Online Puja Services

అమ్మవారి నామాలలో ఏ నామం గొప్పది ?

3.144.86.134

అమ్మవారి నామాలలో ఏ నామం గొప్పది ?
సేకరణ 

శ్రీ లలితా సహస్రనామాలని హయగ్రీవ - అగస్త్య సంవాదంగా వశిన్యాది దేవతలు చెప్పినట్టుగా చదువుకుంటూ ఉంటాం. ఆ సహస్రనామాలని చదువుకుంటూ అమ్మని అనుగ్రహహించమని వేడుకుంటాం .  ఈ దివ్యమైన లలితా సహస్రనామాలలోని ఒక్కొక్క నామమూ ఒక్కొక్క మహా మంత్రమే అంటే అతిశయోక్తికాదు.  పెద్దలు , వేదకోవిదులు అయిన పండితోత్తములు లలితానామ మహత్యాన్ని ఒక పారాయణా యజ్ఞంగా ఎంచి గొప్ప వివరణలు ఎన్నో చేశారు .  అమ్మకి ఒక్క వేయి నామాలేనా ? ఉన్నవి వేలవేల నామాలు . ఆ నామాల మహత్యాన్ని యేమని వర్ణించగలము ? ఏ నామము గొప్పదని చెప్పగలము అంటే, హయగ్రీవస్వామి అగస్త్యులకి ఉపదేశమిస్తూ చెప్పిన శ్లోకము ఇలా సమాధానం ఇస్తోంది .     

శ్రీ లలితా రహస్య సహస్రనామాలను హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి ఉపదేశం ఇస్తూ ఫలశృతిలో ఈ విధంగా చెప్పారు . 

లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణు నామానుకీర్తనం
విష్ణునామ సహస్రాశ్చ శివ నామైకముత్తమం
శివనామ సహస్రాశ్చ దేవ్యానామైక ముత్తమం

దేవీ నామ సహస్రాణి కోటిశస్సన్తి కుంభజ 
తేషు ముఖ్యం దశవిధం నామ్నాం సాహస్రముత్తమం

గంగా భవాని గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ 
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ 

లౌకికమైన మాటలకంటే ఒక విష్ణు నామము గొప్పది.  వేయి విష్ణు నామాలకంటే ఒక శివ నామము గొప్పది. వేయి శివ నామాలకంటే ఒక దేవీ నామము గొప్పది.  మహాదేవికి గల అనేకానేక రూపాల్లో గంగా నామములు గొప్పవి.  గంగ కంటే భవానీ సహస్రనామాలు గొప్పవి.  భవాని కంటే గాయత్రీ నామాలు గొప్పవి.  గాయత్రీ కంటే కాళీ, లక్ష్మీ, సరస్వతీ నామాలు ఒకదానికంటే ఒకటి గొప్పవి.  సరస్వతీ కంటే రాజరాజేశ్వరీ,రాజరాజేశ్వరీ కంటే బాలా సహస్రనామాలు, బాల కంటే శ్యామలా నామాలు గొప్పవి. శ్యామలా నామాలకంటే పరాభట్టారిక అయిన శ్రీ లలితా త్రిపురసుందరి సహస్రనామాలు గొప్పవి.  

యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః
శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ ॥

భోగం ఉన్నచోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్నచోట భోగం ఉండదు. కానీ శ్రీ త్రిపురసుందరి సేవకులకు మాత్రం ఐహిక, ఆమూష్మీక ఫలాలు రెండూ సాధ్యమే . ఇది యెంత గొప్ప విచిత్రమో చూడండి !

చరమే జన్మని యథా శ్రీవిద్యోపాసకో భవేత్
నామ సాహస్ర జాపినః తథా చరమ జన్మని ॥

జన్మాంతరాల్లో ఇతర దేవతోపాసన చేసినవాడికి తత్ఫలితంగా చివరి జన్మలో శ్రీవిద్య ప్రసాదింపబడుతుంది. అలాగే సహస్రనామ పారాయణం నిత్యం చేసేవారికి కూడా అది చివరి జన్మ అవుతుంది. అంత గొప్ప పారమార్థికత లలితా సహస్రనామాల పారాయణలో ఇమిడి ఉంది .  

అలాగే పరదేవత కూడా సహస్రనామ పూర్వపీఠికలో “నా యొక్క శ్రీ చక్రరాజమును అర్చించినా అర్చించకపోయినా, నా శ్రీవిద్యా మంత్రరాజాన్ని జపించినా జపించకపోయినా సరే, నా ఈ రహస్య సహస్రనామ పారాయణం చేసిన వారు నాకు ప్రీతిపాత్రులవుతారు. వారికి నేను సర్వ సౌభాగ్యాలు ఇస్తాను” అన్నది. 

కాబట్టి ఉపదేశం ఉన్నవారికి, లేనివారికి సులభంగా పరమేశ్వరి అనుగ్రహం లభించే మార్గం నామ సాహస్ర పారాయణం. అదే లౌకిక, ఆధ్యాత్మిక ఉన్నతులను ప్రసాదించగలిగినది. 

శ్రీ చక్రరాజనిలయా శ్రీ మత్త్రిపురసున్దరీ 
శ్రీ శివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా॥

సర్వం శ్రీ లలితా చరణారవిన్దార్పణమస్తు!!

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gautama Buddha