Online Puja Services

మన వ్యవస్థ కుల మతాతీతమా?

18.118.255.51

నిజంగా మన వ్యవస్థ కుల మతాతీతమా?
-(ఋషిపీఠం మాసపత్రికలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వ్యాసం )

మన దేశంలో రాజకీయాలన్నీ కులాల, మతాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ‘కులాతీతం, మతాతీతం’ అంటూ పెద్ద పెద్ద మాటలంటూంటారు.

ఎవరికి వారు వారి వారి కులాలకు ప్రాధాన్యమిస్తారు. మత విషయానికొచ్చేసరికి హైందవేతర మతాలను బుజ్జగిస్తూ, వారి ప్రసాదం కోసం ప్రాధేయపడుతుంటారు. ఈ కుల-మత తత్త్వాలతో దెబ్బతీస్తున్నది భారతీయతను, ఈ దేశ జాతీయతను.

‘కులాలను నిర్మూలిద్దాం’ – ‘కులాతీత, మతాతీత సమాజాన్ని సాధిద్దాం’ అంటూ రుద్రాక్ష పిల్లి బాపతు మాటలు వల్లించే మాధ్యమాల వారు కూడా తమ కుల నాయకుల గెలుపు కోసం శ్రమిస్తూ, వారికి మద్దతుగా నిలబడతారు.

ఈమధ్య ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాగైనా తిరిగి తానే అధికారానికి రావడం కోసం ఈ కుల-మత పిచ్చితనాన్ని రెచ్చగొడుతూ క్షుద్ర విన్యాసాలు చేస్తున్న విషయం చాలామందికి తెలుసు. ఇలాంటి వార్తల వారు చాలా రాష్ట్రాల్లో చాలా రకాలుగా గోచరిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు ప్రభుత్వానికి అతడు మద్దతు పలుకుతున్నంత కాలం తామూ జేజేలు కొట్టిన వారు, తమ కులనేత మద్దతు ఉపసంహరించగానే తాము కూడా అతడి వలెనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఆ నాయకుడూ, ఈ వందిమాగధ వార్తా సంస్థలూ కలిసి వాస్తవాలు కప్పిపుచ్చుతూ, అబద్ధాలను నిజాలుగా చిత్రిస్తూ, తమ వార్తా వ్యాపారాన్ని విశృంఖలంగా నడుపుకుంటున్నారు. బాధ్యత కలిగిన వార్తా మాధ్యమాలు కూడా ఈ కులకండూతితోనే అఘోరించడం బాధాకరం.

ఈ వెర్రి ఎంత దూరం పోయిందంటే – ఓట్లకోసం అప్రాచ్య మ్లేచ్ఛ మతాల వారికి వరాల వాగ్దానాలు గుప్పిస్తున్నా “ఇది లౌకిక ధర్మానికి అన్యాయం’ అని ఒక్క మేధావీ గొంతు తెరవడం లేదు.

ప్రభుత్వాలే మతప్రార్థనా మందిరాలను పూర్తి ఖర్చుతో నిర్మిస్తామనీ, ఆ మతంకోసం పని చేస్తున్న వారికి పక్కా ఇళ్ళు, ప్రత్యేక కేటాయింపులు, ఇస్తామని హామీలిస్తున్నాయి. ఆ ధనాన్ని ఎక్కడి నుండి తెస్తారు? దేవాదాయ-ధర్మాదాయ శాఖలోకి రాని ఆ మత శ్రద్ధా కేంద్రాల ధనాన్ని ముట్టుకోని ప్రభుత్వాలు. వారి ప్రార్థనాలయాలను ఎవడబ్బ సొమ్ముతో నిర్మిస్తారు? హిందువులు ప్రశ్నించరు – స్పందించరు. కనుక హైన్దవాలయాలను దోచుకుంటున్న ప్రభుత్వాలు ఆ ఆదాయాన్నే అన్య మత కేంద్రాల నిర్మాణాలకు, వారి భోగాలకు ఖర్చు చేస్తాయి.

మరోవైపు తాము హిందూ కుటుంబాలకు చెందిన వారై కూడా ఓట్లకోసం అన్యుల వద్దకు వెళ్ళి వారిని అనుకరిస్తూ ఉన్న వైనం జుగుప్సాకరం. ఇటువంటి వారికి తమ ఓటు వెయ్యము అని హిందువులంతా దృఢంగా నిర్ణయించుకుంటే నిజమైన సెక్యులర్ వ్యవస్థ నిలబడుతుంది.

ఈ నేపథ్యంలో హైందవధర్మాన్ని దెబ్బతీయడానికి వెనుకాడని ముఖ్యమంత్రులు – హైందవ ధర్మ వ్యాప్తిని నిరోధించడానికి వెనుకాడడం లేదు. కొన్నాళ్ళ క్రితం సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మతమార్పిడుల దౌర్జన్యాల నుండి ధర్మాన్ని రక్షించడం కోసం ఏర్పాటు చేసిన ‘సమరసతా ఫౌండేషన్’ ను దేవాదాయ ధర్మాదాయ శాఖ, తి.తి.దే వారు ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ, ఇటీవల ఆ సహాయాన్ని నిలుపు చేశారు.

ఇలాంటి చర్యలు మార్పిడి మతాల ఒత్తిడితోనే చేస్తున్నారనేది సుస్పష్టం. కానీ ఏ హిందూ సంస్థలూ ప్రశ్నించడం లేదు. తమ కులం వాడు ఇతర మతాల ప్రాపకం కోసం, తమ హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్నా, ‘తమ కులపోడే కదా’ అంటూ అతడినే అందలమెక్కించేటంత కులపిచ్చి ముదురుతోంది.
‘హిందూమతంలో కుల వ్యవస్థ పెద్దలోపం’ అని ప్రచారం చేసి మార్పిళ్లు చేస్తున్న అప్రాచ్య, మ్లేచ్ఛ మతాలు మారిన వారిని పూర్వకులంతోనే వ్యవహరిస్తున్నారు. అక్కడికి చేరాక కూడా ఈ కుల పక్షపాతం వదలదు. మరి అందులోకి మారి ఏం సాధిస్తున్నారు!

ఓటు బ్యాంకు రాజకీయ దౌర్జన్యం ముదిరి – కొన్ని రాష్ట్రాలలో సంఖ్యాబలం పెంచుకున్న అప్రాచ్య, మ్లేచ్ఛ మతాల వారు అనేక ప్రాంతాలలో హిందువుల్ని తరిమికొట్టి, వారి భూముల్ని ఆక్రమించుకుంటున్నారు. వారికి సహకరిస్తున్నది హిందూ కుటుంబాలకి చెందిన నాయకులే.

ఇతరుల్ని తమతో కలిసి  బతకనివ్వని మతాల వారితో సామరస్యం సాధ్యమౌతుందా? హిందువులు అధికసంఖ్యలో ఉన్నా, ఇతరులతో సహవాసానికి నిరాకరించరు. అందుకే అధిక సంఖ్యలో హిందువులున్నప్పుడే సామరస్యం సాధ్యమౌతోదన్నది నిస్సందేహ వాస్తవం.

అలాంటి హిందూధర్మం దెబ్బతింటే క్రమంగా దేశాభ్యుదయమే కుంటుపడుతుంది. ఆ ప్రమాదం రాకుండా అప్రమత్తం కావలసిన జాగరూకత ఇప్పుడు ఎంతయినా అవసరం.

‘తమ మతాలే దేశమేలాలి’ అనే ఆకాంక్షతో అహరహం తపిస్తున్న ఇరు మతాలూ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకోవడంలోనే తలమునకలౌతున్నాయి.

అసురశక్తులు కూటములుగా వీరి ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. హిందువుల దగ్గరకొచ్చేటప్పుడు మాత్రం ‘మతం వేరు – రాజకీయం వేరు. మతవాదులు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు’ అనే గంభీరప్పలుకులు పలుకుతారు. కానీ రాజకీయాలను శాసిస్తున్న ఆ ఇరు మతాల మాటేమిటి? హిందూమతాన్ని రాజకీయ దెబ్బ తీసేటప్పుడు, రాజకీయాన్ని మలచడానికి హిందూమతం ఉద్యమిస్తే తప్పేమీ లేదు.

ఓట్లకోసం ఇతరుల్ని దువ్వుతున్న నాయకులు హిందువులైనా సరే వారిని గద్దె నెక్కనివ్వకుండా చూడాలి. హైందవధర్మాన్ని ఇబ్బంది పెట్టని వాడినే ఎంచుకోవడంలో వెనుకాడకూడదు.

కుల, మత ప్రసక్తి లేకుండా భారతీయులందరికీ సమాన సౌకర్యాలనందించే విశాల హృదయం సహజంగా కలిగిన హైందవ భావజాలం వల్లనే దేశాభ్యుదయం సాధ్యమన్న వాస్తవాన్ని గుర్తించాలి.

(అప్రాచ్య: తూర్పుకి చెందని, మ్లేచ్ఛ - సనాతన ధర్మ విరుద్ధమైన – అని అర్థాలు)

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi