Sindhuraruna vigraham trinayanam manikya mouli spurath
Thara Nayaga sekaram smitha mukhi mapina vakshoruham,
Panibhayam alipoorna ratna chashakam rakthothpalam vibhrathim,
Soumyam ratna gatastha raktha charanam, dhyayeth paramambikam.
వారాహీ నవరాత్రులు జూన్ 19 నుండీ 27 వరకూ !
-లక్ష్మీ రమణ
వారాహీ నవరాత్రులు/ గుప్త నవరాత్రులు లేదా ఆషాడ నవరాత్రులు అమ్మవారిని వారాహీ మాతగా ఆరాధించుకోవడానికి , ఆమె అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి అనుకూలమైన రోజులు. 2023లో జూన్ 19వ తేదీ నుండీ 27 వతేదీ వరకూ వారాహీ నవరాత్రులు వచ్చాయి. ఈ నవరాత్రుల ప్రత్యేకతలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ దివ్యమైన పర్వదినాలలో అమ్మవారి ఆరాధన వలన సస్యములు, సంపద, ధైర్యం, రక్షణ కలుగుతాయి.
వారాహీ :
భూ దేవి స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి, వరాహ స్వామి స్త్రీ రూపం, లలితా దేవి వహించిన దండిని రూపం వారాహి మాత. అమ్మవారు నాగలిని ధరించి ఉంటారు. భూమిని చదును చేసుకొని విత్తులు నాటే ఈ సమయంలో వారాహీ రూపంలో అమ్మవారి ఆరాధన సస్యములని అనుగ్రహిస్తుంది. భూదేవి అనుగ్రహంతో పంటలు బాగా పండుతాయి. రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది, పాడిపంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. ఈమె అన్యాయాన్ని ఎదిరించి, శిక్షించే దేవత. రక్షణ గలిగించే దేవత. ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు, శత్రు సంహారం జరుగుతుంది. ఈ తల్లి మంత్రం సిద్దిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. విశేషించి వారాహీ దేవి ఆయుర్వేద వైద్య దేవదేవి. భూదేవికి తెలియని మూలిక ఏముంటుంది ? ఈ అమ్మవారి వెంటే ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, దేవ వైద్యులైన అశ్వనీ దేవతలూ ఉంటారు.
ఈమె వాహనం దున్నపోతు,ఉగ్రంగా కనిపించిన ఏమీ చల్లని తల్లి, అన్యాయంగా దౌర్జన్యం గా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ, పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించ బడుతుంది.లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది.
లలితా సహస్రంలో .. :
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |
అని వశిన్యాది దేవతలూ లలితా సహస్రంలో అమ్మని కీర్తిస్తారు .
విశుక్రుడిని ఈ తల్లి సంహరించింది, ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు. లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని లక్ష్మిని కీర్తిస్తారు. అంటే ఈమె లక్ష్మీ స్వరూపం.ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సేధ్యానికి సంకేతం . రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం .
ప్రభావవంతమైన వారాహి నామాలు:
నామం చాలా గొప్పది. అనంతమైన శక్తిని కలిగి ఉండేది. వారాహీ దేవికి సంబంధించి ప్రతిరోజూ ఇక్కడ పేర్కొన్న నామాలని చేసుకోవడం గొప్ప ఫలాన్ని అనుగ్రహిస్తుంది. ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో ఈ నామాలని పూజలో భాగంగా చేసుకోండి. ప్రతిరోజూ తలుచుకుని నమస్కారం చేసుకోవవడం మరింత ఫలదాయకం. ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది.
వారాహీ పూజనూ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చేయాలి. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత .
పంచమి, దండనాథా, సంకేతా, సమయేశ్వరి, సమయ సంకేతా, వారాహి, పోత్రిణి , వార్తాళి ,శివా, ఆజ్ఞా చక్రేశ్వరి ,అరిఘ్ని. అనే నామాలు తలచుకొని భక్తిగా నమస్కారం చేసుకోండి.
లడ్డు ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. విశేషించి భూమిలో దొరికే గడ్డలు, చిలకడదుంపలు , దానిమ్మలూ నైవేద్యంగా సమర్పించండి.
నీలిరంగు పుష్పాలు తో పూజించడం, రేవతి నక్షత్రం రోజు విశేష పూజ చేయడం వల్ల అమ్మ అనుగ్రహం సిద్ధిస్తుంది.
ఇఛ్ఛా శక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల , క్రియా శక్తి వారాహి, కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజలందుకునే ఏకైక వారాహీ స్వరూపం లో ఉన్న లక్ష్మిదేవి రూపం తాంత్రిక పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటారు, వారాహి దేవిని శ్రీ విద్యా సంప్రదాయం లో చేసే విధానం కూడా ఉంటుంది అయితే అది శ్రీవిద్యా ఉపాసకులే చేస్తారు,సాధారణ పద్దతిలో ప్రతి ఒక్కరు ఈ తల్లిని పూజించ వచ్చు.
జూన్ 19 నుండీ 27 వరకూ అమ్మని వారాహిగా ఆరాధించి ఆమె అనుగ్రహానికి పాత్రులమవుదాం . శుభం .
#Varahi #Varahinavaratri
Varahi Navaratri, Varahi Navaratrulu