Online Puja Services

ఆ ఒక్క నామంలో దాగిన ఆరుగురు దేవతల అనుగ్రహం

3.144.242.238

ఆ ఒక్క నామంలో దాగిన ఆరుగురు దేవతల అనుగ్రహం . 
- లక్ష్మి రమణ 

ఏ వ్యక్తి ని పేరుపెట్టి పిలుస్తామో, ఆ పేరుగల వారు మాత్రమే కదా పలుకుతారు .  అలాగే మనం భగవంతుణ్ణి పిలిచేప్పుడు కూడా ఏ నామంతో పిలుస్తామో, ఆ నామంతో , దానికి సంబంధించిన ఆకారంతో స్వామీ పలుకుతారు . ప్రహ్లాదుడు పిలిచినప్పుడు అంతకు ముందెన్నడూ లేని విచిత్రమైన స్వరూపంతో  (నర + సింహుడిగా) నారసింహుడిగా స్వామి ఆవిర్భవించారు కదా ! అందుకే యద్భావం తత్భవతి అని చెప్పారు పెద్దలు . అయితే, ఇక్కడ నారసింహుడు ఒక్కడే పలికాడు .  కానీ, కేవలం ఒక రెండక్షరాల అద్భుతమైన నామాన్ని పలికితే మాత్రము ఆరుగురు దేవతలు ఒకేసారి పలుకుతారట. ఆనామం ఏమిటి, అందులోని మహిమ ఏమిటనే విషయాలు చెప్పుకుందాం . 

ఆ గొప్ప మహిమ గలిగిన నామము కేవలము రామ అనే తారకనామమే ! ఆ నామమే సంసార సాగరాన్ని దాటించగలిగిన ఒకే ఒక్క నావ . రామనామంలోని విశేషము హరిహరుల దివ్యమంత్రాల ఏకీకృత స్వరూపం . ‘రా’ అనే శబ్దాన్ని అష్టాక్షరీ మంత్రము ఓం నమో నారాయణాయ నుండీ తీసుకున్నారు . ఈ అష్టాక్షరిలోని ప్రాణశబ్దము/ జీవాక్షరము  ‘రా’  అనే శబ్దమే ! మరి రామ శబ్దములోని ‘మ’ కారము ఎక్కడిది అంటే, అది పంచాక్షరీ మంత్రము నుండీ గ్రహించారు .  ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రములో ‘మ’ జీవాక్షరం. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే వచ్చేది రామ నామం.  

 "రామ ఏవ పరబ్రహ్మ , రామ ఏవ పరంతపః
రామ ఏవ పరంతత్వ శ్రీ రామో బ్రహ్మ తారకం "

రామనామం వలన బ్రహ్మ హత్య పాపం ,మద్యపాన దోషం ,గురుపత్ని సంయోగ పాపములు వంటి మహా పాతకాలు సైతము హరించి పోతాయి. సకల కల్మష నాశక మంత్రం రామనామము . రామ నామాన్ని స్మరిస్తే, శ్రీరామచంద్రుడు ఖచ్చితంగా రక్షకుడై మన వెంటే ఉంటారు.  ఆ రామనామాన్ని కనుక పలికితే, రామచంద్ర  ప్రభువుతో పాటుగా ,మొత్తం  ఆరుగురు దేవతలు ఓయని పలికి మన వెంటే నిలుస్తారట . అదెలా అనుకుంటున్నారా, చూద్దాం రండి .  

ఆయన పేరు శ్రీరామచంద్రుడు . రామా అన్నప్పుడు ఆయన పలుకుతాడు.  నాన్న వెంటే ఉండే అమ్మ సీతమ్మ . సాక్షాత్తూ మహాలక్ష్మీ స్వరూపమైన ఆ అమ్మ రామనామం ఎక్కడ పలుకుతారో అక్కడ స్థిరనివాసినిగా ఉంటుంది .  

ఇక, అరణ్యాలకి కూడా వెంట వెళ్లిన లక్ష్మణుడు, లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్భంలో సోదరుడు లేకపోతె, తన జీవితమే వ్యర్థం అనుకున్న రామయ్య ఒకరిని విడిచి ఒకరు ఉండనే లేరు.  ఆఖరికి ఆ రామదాసుని రక్షించడానికి కూడా లక్ష్మోజీగా మారి రామోజీ వెంటే వచ్చారు కదా ! అందువల్ల ఆదిశేష స్వరూపుడైన ఆ లక్ష్మయ్య ఖచ్చితంగా పలుకుతారు .   

ఇక, రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా రామభక్తుడైన హనుమంతుడే. రామ నామము, భజన, కథాగానము , పూజా విశేషము ఏది జరిగినా హనుమంతులవారు అక్కడికి నిస్సందేహంగా వచ్చి ఆస్వాదిస్తారు.  

హనుమంతుడు స్వయంగా రుద్రస్వరూపుడు. ఆయన రామ సేవ కోసం వానరుడిగా అవతారాన్ని ధరిస్తున్న సమయంలో పార్వతీ దేవి, స్వామీ  నాకూ  ఆ అదృష్టం కావాలి అని అడిగారు .  అపుడు శివుడు ‘దేవీ  ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. కనుక ఈ అవతారంలో నిన్ను తీసుకెళ్లడం కుదరని పని’  అన్నారు. అపుడు పార్వతీ దేవి, ‘స్వామీ , మీ శరీరంలో సగభాగమైన నన్ను ఎడబాసి ఉండడం తగునా ? నేను మీ శక్తిని. కనుక నేను మీ తోకనై మీ వెంటే ఉంటాను ‘. అని ఆంజనేయుని వాలముగా అమ్మవారు రుద్రాంశకి తోడై వచ్చారు. అందుకే హనుమంతుని వాలానికి అంతటి శక్తి. ఆ వాలాన్ని ఎదిరించే శక్తి ఏ దుష్టునికీ లేదు. పైపెచ్చు, ఆ వాల మహత్యము బాగా తెలిసి ఉండడము చేత, కలలోనైనా అటువంటి శక్తులు హనుమ తోక కనిపించిందా గుండె (ఉంటే ) ఆగి చచ్చిపోతాయి. 

ఇక్కడ విశేషాన్ని గమనించండి . ఇప్పుడు రామ శబ్దం పలికిన చోటికి హనుమయ్య  వస్తే, ఆయన వాలముగా ఉన్న అమ్మవారు పార్వతీమాత కూడా వచ్చినట్టేగా ! 

కాబట్టి, రామా అనే శబ్దాన్ని పలికితే, రాముడు , సీతమ్మ ,(లక్ష్మీ, విష్ణు స్వరూపము), లక్ష్మణ స్వామి , హనుమంతుడు ,శివుడు , పార్వతీదేవి వీరందరి అనుగ్రహం కలుగుతుంది . ఆ ఒక్క నామం పలికితే ఈ విధంగా ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు.  అలాంటి నామ పారాయణం చేయడం మరువకండి. శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష! శుభం !!

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi