అనారోగ్యము బాధించేప్పుడు ఈ నామాలు స్మరిస్తే చాలు
‘అనారోగ్యము బాధించేప్పుడు ఈ నామాలు స్మరిస్తే చాలు!’ ఇది ధన్వంతరి మాట !
- లక్ష్మి రమణ
విష్ణు (Vishnu) భగవానుణ్ణి స్మరించడం, ఆయన మహిమాలని, కథలని ఈ వైశాఖ(Vaisakha) మాసములో వినడం, చదవడం, వినిపించడం అన్ని కూడా మహా పుణ్య కార్యాలు అని విశాఖ పురాణం చెబుతూ ఉంది. అటువంటి మహిమాన్వితుడైన మహావిష్ణువుని అనంతమైన నామాలలో కేవలం మూడు నామాలు స్మరిస్తే, ఎటువంటి మహా రోగాలైనా నశించి పోతాయని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ నామాలు ఏమిటి? వాటిని ఏవిధంగా స్మరించాలనే విషయాలని ఇక్కడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
విష్ణుమూర్తికి అనంతమైన నామాలు. ఆ నామాల్లో అచ్యుత, అనంత, గోవింద అనే నామాలు ఎంతో విశిష్టమైనవి. సాధుపరిత్రారణ కోసం, దుష్ట వినాశనం కోసం, ధర్మసంస్థాపన కోసం, పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తూ ఉంటానని భగవద్గీతలో చెప్పారు.
అచ్యుత అనంత గోవిందా అనే ఈ విశిష్టమైన పరమాత్మ నామాలని సంధ్యావందనం మొదలుకుని, ఏ వైదిక కర్మచేసిన ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః అని ఆచమించి స్మరించి ఆనందిస్తాం. ఇలా రోజూ మనం తలుచుకొని ఈ నామాల గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే , క్షీరసాగర వృత్తాంతాన్ని స్మరించుకోవాలి.
క్షీరసాగర మదన సమయంలో అవతరించినటువంటి మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద విద్యకు అథిదేవుడు, ప్రథమ పురుషుడు. స్వయంగా శ్రీమన్నారాయణుని అంశాస్వరూపుడు. ఆయన చెప్పిన దివ్యమైన మంత్రం …
" అచ్యుతానంత గోవింద నామోచ్ఛారణ బేషజాత్
నశ్యంతి సకల రోగా: సత్యం సత్యం వదామ్యహం "
దీని అర్థం ఈ మూడు నామాలను పలకడం అనే మందు చేత సర్వరోగాలూ నశించి తీరతాయి. ఇది సత్యం సత్యం! అని. ఇలా రెండు మార్లు సత్యమని చెప్పడం ద్వారా, శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెబుతున్న విషయం ఈ మూడు నామాలని పలకడం ద్వారా రోగనాశనం జరుగుతుంది అని . వైద్య విద్యా గురువైనటువంటి ధన్వంతరి వచనం కంటే ఈ విషయంలో మరొక ప్రమాణం అవసరమా? ఇది పరమ ప్రమాణం.
పద్మ పురాణంలో ఈ నామ మహిమ ఎంతో గొప్పగా వివరించబడింది. పార్వతీదేవి ప్రశ్నించగా శ్రీ పరమేశ్వరుల వారు శ్రీమన్నారాయణ ని లీలలను వివరిస్తూ కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మదన గాధను వినిపించారు . ఆ సందర్భంలోనే ఈ నామాల మహిమని పార్వతీదేవికి ఇలా చెప్పారు. “ఓ పార్వతి! పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. మునులు దేవతలు లక్ష్మీనారాయణులని స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైనటువంటి హాలాహలం పాలకడలి నుండి ఉద్భవించింది. కాలాన్ని చూసి దేవతలు దానవులు భయపడి తలోక దిక్కుకి పారిపోయారు. పారిపోతున్నటువంటి దేవతలను రాక్షసులను ఆపి భయపడవద్దని చెప్పి, ఆ కాలకూటాన్ని నేను మింగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్తుతించసాగారు.
అప్పుడు నేను ఏకాగ్రచితంతో సర్వకష్టాలనూ తీర్చేటటువంటి శ్రీమన్నారాయణుని ధ్యానం చేసి, ఆయన నామాలలో ప్రధానమైనటువంటి మూడు నామాలు అచ్యుత, అనంత, గోవింద అనే మహా మంత్రాలన స్మరిస్తూ ఆ భయంకరమైనటువంటి విషయాన్ని తాగాను. సర్వవ్యాపి అయినటువంటి విష్ణు భగవానుని యొక్క ఆ నామాత్రయ మహిమ వల్ల, సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా మింగ గలిగాను. ఆ విషము నన్నేమీ చేయలేకపోయింది.” అని చెప్పారు.
కాబట్టి అంత మహిమాన్వితమైన ఈ మంత్రాల వంటి నామాలని స్మరించుకుందాం. విశేషించి వైశాఖ మాసములో వీటిని స్మరించుకోవడం మరింత విశేషమైన ఫలాన్ని అనుగ్రహిస్తాయి. అదే విధంగా అనారోగ్యము బాధిస్తున్నప్పుడు ఈ నామాలు కష్టాల సముద్రాన్ని దాటించే నావాలాగా ఆ బాధనుండీ దాటిస్తాయి. కనుక క్షీరసాగర సందర్భాన్ని, ఈ నామ మహిమ నంతా కూడా జ్ఞప్తికి తెచ్చుకొని, విశ్వాసాన్ని పెంచుకొని, వీటిని స్మరించుకుంటూ, అందరూ భగవత్ కృపకు పాత్రులవుదురు గాక !!
ఓం నమో భగవతే వాసుదేవాయ!
Dhanvantari, Vishnu, names,
#vishnu #dhanvatari #namavali