అక్కడ జాలువారే నీటిలో ఒక్కచుక్క మనని తాకినా, తరతరాల పెద్దలూ తరించిపోతారు.
- లక్ష్మి రమణ
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళినప్పుడు మనందరమూ కూడా శిలాతోరణాన్ని, ఆ పక్కనే ఉన్న చక్ర తీర్థాన్ని దర్శించుకొనే ఉంటాము. ఆ చక్ర తీర్థ వైభవం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అక్కడ ప్రవహిస్తున్న జాలంలో ఒక్క చుక్క మన తలమీద పడినా కూడా మన తరతరాల పెద్దలూ తరించిపోతారు. మనకి స్వయంగా ఆ సుదర్శనుడే రక్షకుడై వెంట నిలుస్తాడు. ఈ విషయం స్కాంద పురాణంలో విపులంగా చెప్పారు.
పూర్వం పద్మనాభుడనే శ్రీవత్స గోత్రానికి చెందిన బ్రాహ్మణుడు ఎంతో నియమంగా శిష్టాచారాలని పాటించేవాడు. ఆ విప్రుడు వెంకటాద్రి మీదున్న చక్రతీర్థం దగ్గర శ్రీహరి గురించి తపస్సు చేశాడు. లభించిన ఆహారాన్ని తింటూ, సత్యము, దయ వంటి సద్గుణాలతో, ఇంద్రియాలను జయించి అన్ని కాలాలలో శీతోష్ణాలను, వర్షాన్ని సహిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. పద్మనాభుడు చేసిన తపస్సుకి సంతోషించిన శ్రీనివాసుడు శంఖ, చక్ర, గదాది ఆయుధాలను ధరించి, పద్మనాభుని ముందర ప్రత్యక్షమయ్యాడు . దివ్యసుందరుడై, కోటి సూర్యుల కాంతితో తన ముందు నిలిచిన శ్రీనివాసుని చూసి పులకించిపోయి ఇలా స్తుతించడం ప్రారంభించాడు పద్మనాభుడు.
నమస్త్రై లోక్యనాధాయ విశ్వరూపాయ సాక్షిణే|
శివబ్రహ్మాది వంధ్యాయ శ్రీనివాసాయ తే నమః ||
నమః కమల నేత్రాయ క్షీరాబ్దిశయనాయతే|
దుష్ట రాక్షస సంహార్త్రే శ్రీనివాసయ తే నమః ||
భక్త ప్రియ దేవాయ దేవానాం పతయే నమః |
ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః ||
యోగినాం పతయే నిత్యం వేదవేద్యాయ విష్ణవే|
భక్తానాం పాప సంహార్త్రే శ్రీనివాసాయ తే నమః ||
దేవాధిదేవా ! ఓ వెంకటేశా! దివ్యమైన ఆయుధాల్ని ధరించినవాడా , నారాయణాద్రి పై నివసించేవాడా నీకు నమస్కారము. కల్మషములను నశింపజేసేవాడా, వాసుదేవా , విష్ణుమూర్తి, శేషాచలము పై నివసించే స్వామి శ్రీనివాసా! నీకు నమస్కారము. త్రిలోకములకూ నాధుడైనవాడా !ఓ విశ్వరూపుడా! అన్ని కర్మలకు సాక్షి అయిన వాడా ! శివుడు, బ్రహ్మ మొదలైన వారిచేత నమస్కారములను అందుకునేవాడా నీకు ఇదే నా నమస్కారము. కమలముల వంటి నేత్రములు కలిగిన వాడా! పాల సముద్రముపై నిదురించువాడా! దుష్ట రాక్షసులను సంహరించేవాడా, రక్షకుడా! ఓ శ్రీనివాసా నీకు నమస్కారము. భక్తులకు ఇష్టమైన వాడా! దేవదేవా నీకు నమస్సులు. నమస్కరించిన వారి దుఃఖములను పోగొట్టేవాడా! శ్రీనివాసా నీకు నమస్కారము. యోగులకు గతి అయినవాడా! నిత్యము వేదముల ద్వారా తెలిసేవాడా! ఓ విష్ణుమూర్తి, భక్తుల పాపములను సంహరించేవాడా, ఓ శ్రీనివాసా నీకు నమస్కారము అని ఈ విధంగా పద్మనాభుడి చేత స్తుతించబడినటువంటి శ్రీనివాసుడు ప్రసన్నుడయ్యారు .
ఆయన ముందర ప్రత్యక్షమయ్యి “ ఓ భక్తా !పద్మనాభా ! ఈ కల్పాంతము వరకు నేను ఈ చక్ర తీర్థంలోనే నివసిస్తూ ఉంటాను. నన్ను భక్తిగా సేవించు. నీకు కైవల్యము లభిస్తుంది.” అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా శ్రీనివాసుని ఆజ్ఞ ప్రకారము పద్మనాభుడు ఆ తీర్థం దగ్గరే నివసించసాగాడు.
ఇదిలాఉండగా, కొంతకాలం తర్వాత భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు తీవ్రమైన ఆకలితో చక్ర తీర్థం దగ్గరున్న పద్మనాభుని దగ్గరకు వచ్చాడు. తనకి తగిన ఆహారం లభించిందని ఆనందించి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. రాక్షసుడు పట్టుకోగానే పద్మనాభునికి భయం వేసింది . ఆపద మొక్కులవాడైన శ్రీనివాసుడిని రక్షించమంటూ దీనంగా ప్రార్దించాడు. “ఓ శ్రీహరీ! పూర్వము ముసలి గజేంద్రుని పట్టుకున్నట్లు, ఈ రాక్షసుడు నన్ను పట్టుకున్నాడు. వాడి పీడ వదిలించి, నన్ను రక్షించు” అంటూ దీనంగా విలపించాడు.
పద్మనాభుడి ఆర్తనాదం విని అతని రక్షించడానికి శ్రీహరి తన చక్రాయుధాన్ని పంపించారు. స్వామి పంపిన ఆ చక్రాయుధం వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ, చక్ర తీర్థం వైపు దూసుకొచ్చింది. మహోత్సవంగా వెలిగిపోతున్న ఆ చక్రాన్ని చూసి భయపడనటువంటి రాక్షసుడు పద్మనాభుని వదిలి వెంటనే పారిపోయాడు. అయితే ఆ చక్రం మాత్రం వాడిని వదిలిపెట్టలేదు. వెంటబడి తరిమి తరిమి చివరికి ఆ రాక్షసుణ్ణి సంహరించింది. అలా ఆ రాక్షసుడు చక్రాయుధం దెబ్బకి ప్రాణాలు కోల్పోవడంతో, పద్మనాభుడికి భయం పోయింది. ఇంతటి ఘనకార్యం చేసి తన ప్రాణాలు కాపాడిన సుదర్శన చక్రాన్ని ఇలా వేనోళ్ళా స్తుతించాడు.
సుదర్శన స్తుతి :
విష్ణు చక్ర నమస్తేస్తు విశ్వరక్షణ దీక్షిత|
నారాయణ కరాంభోజ భూషణాయ నమోస్తుతే||
యుద్ధేష్వసుర సంహారకుశలాయ మహారవ |
సుదర్శన నమస్తుభ్యం భక్తానామార్తినాశన ||
రక్ష మాం భయసంవిగ్నం సర్వస్మాధపి కల్మషాత్|
స్వామిన్సుదర్శన విభో చక్ర తీర్ధే సదా భవన్||
సన్నిదేహి హితాయ త్వం జగతో ముక్తికాంక్షిణః |
బ్రాహ్మణేనైవముక్తం తద్విష్ణు చక్రం మునీశ్వరాః ||
ఈ విధంగా స్తుతించిన పద్మనాభుడి సహృదయతకు మెచ్చుకున్నటువంటి సుదర్శనుడు అతనితో ఇలా అన్నారు. “ ఓ పద్మనాభా ! నువ్వు నివసించే ఈ చక్ర తీర్థము మహా పుణ్యప్రదమైనది, అత్యుత్తమమైనది, లోకాలన్నింటికీ హితాన్ని చేకూర్చడం కోసం నేనిక్కడ నివసిస్తాను. శ్రీహరి పంపగా నేను నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చాను. నీ కోరిక మేరకు నేనిక్కడ రక్షణగా ఉంటాను. ఇక పై నీకు గాని, వేరే వారికి గాని ఇక్కడ రాక్షసుల పీడ ఉండదు. ఈ చక్ర తీర్థంలో స్నానం చేసిన వారు వారి పూర్వీకులతో సహా అందరూ తరిస్తారు.” అని చెప్పి సుదర్శనుడు జ్యోతి రూపంగా మారి చక్ర తీర్థంలోకి ప్రవేశించారు.
కాబట్టి తిరుమల గిరుల మీద ఉన్న పరమ పవిత్రమైన చక్ర తీర్థం లాంటి దివ్య తీర్థము ఈ భూమిపైన మరొకటి లేదు, ఇకపై ఉండబోదు. ఈ వృత్తాంతాన్ని చదివిన వారికి విన్నవారికి కూడా చక్ర తీర్థ జలాలలో స్నానం చేసినంతటి పుణ్యఫలం లభిస్తుంది అని స్కాంద పురాణం తెలియజేస్తోంది.
సర్వేజనా సుఖినోభవంతు !!
Tirumala, Chakra teerdham, chakra, theertham, teertham, Pamanabha,
#tirumala #venkateswaraswami #venkateshwara #tirumalatirupati