసిన మహత్కృత్యం ఏమీ లేదు . అటువంటి దివ్యానుగ్రహాన్ని ప్రసాదించే దేవదేవుడు తెలుగు గడ్డమీదే ఉన్నాడు .
తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం, రాయికల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై రామలింగేశ్వరుడిగా పరమేశ్వరుడు కొలువయ్యాడు. పంచభూతాలూ తానేనని తానూ వెలసిన ఈ గుట్ట పేరుతోనే స్పష్టం చేస్తున్నట్టుగా ఉంది కదూ ! ఈ పంచముఖ గుట్టపైన వెలసిన పంచముఖేశ్వరున్ని, రామేశ్వరునిగా పిలవడం వెనుక పెద్దకతే ఉంది . నిజానికి ఈ క్షేత్రాన్ని ఉత్తర రామేశ్వరంగా పేర్కొంటూ ఉంటారు.
ఈ శివుణ్ణి స్వయంగా ఆ విష్ణు స్వరూపుడు, ధర్మనిరతుడు అయిన ఆదర్శ పురుషోత్తముడు శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించారని విశ్వాసం. ఈ విషయం స్వయంగా దత్తుని స్వరూపంగా భావించే సద్గురు మహారాజ్ మాణిక్య ప్రభు చరిత్ర చెబుతోంది . అందుకే ఈయనకి రామ + ఈశ్వరుడు = రామేశ్వరుడు అని పేరొచ్చింది అని చెబుతారు .
ఈ ఈశ్వర లింగాన్ని సాక్షాత్తు శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడనడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు ఉంటుంది. రాక్షస రాజైన రావణాసురుని సంహరించి సీత సమేతంగా అయోధ్యకు బయలు దేరిన శ్రీ రాముడు దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలో బదరి వృక్షం కింద శివ లింగాన్ని ప్రతిష్ట చేసి పూజించారని భక్తుల నమ్మకం. కాలక్రమంలో ప్రకృతి విపత్తుల కారణంగా ఆ లింగాకారం కొన్ని వందల సంవత్సరాలు భూగర్భం లోఉండిపోయినట్టు చరిత్ర చెబుతుంది.
ఇదిలా ఉండగా, ఒకసారి నరసింహరాయలు రామేశ్వర గుట్టల మద్య తపస్సు చేస్తుండగా రామలింగేశ్వరుడు కలలో కనిపించి బదరి చెట్టు కింద ఉన్నాను అని చెప్పి అంతర్దానమైయ్యాడు. అప్పుడు అయన ఆ లింగాన్ని వెతికి తీసి ఆలయం నిర్మించి పూజలు చేసాడు. తరువాత నరసింహరాయల శిష్యుడు అప్పకొండ భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని, కోనేరుని నిర్మించి అభివృద్ధి చేసినట్టు చెబుతారు.
మహాశివ రాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇది ఏట పెరుగుతుంది అనటానికి నిదర్శనంగా లింగాకారం మీద పగిలిన గీతలు కనపడతాయి.
ఈ ఆలయం షాద్‌నగర్ ఎన్‌హెచ్ 44 నుంచి రాయకల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాయకల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరాలయానికి 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. షాద్ నగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ దివ్యమైన ఆలయాన్ని తప్పక దర్శించండి.
శుభం.