Online Puja Services

తెలుగు నేలమీద వెలసి, కలలో అనుగ్రహించే కామాక్షి కథ . 
-సేకరణ 

కోరినవారికి కొంగు బంగారమైన తల్లి కామాక్షి. కామాక్షి అమ్మవారి ఆలయాల గురించి తలచుకోగానే మొట్టమొదట గుర్తొచ్చేది తమిళనాట ఉన్న కంచి కామాక్షే. కానీ అమ్మవారి కృపకి హద్దులున్నాయా ? ఉంటాయా ? ఆ దేవదేవి కొలువైన తెలుగు క్షేత్రం గొప్ప వైభవాన్ని, చరిత్రని సొంతం చేసుకున్నది.  అటువంటి దివ్య క్షేత్రాన్ని సందర్శించి ఆ దివ్య వైభవాన్ని ఈ అక్షరాల్లో ఆస్వాదిద్దాం రండి . 

అవతార విశేషం : 

లోకహితం కోరిన కశ్యప మహర్షి ఒకసారి పినాకిని ఒడ్డున తల్పగిరి, రజితగిరి, వేదగిరి అనే కొండల వద్ద యాగం మొదలుపెట్టాడు. యాగం ముగిసిన తర్వాత మల్లికార్జునస్వామి ప్రత్యక్షమయ్యాడు. పరమానందభరితుడై ప్రత్యక్షమైన పరమేశ్వరుని చూసి కాశ్యప మహర్షి ‘స్వామీ! లోకహితం కోసం తొందరపడి ఒంటరిగా వచ్చావే! దేవి కూడా ఇక్కడ ప్రత్యక్షమైతే మహదానందం కలుగుతుంది’ అన్నాడు. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి సమ్మతించగా కామాక్షిదేవి ప్రత్యక్షమైంది. కాశ్యప మహర్షి మల్లికార్జునస్వామిని, కామాక్షిదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. పూజలు సల్పారు.

దూర్వాసుని శాపం : 

ఆ సమయంలో తీర్ధయాత్రలకు బయలుదేరిన దుర్వాసముని రాజగిరికి చేరుకున్నాడు. అయితే ఆయన రాకను గమనించలేదు శివుడు. అందువల్ల ఆగ్రహించిన దుర్వాసముని శివునితో ‘ఈప్రదేశంలోని ఆలయం పుట్టుపూర్వోత్తరాలే లేకుండా పోతుంది’ అని శపించాడు.

ప్రళయం వచ్చింది. పినాకిని నదిలో ఉప్పెన పొంగింది. ఉప్పెనలో ఆలయం మునిగిపోయింది. మల్లికార్జునస్వామి, కామాక్షిదేవిల విగ్రహాలు ఉప్పెనలో కొట్టుకుపోయాయి. ఇది పూర్వగాథ.

జొన్నవాడ కామాక్షి : 

పచ్చనిపైర్లతో ఎంతో సమృద్ధిగా ఉన్న జొన్నవాడ ప్రదేశంలో పశువుల కాపర్లు తమ పశువులను మేపుతున్నారు. వారిలో ఒక బాలుడు భూమిలో ఏదో ప్రకాశం ఉన్నట్టు చూసాడు. అక్కడ భూమిని తవ్వగా ఒక శివలింగం కనిపించింది. ప్రజలు దాన్ని చూసి ఆ లింగం ఉప్పెనలో కొట్టుకుపోయిన లింగం అని తెలుసుకున్నారు. లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆయనతో పాటు ఉండాల్సిన కామాక్షిదేవి ఏమయింది? నని చింతించసాగారు. మరికొద్ది రోజుల్లోనే ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. పినాకిని నదిలో చేపలు పట్టడానికి విసిరిన వలలో అమ్మవారి విగ్రహం దొరికింది. సంతసించిన ప్రజలు మల్లికార్జునస్వామి పక్కనే అమ్మవారిని ప్రతిష్టించారు. వారు తినే మాంసం, చేపలనే నైవేద్యంగా సమర్పించసాగారు. 

కాని ఆ అమ్మవారు రాత్రిపూట బిగ్గరగా నవ్వడమూ, ఉగ్రరూపంలో సన్నిధి వదిలి ఊరిలోపలికి ప్రవేశించి ఆవులను, కొంగలను, కోళ్లను చంపి స్వాహా చేయసాగింది. ప్రపంచాన్ని కాపాడాల్సిన తల్లి అలా జీవరాశులను నాశనం చేయడం చూసి ప్రజలు కలవరపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఆదిశంకరుడు వచ్చారు. మల్లికార్జునస్వామిని, కామాక్షిదేవిని దర్శించుకుని పూజించాడు. ఆరోజు రాత్రి ఆ ఆలయంలోనే ఉండి ఉదయాన  బయలుదేరాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 

ఆ దేవి ఆదిశంకరుణ్ణి కూడా హింసిస్తుందేమోనన్న అనుమానంతో ప్రజలు భయపడ్డారు. అమ్మవారి గురించి, ఆమె మాంసాహార్రపీతి గురించి వారు ఆదిశంకరునికి తెలిపారు. ఆమె వెళ్లే మార్గంలో ఆదిశంకరుడు శయనిస్తే ఆయన ప్రాణాలకు హాని జరుగుతుందని ప్రజలు వారించారు. ఆయను జాగ్రత్తగా ఉండమనిచెప్పారు. ఆదిశంకరుడు ‘మీ పశువులను ఆ కామాక్షిదేవి భుజించకుండా ఉండేలా చేస్తాను’ అని మాటిచ్చాడు

అమ్మపైన ఆదిశంకరుల ఆంక్ష: 

అర్ధరాత్రి అయ్యింది. దేవి బిగ్గరగా నవ్వుతూ ఆలయంనుండి బయటికి వెళ్లింది. దారిలో శయనించిన ఆదిశంకరుణ్ని తప్పుకోమని హెచ్చరించింది. ఆదిశంకరుడు ఆ దేవినిప్రసన్నం చేసుకోవాలని స్తుతించారు. ఆయన కీర్తించే ఒక్కో శ్లోకానికి అమ్మవారి రౌద్రం తగ్గసాగింది. ఆమె మొహం ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ఆదిశంకరుడు ఆమె ఎదుట ఒక శ్రీ చక్రాన్ని స్థాపించాడు. ఆ తర్వాత దేవిని చూసి ‘‘తల్లీ! భక్తులు ఇకపై భయపడకుండా నిన్ను పూజించాలంటే నువ్వు ఇకపై వికటాట్టహాసం చేయకూడదు. మాట్లాడకూడదు. ఆలయంనుండి బయటికి వెళ్లకూడదు’’ అని ఆంక్ష విధించాడు. 

కలలోనే అనుగ్రహం : 

దేవి ‘‘నన్ను నమ్మి వచ్చే భక్తులకు వరములివ్వడం, ఆశీర్వదించడం ఎలా’’ అని ప్రశ్నించింది

‘‘భక్తుల కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించు. వారు వేడుకుంటే నెరవేరుస్తానని తెలిసేలా చేసి, వారు సంతోషంగా జీవించడానికి సాయపడు’’ అన్నాడు ఆదిశంకరుడు.

కామాక్షిదేవి ఆయన ఆంక్షలకు కట్టుబడింది. తన సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని వరమిచ్చింది.

ఆలయంలో అమ్మ దర్శనం : 

నెల్లూరునుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడలో శాంతస్వరూపిణిగా కామాక్షిదేవి కొలువై ఉంది. అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున వున్న మార్గంలో వెడితే పినాకిని నదికి చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన మహిళా ద్వారపాలకులు గోచరిస్తారు. లోపలికి వెడితే విశాలమైన లోగిలి. దాన్ని దాటి వెడితే ముందుగా కల్యాణ మండపం వస్తాయి. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్థంభం ఉంటాయి.

ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దానిపక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి. ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు. అర్ధమండపం తర్వాత వరసగా గర్భగుడులు ఉంటాయి. మొదటి గర్భగుడిలో లక్ష్మీగణపతి, ఎడమవైపున చిన్న మహలక్ష్మి విగ్రహం ఉంటాయి. గర్భగుడిలో మల్లికార్జునస్వామి కొలువై ఉన్నారు. చిన్న లింగం, వల్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణ భరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది. నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశము, పాశము ఉంటాయి. కింది రెండు చేతులలో ఒకటి అభయ హస్తంగాను, మరొకటి శరణాగతి పొందమని చూపినట్టు ఉంటాయి. ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేవి ఎదుట శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరుడు చేత ఒక దండంతో దర్శనమిస్తాడు. బయటి ప్రాకారంలో గణపతి, వల్లి, దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి, పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలున్నాయి. బయటి ప్రాకారంలో భక్తులు వేచి ఉంటారు. ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. 

ఉత్సవాలు, ప్రత్యేకపూజలు : 

ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్, మే మాసాలలో పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధికి పెద్దఎత్తున ముత్తయిదువలు చేరుకుని పూజలు చేస్తారు. 

ఇలా చేరుకోవచ్చు : 

నెల్లూరు చేరుకుంటే, అక్కడి నుండీ జొన్నవాడకి బస్సులు అందుబాటులో ఉంటాయి.  విజయవాడ నుండీ కూడా సరాసరి బస్సులు అందుబాటులో ఉన్నాయి. 

Pinakini, river, jonnavada, Kamakshi, Mallikharjuna swami, Durvasa maharshi, kasyapa, 

 

Videos View All

తెలుగు నేలమీద వెలసి, కలలో అనుగ్రహించే కామాక్షి కథ .
అమ్మవారి భజన | దీనదయా పరిపూర్ణ కటాక్షిణి భజన పాట

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi