Online Puja Services

వైశాఖ పురాణం 26వ అధ్యాయం

18.190.176.78

కర్మ , జన్మలచక్రం నుండీ ముక్తిని ప్రసాదించే వైశాఖ పురాణం 26వ అధ్యాయం 
- లక్ష్మి రమణ 

నారద (Narada) మహర్షి, అంబరీష (Ambarisha) మహారాజుకు వైశాఖ (Vaisakha) మహిమను ఈ విధంగా చెప్పసాగారు. “ఓ అంబరీషా!  శృతదేవ మహాముని శృతి కీర్తి మహారాజుకు వివరించిన ఈ వృత్తాంతము అత్యంత ఫలప్రదమైనది, మహిమాన్వితమైనది. దీన్ని కేవలం వినడం వలన కర్మ , జన్మల చక్రం నుండీ బయటపడి ముక్తిని పొందగలరు.”  అంటూ శంకుడు, వేటగానికి మధ్య జరిగిన వృత్తాంతాన్ని ఇలా వివరించసాగారు. 

తమ ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కూలిపోవడాన్ని, దాని తొర్రలో నుంచి వచ్చిన భయంకర సర్పము, దివ్య రూపాన్ని ధరించి తలవంచి నమస్కరించి నిలవడాన్నీ  చూసి శంకుడు, వేటగాడు ఇద్దరు కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు.  శంకుడు ఆ దివ్య పురుషుడిని చూసి “ ఓయీ !  నీవెవరు? నీకు ఈ దశ ఏ విధంగా సంభవించింది? విముక్తి ఎందుకు కలిగింది? నీ వృత్తాంతాన్ని అంతా వివరంగా తెలియజేయమని” అడిగాడు.  శంకుడు ఈ విధంగా అడగగానే, ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా చెప్పారం ఆరంభించాడు. “ ఆర్య! నేను ప్రయాగక్షేత్రంలో ఉండేటటువంటి బ్రాహ్మణుణ్ణి.  కుసీదుడనే ముని పుత్రుడిని.  నాపేరు రోచనుడు. మాటకారిని, రూప, యవ్వనాలు, విద్యాసంపదలు, అనేకమంది సంతానము  నాకున్నాయని ఎంతో గర్వించాను. నాకు కూర్చోవడం, పడుకోవడం, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగాలు చేయడం, వ్యాపారం చేయడం, నిత్య కృత్యాలు గా ఉండేవి.  చేసే జనం అపేక్షిస్తారని, సంధ్యావందనాదికాలు చేసినట్లుగా నటించేవాడిని.  మోసము, ఆడంబరము తప్ప నాకు పూజాదుల పైన శ్రద్ధ లేదు.  ఈ విధంగా కొంత కాలం గడిచింది. 

ఒక వైశాక మాసంలో జయంతుడు అనే బ్రాహ్మణోత్తముడు వచ్చి, మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతాన్ని వ్రత (Vrata) ధర్మాలను వివరిస్తూ ఉన్నారు. స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర వర్ణముల వారు, కొన్ని వేలమందిగా ఆయన చెప్పిన విధానంగా  వైశాఖ వ్రతాన్ని (Vratha) ఆచరిస్తూ ఉన్నారు.  ప్రాతఃకాల స్నానము, శ్రీహరి పూజ, కథా శ్రవణము మొదలైన పనులను చేస్తూ ఉన్నారు. ఆ జయంతుడు చెబుతున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధ శక్తులతో వినేవారు. 

నేను ఆ సభను చూడాలని వేడుక పడ్డాను.  తలపాగా మొదలగు వాడితో విలాసమైన వేషాన్ని ధరించి, తాంబూలాన్ని నములుతూ ఆ సభలోకి ప్రవేశించాను.  నా ప్రవర్తన చేత సభలోని వారందరికీ ఇబ్బంది కలిగింది.  నేను ఒకరి వస్త్రాన్ని లాగుతూ, మరొకరిని నిందిస్తూ, వేరొకరిని పరిహసిస్తూ అటు ఇటు తిరుగుతూ, హరికథా ప్రాసంగానికి, శ్రవణానికి ఆటంకాన్ని కలిగించాను. ఇటువంటి దోషముల వల్ల నా  ఆయువు క్షీణించి, రోగగ్రస్తుడనయ్యాను.  మరణించాను. ఆ తర్వాత  బాగా వేడిగా ఉన్న నీటిలోనూ, సీసముతో కూడి ఉన్న నరకములోను చాలా కాలము కాలకూట సాన్నిద్యములోను ఉండి, 84 లక్షల జీవరాశులలోను జన్మిస్తూ, భయంకరమైనటువంటి సర్పరూపాన్ని పొంది, విశాలమైన ఈ మర్రిచెట్టు తొర్రలో ఆహారము లేక బాధపడుతూ 10,000 సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాను. 

ఓ మహనీయా ! దైవికముగా నువ్వు చెబుతున్నటువంటి వైశాఖ  మహిమ విని నా పాపాలను పోగొట్టుకుని, శాప విముక్తుడై దివ్య రూపాన్ని పొందాను. నాకు ఇటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి నీకు కృతజ్ఞుడనై  ఈ విధంగా నమస్కరిస్తున్నాను.  ఓ స్వామి! మీరు నాకు ఏ జన్మలో బంధువో తెలియదు.  నేను మీకు ఎప్పుడు ఏ విధంగా సహాయ పడనూలేదు. అయినప్పటికీ, సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహాన్ని కలిగి ఉంటారు.   స్వామి సజ్జనులు, దయావంతులు అయినటువంటి వారు నిత్యము పరోపకార పరాయణులే కదా! స్వామి నాకు ఎప్పుడూ కూడా ధర్మబుద్ధి కలిగే విధంగాను, విష్ణు కథలను మరిచిపోకుండా ఉండేవిధంగాను అనుగ్రహించు. నేతృ దోషము గలవారికి కాటుక సహాయపడినట్లుగా ధన మదముగలవారికి, దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సావాసం సదా ఉండాలి” అని ఆ దివ్య పురుషుడు శంఖముని బహు విధాలుగా ప్రార్థిస్తూ నమస్కరించి నిలబడ్డాడు. 

 శంఖమని తనకు నమస్కరిస్తూ నిలబడి ఉన్న ఆ దివ్య పురుషుని  తన బాహువులతో పైకి లేవనెత్తాడు.  తన పవిత్రమైన చేతితో అతనిని  స్పృశించి, మరింత పవిత్రుడిగా చేశాడు. కొంత కాలం కన్నులు మూసుకొని ధ్యానమగ్నుడై ఉండి అతని పై దయ కలిగినవాడై అతనికి  ముందర కలగబోవు జన్మని ఈ విధంగా వివరించాడు. “వైశాఖమాస మహిమలు వినడం వలన, శ్రీహరి మహిమలను వినడం వలన నీ పాపాలన్నీ కూడా తొలగిపోయాయి.  నువ్వు దశార్న దేశమున వేద శర్మ అనే బ్రాహ్మణునిగా జన్మిస్తావు.  వేద శాస్త్రాలను చక్కగా చదువుకుంటావు.  పాపము కలిగించేటటువంటి ధనము, పుత్రులు తదితరములైన అనవసర ఆసక్తిని విడిచి సత్కార్యముల పట్ల ఇష్టము గలవాడవై విష్ణు ప్రియమైనటువంటి  వైశాఖ  ధర్మాలను అనేక మార్లు ఆచరించగలవు . సుఖము దుఃఖము ఈ రెండింటినీ విడిచి నిస్సంగుడివై, నిరీహుడువై, గురుభక్తి , జయము కలిగిన వాడివై సదా విష్ణు కథాసక్తుడవు కాగలవు.  ఈ విధంగా సర్వబంధములు విడిచి సర్వోత్తమమైనటువంటి శ్రీహరి పదమును చేరగలవు.  నాయనా! భయపడకు.  నీకు నా అనుగ్రహం వలన శుభము కలుగుతుంది.  హాస్యముగా కానీ, భయముగా కానీ, కోపం వలన గాని, ద్వేష, కామముల వలన గాని, స్నేహము వలన గాని, శ్రీహరి నామాన్ని పలికినంత మాత్రము చేత సర్వపాపాలు నశించిపోతాయి.  ఇటువంటి స్థితిలో శ్రద్ధ భక్తులతో జితేంద్రులై మనసారా శ్రీహరి నామాన్ని ఉచ్చరించిన వారికి శ్రీహరి పదము కచ్చితంగా కలుగుతుంది.  శ్రీహరి పైన భక్తి కలిగి సర్వధర్మములను విడిచిన వారైనప్పటికీ, శ్రీహరి పదాన్ని చేరతారు.  ద్వేషాదుల చేత శ్రీహరిని సేవించిన వారు, పూతన లాగా శ్రీహరి స్థానాన్ని పొందుతారు.  సజ్జన సహవాసము, సజ్జన సంభాషణ మొదలైనవి తప్పక ముక్తినిస్తాయి.  కాబట్టి ముక్తిని కోరేటటువంటివారు సజ్జనులను సర్వదా సేవించాలి.  శ్లోకమున దోషములు ఉన్నప్పటికీ, శ్రీహరి నామములు ఉన్నట్లయితే సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి మక్తిని పొందగలరు.  ఇక్కడ విష్ణు (Vishnu) నామ మహిమ గమనించ వలసింది సుమా!” అని వివరించాడు. 

 శ్రీహరి (Srihari) భక్తులకు కష్టము కలిగించే సేవను కోరడు.  అధిక ధనాన్ని, రూప యవనములను కోరడు. కేవలం మనసారా  శ్రీహరిని ఒక్క మారు స్మరిస్తే సర్వోత్తమమైనటువంటి వైకుంఠ ప్రాప్తినిస్తాడు.  అటువంటి భక్తసులభుడు,  దయాళువు అయినా పరమాత్ముని  విడిచి మరింక మనము  ఎవరిని శరణు కోరగలము? కాబట్టి దయానిధి, జ్ఞానవంతుడు, భక్తవత్సలుడు మన పూర్వకమైన  భక్తికే సులభుడు, అవ్యయుడు అయినటువంటి శ్రీమన్నారాయణని శరణు పొందుతాము. 

 నాయనా! వైశాఖ మాసమునకు చెందినటువంటి ధర్మములన్నింటినీ యధాశక్తిగా ఆచరించు.  జగన్నాథుడైనటువంటి శ్రీహరి సంతోషించి నీకు శుభములను ప్రసాదిస్తాడని” శంకరుడు దివ్య రూపధారిని ఉద్దేశ్యించి  పలికాడు.  అప్పుడు ఆ దివ్య పురుషుడు కిరాతుని  చూచి ఆశ్చర్యపడి మళ్లీ శంకునితో ఈ విధంగా అన్నాడు. “ ఓ శంకమహాముని! దయాస్వభావముగల నీ చేతనుగ్రహించబడి ధన్యుడనయ్యాను.  నాకు గల దుర్జన్మలన్నీ నశించాయి.  నీ అనుగ్రహము చేత ఉత్తమ గతిని పొందగలుగుతున్నా”నని పలికి శంకుని అనుజ్ఞను పొంది, స్వర్గలోకానికి పోయాడు.  

కిరాతుడు కూడా శంఖమునికి వలసినటువంటి ఉపచారములన్నీ కూడా భక్తి యుక్తుడై ఆచరించాడు. శంఖముని  కూడా ఆనాటి సాయంసమయాన్ని,  రాత్రిని కిరాతకునికి భక్తిని కలిగించే మహా మహిమాన్వితములైనటువంటి శ్రీహరి కథలను చెబుతూ గడిపాడు.  బ్రహ్మ ముహూర్త కాలమున లేచి కాల కృత్యాలను నెరవేర్చి, సంధ్యావందనాది  కార్యక్రమములను, శ్రీహరి పూజను పూర్తి చేశాడు.  పరిశుద్ధుడైనటువంటి కిరాతునికి తారక నామమైనటువంటి ‘రామ’ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు.  “నాయనా శ్రీహరి పట్ల భక్తి తో స్మరించే ఈ ఒక్క పేరు అన్ని వేదముల కంటే ఉత్తమమైనటువంటిది. భగవంతుని  నామములు  అన్నింటికంటే కూడా సహస్రనామములు ఉత్తమమైనవి.  అటువంటి సహస్రనామాలకు రామ నామము ఒక్కటే సమానము.  కాబట్టి నిత్యము ఈ రామ నామాన్ని నిత్యము జపించు.  వైశాఖ ధర్మములు బ్రతికి ఉన్నంత కాలము వరకు ఆచరించు. దీనివల్ల వాల్మీకుడు అనే మునికి పుత్రుడుగా జన్మించి, వాల్మీకి అనే పేరిట భూలోకమున ప్రసిద్ధిని పొందగలవు.  అని ఆశీర్వదించి శంకరుడు వ్యాధునికి రామ నామాన్ని ఉపదేశించి, దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు. 

 కిరాతుడు కూడా శంకునికి ప్రదక్షిణ, నమస్కారములను ఆచరించి, కొంత దూరం అనుసరించి వెళ్ళాడు. అలా  వెళుతూ ఉన్న శంఖమునిని  విడవడం బాధాకరంగా ఉంది. గురుస్వరూపుడైన ఆ  మునిని విడవలేక బెగ్గరగా దుఃఖించాడు.  ఆ మునిని చూస్తూ, ఆయననే తలుస్తూ ,దుఃఖాతురుడై ఉన్నాడు.  అతడు అడవిలో మనోహరమైన తోటలని నాటాడు.  నీడనిచ్చే మండపాలను, చలివేంద్రాలను నిర్మించాడు.  మహిమాన్వితములైనటువంటి వైశాఖ  ధర్మాలను ఆచరిస్తూ ఉన్నాడు.  అడవిలో దొరికే వెలగ, మామిడి, పనస మొదలైనటువంటి పళ్ళతో బాటసారులకు సేవ చేస్తూ ఉన్నాడు. పాదుకలు, చందనము, గొడుగులు, విశిన కర్రలు తదితరాలని ఇస్తూ బాటసారులకు అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా బాటసారులకు సేవ చేస్తూ శంఖమహాముని  చెప్పినటువంటి రామా నామాన్ని రాత్రింబగళ్లు జపిస్తూ, కాలాంతరమున మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించాడు.  

కృష్ణుడనే ఒక ముని జితేంద్రియుడై చిరకాలము తపస్సు చేశాడు.  బాహ్య స్మృతిని విడిచిపెట్టి, అత్యంత తీవ్రమైన తపస్సును ఆచరించారు.  కొంతకాలానికి అతనిపై మట్టిపడి ఒక పుట్టగా తయారైంది.  పుట్టలు కట్టినా  బాహ్యస్మృతిని విడిచి తపస్సును ఆచరించటం వలన ఆయనని వాల్మీకమని పిలిచారు.  కొంతకాలానికి ఆయన తపస్సు విరమించారు. ఆయనని చూసి ఒక నాట్యకత్తె మోహించి ఆయనని వివాహం చేసుకుంది . వారిద్దరికీ పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యాడు.  అతడే దివ్యమైన రామ కథ అనే  గంగా ప్రవాహమును భూమి పై ప్రవహింపజేశారు.  ఆయన రచించిన రామాయణ మహాకావ్యం మానవుల సర్వకర్మ బంధాలను పోగొట్టేదై భక్తలను మార్గనిర్దేశనం చేసింది.  

ఓ  శృతి కీర్తి మహారాజా! వైశాక మాస మహిమను విన్నావా! దుష్టుడైన కిరాతుడు శంకుని పాదుకలు మొదలైన వాటిని దుర్బుద్ధితో దొంగలించినప్పటికీ, వైశాఖ మహిమ వల్ల శంకునికి శిష్యుడై, అనేక ధర్మాలను విని ఆచరించి, వాల్మీకిగా జన్మించి పవిత్రమైన రామ కథను లోకానికి తెలిపి చిరస్మరణీయుడయ్యాడు. మహర్షి అయ్యాడు.  పాపములను పోగొట్టి, పరమానందకరాన్ని కలిగించేటటువంటి ఈ కథను చెప్పినవారు, విన్నవారు పునర్జన్మను విడిచి ముక్తిని పొందుతారు .”అని  శృతదేవుడు శృత కీర్తి మహారాజుకు శంఖ-వ్యాధ సంవాదముని , వైశాఖ మహత్యాన్ని  వివరించారని నారదుడు అంబరీషునికి వివరించారు. 

వైశాఖ పురాణం 26వ అధ్యాయం సంపూర్ణం . 

సర్వం శ్రీ హరి పాదారవిందార్పణమస్తు !

Vaisakha Puranam

#vaisakhapuranam

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi