రామాయణంలో శ్రీమహావిష్ణువుకు సాయంచేసినవి సామాన్యమైన కోతులేనా ?
-సేకరణ
రామాయణం ఒక అద్భుతకావ్యం. తరచి చూసిన వాడికి అది వేదవేదాంతాల సారం. ఆ అద్భుత దివ్య కావ్యంలో నరుడైన రాముడు, వానరముల సహాయంతో రాక్షసమూకలని తరిమికొట్టి మహా సాధ్వి అయినా సీతమ్మని రక్షించుకోవడం గొప్ప ఘట్టం. ఈ ఘట్టంలో వనరులు కొన్ని వేలమంది రాములవారి సైన్యమై రక్కాసి మూకల పీచమణుస్తారు. ఇంతటి దేహబలం , బుద్ధిబలం సామాన్య వానర జాతికి ఎలా సాధ్యమయ్యింది ? రామాయణంలో రాముడైన శ్రీమహావిష్ణువుకు సాయంచేసినవి సామాన్యమైన కోతులేనా ?
శ్రీ మహా విష్ణువు దశరథ మహారాజు భార్యల గర్భవాసాలలో ప్రవేశించగానే బ్రహ్మదేవుడు దేవతలనందరినీ చూసి, "సత్యసంధుడూ, మహావీరుడూ, మనపాలిటి హితైషీ అయిన శ్రీ మహావిష్ణువు కొత్త అవతారానికి సాయంగా వుండడానికి మహాబలవంతులూ, కామరూపులూ అయిన యోధులను కనండి.
ఆ యోధులందరూ ఎలాంటి మాయలైన తెలిసికోగలవారూ, శూరులూ, వాయువేగులూ, నీతిశాస్త్రం బాగా తెలిసినవారూ, బుద్ధిమంతులూ, శ్రీమహావిష్ణువుతో పోల్చతగిన పరాక్రమవంతులూ, సర్వాస్త్రశస్త్ర సమర్థులూ, మీలాగే ఆకలిదప్పులు లేనివారూ అయి ఉండాలి. వారు వానరరూపులున్నూ అయి ఉండాలి. నేనిదివరకే ఎలుగుబంటి జాతిలో జాంబవంతుణ్ణి సృజించి ఉన్నాను.
అతడు నేనావులిస్తూ వుండగా నా ముఖంలో నుంచి పుట్టుకు వచ్చాడు" అని చెప్పాడు.వెంటనే ఈ శాసనం శిరసావహించి మహర్షులూ, సిద్ధులూ, విద్యాధరులూ, నాగులూ, చారణులూ అనేక లక్షల కుమార్ళను కన్నారు.
దేవేంద్రుడు తనతో సమానుడూ మహాతేజశ్శాలీ అయిన వాలిని కన్నాడు. ప్రతాపవంతులలో అగ్రేసరుడైన సూర్యుడు సుగ్రీవుణ్ణి కన్నాడు. బృహస్పతి తారుణ్ణి కన్నాడు. తారుడు తండ్రిలాగే కుశాగ్రబుద్ధి. వానరులలో అంతటి బిద్ధిమంతుడు మరొకడు లేడు.
కుబేరుడు గంధమాదనుణ్ణి కన్నాడు. విశ్వకర్మ నలుణ్ణి కన్నాడు. అగ్నిదేవుడు నీలుణ్ణి కన్నాడు. తేజస్సులోనూ, యశస్సులోనూ, బలపరాక్రమాలలోనూ అతనిని మించిన వానరుడు మరొకడు లేడు. సుందరులూ, ధనికులూ అయిన అశ్వనీ దేవతలు అందగాళ్ళయిన మైందుణ్ణి, ద్వివిదుణ్ణీ కన్నారు. వరుణుడు సుషేనుణ్ణి కన్నాడు.
పర్జన్యుడు మహాబలసంపన్నుడైన శరభుణ్ణి కన్నాడు. వాయుదేవుడు ఆంజనేయుణ్ణి కన్నాడు. అతడు వేగంలో గరుత్మంతునితో సమానుడు. అతని శరీరం వజ్రంలాగ అభేద్యం.వీరే కాక, ఇంకా అనేక లక్షల మంది అసమాన్య బలపరాక్రమవంతులైన అనేకమంది వానరులను కన్నారు. ఏ దేవుడు ఏ రూపంగలవాడో, యే వేషం గలవాడో, ఎంతటి పరాక్రమం కలవాడో అతని కొడుకున్నూ అలాంటి రూపమూ, అలాంటి వేషమూ, అంతటి పరాక్రమమూ కలవాడైనాడు.
ఆ భల్లూక వీరులూ, వానరవీరులూ మేరుమందర పర్వతాలతో సమానులూ, మహాబలశాలులూ అయి అతివేగంగా వృద్ధిపొందారు.ఇలాంటి వానరయోధులు నూరు లక్షలు పుట్టారు. వారితో సేనాధిపతులైనవారు కూడా గొప్ప యోధులైన వానరులను కన్నారు. వారిలో కొందరు ఋక్షవత్పర్వతం మీద నివసించారు. తక్కినవారు మిగతా పర్వతాల మీద నివసించారు. వారిలో చాలా మంది సూర్యపుత్రుడైన సుగ్రీవుణ్ణీ, ఇంద్ర కుమారుడైన వాలినీ ఆశ్రయించుకుని వుండిపొయారు. మహాబలవంతులైన నలుణ్ణీ, నీలుణ్ణీ, హనుమంతుణ్ణి కూడా మరికొందరు ఆశ్రయించుకుని వుండిపోయారు.అందరికంటే గొప్పవాడైన వాలి ఆ యెలుగు గొడ్డులనూ, ఆ కోతులనూ స్వేచ్చగా పరిపాలిస్తూ వాటికి రాజయ్యాడు.
అదీ కథ . అందుకే ఆ వానరాలు రాముల వారికి తోడయ్యాయి. ఆ మహావిష్ణువే నరుడై, దేవతలే ఆయన వానర సైన్యమై రక్కసి మూకలని తరిమి కొట్టాయి. దీనిలో చూస్తే, ఆదర్శ మానవుడు ప్రవర్తించాల్సిన తీరు మాత్రమే కాదు, యోగశాస్త్ర, మంత్రశాస్త్ర, వేదవేదాంత రహస్యాలు ఎన్నో కనపడతాయి. కావాల్సిందల్లా , భావ సంపద, విజ్ఞాన దృష్టి. అంతే.
శుభం .
Ramayanam, Vanara Sainyam, Monkeys
#Ramayanam