Manojavam maruta tulya vegam, jitendriyam buddhi mataam varishtham I
vaataatmajam vaanara yooth mukhyam, shree raama dootam sharnam prapadye II
హోరెత్తించే సముద్రపు అలజడి పూరీ ఆలయంలో వినిపించక పోవడానికి కారణం ఈ ఎనిమిది మంది !
-లక్ష్మీ రమణ
పూరీ క్షేత్రాన్ని పురాణాలు గొప్ప క్షేత్రంగా అభివర్ణించాయి. స్కాంద పురాణం పురుషోత్తమ క్షేత్రంగా వేనోళ్ళా కీర్తించింది. ఈ క్షేత్రంలో మరణించిన వారికి స్వయంగా లక్ష్మీ నారాయణులే దర్శనం ఇచ్చి మరు జన్మ లేకుండా అనుగ్రహిస్తారని ఈ పురాణం చెబుతోంది . అయితే, ఈ విషయాన్ని ఇప్పటికీ పూరీలో జరిగే అద్భుతాలు స్పష్టం చేస్తూనే ఉంటాయి . అవేమిటో మీరు హితోక్తిలో ఇదివరకు చదివే ఉంటారు . వాటిల్లో పూరీ క్షేత్రంలో వినిపించని సముద్ర ఘోష కూడా ఒకటి . సముద్రపు ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో హోరెత్తించిన సముద్రపు అలజడి , గుడిలో ప్రవేశించగానే ఇసుమంతైనా వినిపించకపోవడం ఒక అద్భుతమే ! దానికి కారణం ఏమిటో తెలుసా ? ఈ స్వామీ కాపలా కాయడమే !
పూరీ క్షేత్రం శంఖం ఆకారంలో ఉంటుంది . ఆ ఆశంఖానికి చుట్టూ ఎనిమిది దిక్కులా ఆ హనుమంతుడు ఎనిమిది రూపాయలని పొంది కాపలా కాస్తూ ఉంటారు. ఇదే సముద్రపు ఘోష పూరీ ఆలయంలోకి ప్రవేశించక పోవడానికి కారణం . అలా ఎలా సాధ్యం అవుతుంది ? అనుకుంటున్నారా ! అయితే, పూరీ చుట్టూ విస్తరించి ఉన్న ఆ హనుమంతుని రూపాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందే ! ఆ స్వామీ ఇలా ఎనిమిది రూపాల్లో ఆవిర్భవించిన అవతార గాథలని తెలుసుకుంటే , ఈ అద్భుతం వెనుక ఉన్నది హనుమంతుడే అనే విషయం స్పష్టమవుతుంది.
పూరీలోని శ్రీనిలయం లేదా జగన్నాథ మందిరాన్ని రక్షిస్తూ అష్ట మహావీర దేవాలయాలలో హనుమంతుడు ఎనిమిదిరూపాల్లో నెలకొని ఉన్నారు . వారే , 1. సిద్ధ మహావీర, 2. దరియా మహావీర లేదా బేడీ మహావీర, 3. కనపత మహావీర, 4. వర్గీ మహావీర, 5. పంచ ముఖి మహావీర, 6. తపస్వి హనుమాన్ 7.సిరులి హనుమాన్ 8. సుగ్రీబా హనుమాన్
సిద్ధ హనుమాన్:
సిద్ధ మహావీర్ ఆలయం పూరీలోని గుండిచా ఆలయానికి ఈశాన్య దిశలో సుమారు 1 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది. ఇది పూరీలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. రామచరిత మానస్ రచించిన తులసీ దాస్ పూరీని సందర్శించినప్పుడు కొంత కాలం ఇక్కడ ఉన్నారు. ఈయన పేరుకి తగ్గట్టు సుమారు 6 అడుగుల ఎత్తు తో దర్శనమిస్తారు . కుడి చేతిలో భారీగా ఉండే గంధమాదన పర్వతాన్ని పట్టుకొని ఉంటారు.
కనపత హనుమాన్:
కనపత హనుమంతుడు జగన్నాథ దేవాలయం పశ్చిమ ద్వారంపై ఉన్నాడు. సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న తరువాత, భగవంతుడు ఆ సాగరానికి అల్లుడు అయ్యారు. అయితే,
రాత్రిపూట సముద్రపు అలలు పూరీ అంతటా పెద్ద శబ్దం చేస్తాయి. ఒక సారి ఈ శబ్దం జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి, భగవంతుని నిద్రను భంగపరిచింది. భగవానుడు సముద్రునికి భంగం కలిగించే శబ్దం చేయవద్దని ఆదేశించాడు. అప్పటినుండి సముద్రపు ఘోష జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించలేదు. ఆవిధంగా ప్రవేశించకుండా కాపలా కాయడానికి భగవానుడు తన భక్తుడైన హనుమంతుడిని దక్షిణ ద్వారం వద్ద నియమించారు . “కనపత” అంటే చెవులను (కన) వినడానికి నిమగ్నం చేయడం. అందువలన హనుమంతుడిని ఇక్కడ కనపత హనుమంతుడు అని పిలుస్తారు.
వర్గి హనుమాన్:
ఈ ఆలయం జగన్నాథ ఆలయానికి పశ్చిమాన లోకనాథ రహదారిపై ఉంది. పూర్వం, మహారాష్ట్రకు చెందిన కొందరు గుర్రం మీద ఈ మార్గం గుండా దాడులు సాగించేవారు . ఇది ఆలయానికి, పూరీ ప్రజలకు ఇబ్బందిని కలిగించింది . కాబట్టి వారు పూరీలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ఈ ప్రాంతంలో హనుమాన్ మూర్తిని ఉంచారు. వీరు హనుమంతుని ఉల్లంఘించి ముందుకు వెళ్లలేకపోయారు . ఆ విధంగా ఆ మార్గానికి వర్గీ హనుమంతుడు రక్షకుడయ్యారు .
బేడీ హనుమాన్ లేదా దరియా హనుమాన్:
పూరి జంక్షన్ నుండి 1.5 కి.మీ దూరంలో, జగన్నాథ దేవాలయానికైతే 3 కి.మీ దూరంలో బేడి హనుమాన్ దేవాలయం ఉంది . ఇది పూరీలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. స్థానిక భాషలో, ' దరియా ' అంటే సముద్రం. ఆవిధంగా సముద్ర హనుమంతుడిని ఈ స్వామిని పిలుస్తారు . ఈయన సముద్రపు ఉగ్రత నుండీ పూరీని రక్షిస్తారని విశ్వాసం.
ఇక ఈయనకి 'బేడీ హనుమాన్' అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అయితే జగన్నాథ ఆలయాన్ని నిర్మించినప్పుడు సముద్ర దేవుడైన వరుణుడు జగన్నాథుని ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నాడు. ఇంతలో సముద్రపు నీరు నగరంలోకి ప్రవేశించింది. దాంతో ఆలయానికి భారీ నష్టం వాటిల్లింది. హనుమంతుడు కాపలాగా ఉండగానే , సముద్రం లోపలి ఎలా ప్రవేశించిందో వివరించమని భక్తులు జగన్నాథుడిని ప్రార్థించారు.
అందుకు సమాధానంగా ఆ సమయంలో తాను లేనని, తనకు తెలియజేయకుండానే అయోధ్యకు వెళ్లిపోయానని హనుమంతుడు చెప్పాడు. అయోధ్యలో హనుమంతుని అనాలోచిత సందర్శన గురించి విన్న జగన్నాథుడు అతని చేతులు మరియు కాళ్ళను తాడుతో (బేడీ) కట్టి, పగలు మరియు రాత్రి సముద్ర తీరంలో అప్రమత్తంగా ఉండమని కోరారు. ఈ విధంగా స్వామి చేతులు, కాళ్ళు తాడుతో కట్టబడినందున, అతన్ని 'బేడీ హనుమాన్' లేదా 'గొలుసుకట్టు హనుమాన్' అని పిలుస్తారు.
ఇదిలా ఉంటె, హనుమంతుడు అలా అయోధ్యకి వెళ్ళడానికి కారణం ప్రతిరోజూ ఖిచడి ప్రసాదం మాత్రమే నైవేద్యంగా ఇవ్వడం . రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలనుకుని రాత్రిపూట రహస్యంగా అయోధ్యను సందర్శించారట. ఈ మొత్తం సంఘటన తరువాత, జగన్నాథుడు తన సేవకులను హనుమంతునికి ప్రతిరోజూ ప్రత్యేక మహాప్రసాదాన్ని సరఫరా చేయమని ఆదేశించారు . నేటికీ ఆలయంలో హనుమంతునికి ప్రత్యేక లడ్డూలను సమర్పిస్తారు.
4 అడుగుల ఎత్తులో, సాయుధుడైన హనుమంతుడు మీసాలతో దర్శనం ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత సింధూరం ఆయన ముఖం మీద మాత్రమే రాస్తారు . ఇతర శరీర భాగాలపై రాయరు . ఆయన పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటారు .
పంచముఖి హనుమాన్:
గుండిచా ఆలయానికి పశ్చిమం వైపు, పవిత్ర ఇంద్రద్యుమ్న ట్యాంక్ ఒడ్డున పంచముఖి హనుమాన్ ఆలయం ఉంది. ఐదు ముఖాలతో స్వామి దర్శనమిస్తారు. ఉత్తరాన వరాహ, దక్షిణాన నరసింహ, తూర్పున హనుమంతుడు, పశ్చిమాన గరుడ, ఎగువన హయగ్రీవ ముఖాలతో ఉంటారు.పది భూజాలతో రాక్ష సంహారం చేస్తూ దర్శనమిచ్చే ఈ స్వామి ఆర్తజన రక్షకుడు అనడంలో సందేహం లేదు .
తపస్వి హనుమాన్:
శ్రీ మందిర రక్షణ కోసం శ్రీ జగన్నాథ ఆలయానికి ఉత్తర ద్వారం వద్ద తపస్వీ హనుమంతుడు కొలువై ఉన్నారు . ఈయన్ని స్థానికులు కారి-చక్ర అని కూడా పిలుస్తారు. నాలుగు చక్రాలని ధరించినవాడని అర్థం . అలాగే ఈయన తన చేతుల్లో నాలుగు చక్రాలను పట్టుకుని దర్శనమిస్తారు .
సిరులి హనుమాన్ :
పూరీలోని శ్రీమందిరాన్ని కాపాడేందుకు జగన్నాథుడు హనుమంతుడిని నియమించారు . కానీ హనుమ నిద్రించేప్పుడు ఆయన పెట్టె గురక లక్ష్మీ దేవిని కలవరపెట్టిందట. అప్పుడు హనుమంతుడు కొంత దూరం జరిగి సిరులికి చేరి అక్కడ మకాం వేశారని స్థలైతిహ్యం.
పూరీ పట్టణానికి ఈశాన్యంగా 27 కి.మీ దూరంలో ఉన్న సిరులి మహావీర్ ఒక చిన్న దేవాలయం. రావణుడిని ఓడించిన తరువాత, శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజుగా అభిషేకించబడ్డాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలోనే హనుమంతుడు తీర్థయాత్రకు బయలుదేరి పూరీలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించాడు. పూరి నుండి తిరిగి వస్తుండగా, తామర పువ్వులతో నిండిన అందమైన చెరువును చూసి, అక్కడ సాయంత్రం పూజలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా హనుమంతుడు తన ప్రార్థనలు చేసిన ప్రదేశంమే సిరులి హనుమాన్ ఆలయం ఉందని మరో విశ్వాసం .
మరొక పురాణం ప్రకారం, హనుమంతుడు సిరులికి వెళుతున్నప్పుడు, ఒక రైతు నాగలితో దున్నుతుండగా , అతని పొడవాటి తోక గాయపడింది. రైతు తన భూమిని సాగు చేస్తుండగా నాగలి నుంచి రక్తం కారడం చూసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అక్కడికక్కడే హనుమంతుడికి ఆలయాన్ని ఏర్పాటు చేయమని జగన్నాథుడు కోరాడు. కందగోడ గ్రామంలో హనుమంతుని పొడవాటి తోకను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారట. అలా ఇక్కడ హనుమంతుని దేవాలయం నెలకొంది.
ఇక్కడ విశేషం ఏమిటంటే , సిరులి ఆలయంలో ఉన్న హనుమాన్ విగ్రహంలోని ఎడమ కన్ను పూరీలోని జగన్నాథ దేవాలయం వైపు చూస్తుంది . కుడి కన్ను రావణుడి రాజ్యం లంక వైపు చూస్తూ దక్షిణంగా ఉంటుంది. హనుమంతుని ఎడమ కన్ను రంధ్రం ద్వారా పూరీ జగన్నాథ ఆలయంపై ఉన్న నీల చక్రాన్ని చూడవచ్చని స్థానికులు చెబుతారు.
జగన్ంత బల్లవ్ మఠం లోపల పూరీ రాజా హనుమాన్ అని కూడా పిలువబడే సుగ్రిబా మహావీర్
ఆ విధంగా హనుమంతుల వారు ఎనిమిది రూపాల్లో ఆ శ్రీక్షేత్రాన్ని రక్షిస్తూ ఉండడమే పూరీ ఆలయంలో సముద్రపు ఘోష వినిపించక పోవడానికి కారణమన్నమాట . అద్భుతమైన ఈ క్షేత్రాన్ని, ఈ క్షేత్రం చుట్టూ ఉన్న హనుమంతుని క్షేత్రాలనీ ఎవరైతే దర్శిస్తారో వారిని యముడు గానీ, శనీశ్వరుడు గానీ ఆఖరికి బ్రహ్మ దేవుడుగానీ శాశించలేరని పురాణ వచనం .
శ్రీ జగన్నాథ కృపా కటాక్ష సిద్ధిరస్తు !!
Puri Jagannath, Hanuman, Anjaneya, Siddha Mahaveer, Dariya Mahavir, Bedi Mahavir, Bedi Hanuman, Kanapatha Mahavir, Pargi Mahavir, Panchamukhi Mahavir, Tapasvi Hanuman, Siruli Hanuman, Sugriba Hanuman
#purijagannath #Anjaneya #Hanuman