Online Puja Services

త్రేతాయుగం నాటి మహిమోపేత పరమేశ్వరాలయం !

3.15.203.242

సుల్తానులు పునరుద్ధరించిన త్రేతాయుగం నాటి మహిమోపేత  పరమేశ్వరాలయం !
- లక్ష్మి రమణ 

భారతీయ ధర్మాన్ని ప్రశ్నిస్తే, భారతీయ కోవెలల జోలికి వస్తే భగవంతుడు ఎలాంటి రూపంలో వ్యక్తమవుతాడన్నది కలియుగంలోనే ఎక్కువగా నిరూపించ బడింది.  అంతకు ముందర యుగాలలో అటువంటి అవసరమే పరమాత్మకు రాలేదేమో మరి ! ఎందుకంటె అంతకుముందర ఉన్నది పరమాత్ముని ఆరాధన మాత్రమే ! మతాలూ, కులాల తెంపులాటలు కాదు. ఇలాంటి  కొన్ని దృష్టాంతారాలు బ్రిటీషువారి కళ్ళు తెరిపించినవి. మరికొన్ని మహ్మదీయ సుల్తానుల మనసు మార్చినవి . ఏ పాలకులు ఆలయాల విధ్వంసానికి ఒడికట్టారో అటువంటి వారే పూనుకొని సంస్కరించిన ఆలయాలున్న నేల ఇది . అటువంటి ఆలయాల్లో గొప్ప చరిత్ర గలిగిన ఒక మహిమాన్విత శివాలయం ఇది . 

పేరు మాత్రమే చాలా పొడుగ్గా ఉంది అనుకుంటారేమో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి  అనే పేరు విని. కాదు, ఈ ఆలయంలో ఉన్న స్వామీ చరిత్ర తెలుసుకుంటే, ఔరా అని ముక్కున వేలేసుకుంటారు . దాదాపు 14 పరివార ఆలయాలతో కొలువై ఉన్న ఈ పరమేశ్వరుని ఉదంతం తెలుసుకుందాం రండి . 

పెనుమంట్ర మండలం, తణుకు పట్టణం దగ్గరలో ఉన్న జూత్తిగ గ్రామంలో  ఉన్న స్వామీ శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వరుడు. క్రీ.శ .1505 లో, ఖుల్లీ పాదుషా ఆజ్ఞ ప్రకారం ఈ ఆలయాన్ని  పునరుద్దరణ చేశారు.  ఆలయములోని శాసనాల ద్వారా ఈ విషయం స్పష్టం అవుతోంది . ఆ విధంగా పాదుషాలు పునరుద్ధరించిన ఆలయంగా ఈ దేవాలయం కీర్తిని పొందింది . 

దేవతలు ప్రతిస్టించారా ?

పాదుషాలు పునరుద్ధరించే నాటికే ఈ ఆలయం గొప్ప వైభవమైన చరిత్రని కలిగి ఉంది . శ్రీ చక్ర ఆకారములో నిర్మించిన ఆలయం ఇది . మానవ నిర్మితమైన ప్రతిష్ఠ కాదనేది ఇక్కడి స్థానికుల విశ్వాసం.  ఈ పరమేశ్వరుని స్వయంగా దేవతలే ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు . 

స్థల పురాణం : 

త్రేతాయుగం నాటి మాట . రావణాసురుడు దేవపాలకుడైన ఇంద్రుడినీ, అష్ట దిక్పాలకులనీ, గ్రహాలనీ గెలిచి, అదిలించి, పరాభవించి  తన కనుసైగ ప్రకారం మెలిగేలా మలుచుకున్న విషయం తెలిసిందే . ఆవిధంగా రావణ భటులచేత పరాభవాన్ని పొందిన వాసుకీ, రవి, సోములు (చంద్రుడు) వారి దుఖమును ఉపశమింపచేసుకోవడానికి , లోక కళ్యాణం కోసమూ , రావణ వధ తొందరగా జరగడానికి గోస్తనీ నది తీరములో ఈ ఆలయాన్ని నిర్మించారు . ఉత్తర వాహినిగా ప్రవహించే ఈ  నిత్య పుష్కరిణి ప్రదేశంలో   పశ్చిమాభిముఖమున శివ లింగమును ప్రతిష్ట చేశారు . ఆ విధంగా వారు ముగ్గురి పేర్లనీ కూడా కలుపుకొని  శ్రీ ఉమా వాసుకీ రవి సోమేశ్వర స్వామిగా పరమేశ్వరుడు లింగ రూపమై కొలువుదీరారు. ఈ ఆలయ  రెండవ ప్రాకారములో స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువవడం విశేషం . 

విశేషమైన ఉపాలయములు :

శ్రీ కంచి కామాక్షి అమ్మ వారి దేవాలయము : ప్రధాన ఆలయమునకు ఉత్తర దిక్కున శ్రీ కంచి కామాక్షి అమ్మ వారు కొలువై ఉన్నారు . ఈ అమ్మ వారు సుమారు 1000 సంవత్సరములపూర్వము వెలసి నారని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రములో  స్వామి వారికి అభిషేకము చేయించుకున్న వారికి శత్రు, ఋణ , రోగ, మృత్యు, బాధలు ఉండవు. ఇక్కడ మృత్యుంజయ అభిషేకములు చేసే  విధానము చాలా విశిష్టమైనదని ఇక్కడి అర్చకులు చెబుతారు . 

 శ్రీ లక్ష్మి జనార్ధన స్వామి వారు : ప్రధాన ఆలయమునకు వాయువ్యములో లక్ష్మీ జనార్ధన స్వామీ కొలువై ఈ క్షేత్రాన్ని హరి హర సమన్వితంగా చేస్తోంది . ప్రతీ సంవత్సరమునకు వైశాఖపౌర్ణమికి స్వామి వారి కళ్యాణము మరియు ధనుర్మాసము నందు విశేష పూజలు జరుగుతాయి . ఈ ఆలయ ప్రాంగణంలో విశేషించి కొత్తజంటలకి వివాహాలు జరుగుతూ ఉండడం విశేషం . 

 శ్రీ ఆంజనేయ స్వామి వారు : ప్రధాన ఆలయమునకు వాయువ్యమున శ్రీ ఆంజనేయ స్వామి వారు వెలసి ఉన్నారు. శ్రీ స్వామి వారికి ప్రతీ మంగళ శనివారములు  అభిషేకములు జరుగుతాయి . హనుమజ్జయంతి , మరియు ముక్కోటి ఏకాదశి లలో విశేష ఉత్సవములు జరుగుతాయి.

 శ్రీ సూర్యనారాయణ స్వామి వారు : ప్రధాన మూలవిరాట్టు  శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి కొలువవడానికి పాటుపడిన సూర్యుని ఆలయం కూడా ఈ ప్రాంగణంలో ఉంది .  ప్రధాన ఆలయమునకు ఈశాన్యములో ఉన్న  శ్రీ ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణము  మాఘ మాసములో జరుపుతూ ఉంటారు . 

 శ్రీ వల్లీ దేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము : ప్రధాన ఆలయమునకు పశ్చిమాభిముఖముగా 2 వ ప్రాకారములో వల్లీ సమేతుడైన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. కాల సర్ప దోష నివారణ, శ్రీఘ్ర  వివాహము కోసము ఇక్కడ స్వామికి విశేషమైన అర్చనలు జరుగుతాయి . 

 శ్రీ కాల భైరవ స్వామి వారి దేవాలయము : ప్రధాన ఆలయమునకు ఈశాన్యము నందు కలదు. కాల భైరవ అష్టమి నాడు శ్రీ స్వామి వారికి విశేష అభిషేకములు చేస్తుంటారు  . ఈయనే  క్షేత్ర పాలకుడు .

ఇవే కాకుండా ఇంకా  శ్రీ గణపతి,  గ్రామ దేవత శ్రీ దూతిక అమ్మ,  శ్రీ దుర్గా దేవి, శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ శారదా దేవి, సంతాన ప్రదాయని అయిన శ్రీ అనిశ్రమ్మ ,  నవగ్రహాలయము కూడా ఉన్నాయి . 

ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖముగా శివ లింగము, ఉత్తర వాహినిగా నది ఉన్నాయి. కాబట్టి కాశీతో సమానమై దక్షిణ కాశీ అనే పేరుతొ విలసిల్లుతోంది . ఇక్కడి పరమేశ్వరుని అర్చించిన వారికి శత్రు , ఋణ, రోగ , మృత్యు భయములు ఉండవు, రోగ పీడితులు శ్రీ స్వామి వారికి మృత్యుంజయ అభిషేకం చేయించుకోవచ్చు . దీనివల్ల ఫలితములు సంపూర్ణంగా లభిస్తాయని స్థానిక విశ్వాసం . తణుకుకు అతి సమీపంలో ఉన్న పురాణ ప్రశస్తమైన ఆలయాన్ని తప్పక దర్శించే ప్రయత్నం చేయండి . 

పరమేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు !! 

శుభం . 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya