Online Puja Services

ధ్యానశ్లోకాలలో విశ్వ నిర్వాహక విశ్వేశ్వర విజ్ఞానం!!

3.139.98.10

ధ్యానశ్లోకాలలో విశ్వ నిర్వాహక విశ్వేశ్వర విజ్ఞానం!! 
– బ్రహ్మశ్రీ, సామవేదం షణ్ముఖ శర్మ గారి దివ్య ప్రవచనం నుండీ 

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!! 

ఈ శ్లోకాన్ని మనమందరం సాధారణంగా నిత్యపూజలో కూడా ధ్యాన శ్లోకంగా స్మరించుకుంటూ ఉంటాం. ఈ శ్లోకంలో గంభీరమైన, సూక్ష్మమైన సృష్టి విన్యాసం దాగి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతాం . ఆ గొప్పదనాన్ని గురువుగారు , సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ, సామవేదం షణ్ముఖ శర్మగారి దివ్య ప్రవచనం నుండీ తెలుసుకుందాం . 

ఈ శ్లోకంలో  సృష్టిక్రమం..
సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం.. 
ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.

శాంతాకారం

సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.
శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.
అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.
ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.
శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.

భుజగ శయనం

భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.
ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.
కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.
కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.

పద్మనాభం

సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.
సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.
దానికి నాభి (కేంద్రం) విష్ణువే.
అందుకే ఆయన ‘పద్మనాభుడు’.

సురేశం

విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,
విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.
నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.
జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు
(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).
ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.
ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.
అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.

విశ్వాధారం

కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.
సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.
కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.
నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’.
అలల ‘ఆకారం’  అంతా జలమే.
జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..
విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.

గగన సదృశం

ఇది ఎలా సంభవం?
ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.
సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.
అదేవిధంగా ఆకాశంతో సహా,
సమస్త విశ్వమూ ఎవరియందు,
ఎవరిచే వ్యాప్తమై ఉందో,
అతడే పరమాత్మ.
అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).
ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.
ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.

మేఘవర్ణం

నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..
తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.
ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.

శుభాంగం

మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.
అందుకే అది నీలమేఘశ్యామం.
ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.
కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.
తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.
అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.

లక్ష్మీ కాంతం

ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.
ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,
ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.
అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’.

కమల నయనం

ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.
కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.

యోగిహృద్యానగమ్యం

ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.
యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.
ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.

వందే విష్ణుం  భవ భయహరం

విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.
ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.

సర్వలోకైకనాథమ్

సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.

14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.
ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.

ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని,
ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా,
మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.

అర్థస్ఫూర్తితో దీనిని పఠిస్తే, దీనిలో పరిపూర్ణ పరమేశ్వర తత్త్వాన్ని, సులభంగా అందుకోగలం.

ఇలా విశ్లేషిస్తే – ధ్యానశ్లోకాలలో విశ్వ నిర్వాహక విశ్వేశ్వర విజ్ఞానాన్ని మరింతగా తెలుసుకోవచ్చు.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi