
“Vinaa Venkatesam Nanaadho Nanatha
Sadhaa Venkatesam Smaraami Smaraami
Hare Venkatesa Praseedha Praseedha
Priyam Venkatesa Prayaccha Prayaccha”
కలియుగ ప్రత్యేక్ష దైవాన్ని గురించి యాజ్ఞవరాహ స్వామీ ఏమన్నారు .
- లక్ష్మి రమణ
వరాహ స్వామి, వారాహి ఇద్దరూ కూడా శ్రీమహావిష్ణు స్వరూపాలు. వీరిని ఆరాధించడం వలన పంటలు బాగా పండుతాయి. భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. కేవలము భగవంతుని పాతాళ ముందర కూర్చొని పెద్ద పెద్ద పూజలు చేయడం వలన మాత్రమే స్వామి అనుగ్రహం దొరుకుతుంది అనుకుంటే పొరపాటే ! ఆయన కథలని వినడం, చదవడం, భక్తిగా మనసులో రోజూ నమస్కరించుకోవడం కూడా ఏవ్ ఫలితాన్ని అనుగ్రహిస్తాయని గ్రహించాలి . స్కాంద పురాణంలోని ఈ దివ్యమైన యాజ్ఞవరాహస్వామి రూపాన్ని ఆషాడ నవరాత్రులు సమీపిస్తున్న ఈ దివ్యమైన కాలంలో స్మరించినా చాలు జన్మ జన్మల పాపాలూ తొలగిపోతాయి. కలియుగంలో కేవలం స్మరణ మాత్రం చేత పరమాత్మ అనుగ్రహిస్తారు. ఆవిధంగా స్వామి రక్షణ అనుగ్రహం పొందినవారమవుతాం .
పూర్వం దేవయుగంలో ఒకరోజు నారద మహర్షి వివిధ రకాల రత్నాలతో ప్రకాశిస్తున్న సుమేరు పర్వతం మీదకు వెళ్లారు. ఆ పర్వతం మధ్యలో ఉన్న విశాలమైన ప్రాంతం బ్రహ్మదేవుడి నివాసం. అక్కడికి వెళ్లిన నారదుడు దానికి ఉత్తర దిశలో ఒక పెద్ద రావి చెట్టుని చూశాడు. అది 1000 యోజనాల పొడవుతో, రెండు వేల యోజనాల విస్తీర్ణంతో వ్యాపించి ఉంది. ఆ దివ్యవృక్షం మొదట్లో నవరత్నాలతో నిర్మించిన ఒక అందమైన మండపం ఉంది. పద్మరాగమణులతో చేసిన వేలకొద్దీ స్తంభాలు ఆ మండపంలో కొలువుతీరి ఉన్నాయి. దాని ముఖద్వారం పద్మ రాగమణులతో అలంకరించబడి ఉంది. ఆ ద్వారం నుంచి లోపలికి ప్రవేశించిన నారదుడు అక్కడ ఒక ముత్యాల మండపాన్ని చూశాడు. ఆ మండపంలో వైడూర్యాలతో చేసిన ఎత్తైన వేదిక ఉంది. దానిమీద గొప్ప కాంతితో మెరిసిపోయే బంగారు సింహాసనం కనిపించింది. ఆ సింహాసనం మీద వేయి రేకులతో, వేయిచంద్రుల కాంతితో వెలుగొందుతూ, కేసరాలతో ప్రకాశిస్తున్న ఒక అందమైన తామర పువ్వుని చూశాడు నారదుడు. ఆ తామర పువ్వు మధ్యలో చిద్విలాసంగా యజ్ఞవరాహమూర్తి ఆసీనుడై నారదుడికి దర్శనమిచ్చాడు.
బ్రహ్మ, వశిష్ఠుడు, అత్రి, మార్కండేయుడు, బృగువు లాంటి మహర్షులు ఆయన్నీ సేవిస్తున్నారు. ఆ విధంగా లోక పాలకులతో, గంధర్వులతో, అప్సరసులతో,మునిపుంగవులతో సేవించబడుతున్న ఆ వరాహమూర్తికి నారదుడు ఎంతో భక్తిగా నమస్కరించాడు. మనము కూడా ఈ విధంగా అనుగ్రహమూర్తిగా విరాజిల్లుతున్న అనుగ్రహ స్వరూపమైన యాజ్ఞవరాహ స్వామికి నమస్కారం చేసుకుందాం . భావన చేత ఆ స్వామిని దర్శిద్దాం .
అదే సమయంలో దేవదుందుభులు మోగాయి. ఆ ధ్వనితో పాటు రత్నాభరణాలు ధరించినటువంటి భూదేవి తన చెలికత్తెలతో కలిసి అక్కడికి వచ్చింది. ఆమె తన చెలికత్తెలు తీసుకొచ్చిన పూలను తీసుకుని యజ్ఞవరాహమూర్తి పాదాల మీద సమర్పించారు . వరాహమూర్తి సంతోషించి భూదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. భూదేవిని కుశల ప్రశ్నలు వేసి, “ఓ దేవి నిన్ను మోస్తూ ఉండమని నీ కింద పాతాళంలో ఆదిశేషున్ని నిలిపాను. అలాగే మీకు సహాయంగా ఎన్నో పర్వతాలని నీ మీద నెలకొల్పాను ఎందుకు ఇక్కడికి వచ్చావు నీకేమైనా కష్టం కలిగిందా? చెప్పు” అని ప్రశ్నించాడు.
అందుకు భూదేవి “ఓ నాథా ! పాతాళంలో ఉన్న నన్ను పైకి తెచ్చి అది శేషుడి పడగల మీద ఉంచావు. నాకు తోడుగా నన్ను ధరించే శక్తి కలిగిన నీ అంశతో ఉండే పర్వతాలను ఏర్పాటు చేశావు. చాలా సంతోషం. అయితే నాకు ఆధారంగా ఉన్న పర్వతాలలో నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నవో ఆ చోటుని గురించి వివరించాల్సిందిగా వేడుకుంటున్నా”నని స్వామికి నమస్కరించింది .
అప్పుడా వరాహమూర్తి “ఓ దేవీ దక్షిణ దిశలో ఉన్న పర్వతాలలో అరుణాద్రి, గజ పర్వతం, రుద్రాద్రి, ఘటికాచలమనే పర్వతాలు చాలా గొప్పవి. ఈ పర్వతాలన్నీ పాల సముద్రానికి దగ్గర్లో ఉన్నాయి. గజ పర్వతానికి ఉత్తర దశలో ఐదు యోజనాల దూరంలో సువర్ణముఖి అనే నది ఉంది. ఆ నదికి ఉత్తరంగా కమలా అనే పేరుతో ఒక సరోవరముంది. ఆ సరోవర తీరంలో పూర్వం సుక మహర్షికి వరప్రదానం చేసిన శ్రీహరి కొలువై ఉన్నాడు. ఆయన నిత్యం మునిగణాల చేత ఆరాధించబడుతూ ఉంటాడు.
కమల సరోవరానికి ఉత్తరంగా ఉన్నా అరణ్యంలో రెండున్నర యోజనాల దూరంలో హరి చందన వృక్షాలు దట్టంగా ఉన్న ప్రదేశంలో వాసుదేవుడి నివాసమైన వెంకటాచలం నెలకొంది. 7 యోజనాల విస్తీర్ణంలో ఉన్న ఆ పర్వతం బంగారంతో నిండి, రత్నాల సానువులతో చాలా ఉన్నతంగా కనిపిస్తోంది. ఇంద్రాది దేవతలు, వశిష్టాది మునీశ్వరులు, సిద్ధులు, మరుత్తులు, దానవులు, మరుత్తులు, దానవులు, గంధర్వులు, కిన్నరులు, రాక్షసులు, రంభాది అప్సరసలు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. ఓ దేవి వీళ్లంతా తపస్సు చేసే ఆ వెంకటాచలం మీద ఎన్నో దివ్యమైన సరోవరలు, తీర్థాలు ఉన్నాయి. శ్వేతవరాహ మూర్తిగా నేను , వేంకటేశ్వరుడు అక్కడ కొలువయ్యాము. దేవీ నాకు , ఆ వేంకటేశ్వరునికి తేడాలేదని నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కదా !” అంటూ వెంకటాచలం గురించి మొట్టమొదటిసారిగా ఆ యజ్ఞ వరాహమూర్తి భూదేవికి చెప్పారని స్కాంద పురాణం వివరిస్తుంది.
కాబట్టి కలియుగంలో భక్తులని అనుగ్రహించేందుకే మేము ఈ విధంగా అవతరించామని భూదేవికి స్కాంద పురాణంలో యజ్ఞ వరాహ స్వామీ వివరించినట్టుగా ఉంది. రుతుపవనాలు అనుగ్రహించి, పుడమి పులకరించి రైతన్నలు విత్తులు నాటే ఈ సమయంలో, ఈ స్వామిని స్మరించుకోవడం దివ్యమైన అనుభూతిని అనుగ్రహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు .
శుభం !!
Varaha Swami, Venkateswara Swamy, Tirumala, Swami, Srinivasa, Venkateshwara, Venkateswara
#varahaswami #venkateswaraswami #tirumala