Online Puja Services

జలం జల్లితేనే శాపం అవుతుందా ?

3.142.171.90

జలం జల్లితేనే శాపం అవుతుందా ?
- లక్ష్మి రమణ 

సాధారణంగా మనం పురాణాల్లో చదివేప్పుడు, సినిమాల్లో చూసేప్పుడూ  శపించినప్పుడు, వారి కమండలంలోని జలాన్ని చేతిలోకి తీసుకొని శాపం పెట్టాక (ఆ మాట అన్నాక) చేతిలోని జలాన్ని శపించినవారి మీద జల్లుతారు. అలా మునులు తాము శపించిన వారి మీద తమ కమండలంలోని నీళ్లు ఎందుకు చల్లుతారు? జలం జల్లకపోతే అది వర్తించదా ? దీని గురించి వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం .  

జలం సర్వ ప్రపంచానికి ఆధారం.  జలంలో నుండే సర్వలోకము సమస్త భూతజాలము జన్మించాయి.  విశ్వమంతా కూడా జలంలోనించే పుట్టి చివరకు జలంలోనే లయిస్తుంది.  కాబట్టి జలం సర్వవిశ్వాత్మకం. ఈ కథని మశ్చావతార గాథ వివరంగా తెలియజేస్తుంది . 

లోకంలో మంత్ర శక్తిని తమలో నిలుపుకో గల వస్తువులు మూడే ఉన్నాయి.  అవి, ఒకటి జలము, రెండు రుద్రాక్ష, మూడవది విభూతి. జలకలశంలో ఏ దేవతామూర్తి నైనా ఆవాహనం చేసి పూజించవచ్చు.  జలం సర్వదేవతాత్మకం.  ఏ సంకల్పాన్నైనా జలాన్ని స్పృశించి చేయటం విధివిహితం. అందుకే శాపవాక్కులతో జలాన్ని అభిమంత్రించి ప్రయోగిస్తే, ఆ శాపాన్ని ఇచ్చిన వారి శక్తి ఆ జనంలో నిక్షిప్తమై పని చేస్తుంది. 

శాపజలం  యొక్క ప్రభావాన్ని తెలిపే కథలు కూడా అనేకంగా ఉన్నాయి.  వాటిలో ఒక కథని ఇక్కడ చెప్పుకుందాం. విష్ణు పురాణంలోనూ, వ్యాస భారతంలోనూ, భాగవత పురాణంలోనూ ఈ కథ చెప్పబడింది.  పూర్వం ఇక్ష్వాకువంశీయుడైన సౌదాసుడనే ఒక రాజు ఉండేవాడు.  శ్రీరామునికి ఈయన పూర్వజుడు.  ఆయన రాజ్యంలోని అడవిలో ఇద్దరు రాక్షసులు పులుల రూపంలో సంచరిస్తూ, కంటపడిన సర్వప్రాణులను భక్షిస్తూ ఉండేవారు.  సౌదాసుడు వేటకు వచ్చి, ఆ ప్రాంతాలలో ఒక్క మృగం కూడా కనిపించక ఆ పులుల రూపంలో ఉన్న రాక్షసుల్లోని ఒక పులిపై బాణ ప్రయోగం చేసి చంపాడు. దాంతో రెండవ రాక్షసుడు, సౌదాసునిపై ఆగ్రహించి ఆ రాజును పరుష వాక్యాలతో దూషించి, తగిన ప్రతీకారం చేస్తానని సవాలు చేసి అదృశ్యుడైపోయాడు.  రాజు కలవర పడుతూ అయోధ్యకు చేరాడు. 

 ఆ సౌదాస మహారాజు కొంతకాలం తర్వాత దీక్షితుడై ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞాంతంలో, ఆరోజు సౌదాసునిపై పగబట్టిన రాక్షసుడు రాజ పురోహితుడైన వశిష్ఠుని రూపంలో సౌదాసుని సమీపించాడు. తనకు నర మాంసాన్ని వండించి పెట్టమని, తన మాటకు పూర్వాపరాలు మంచి చెడ్డలు ఆలోచించక చెప్పినట్టు చేయవలసింది అని మాయావశిష్ఠుడు సౌదాసుని ఆజ్ఞాపించి వెళ్ళాడు.  ఉత్తముడు సత్వగుణ సంపన్నుడు అయిన వశిష్ఠుడు ఆ విధంగా ఆజ్ఞాపించినందుకు ఆశ్చర్యపోయాడు సౌదాసుడు.  కానీ మహానుభావుడైన వశిష్టునికి తెలియని ధర్మమేముంది? ఆయనకు మంచి చెడ్డలు తెలుపవలసిన అవసరమేముంది? ఆయన సకల ధర్మవేత్త.  బ్రహ్మ మానస పుత్రుడు.  ఆయనే స్వయంగా ఆజ్ఞాపించాడని భావించిన సౌదాసుడు వంటవానిని ఆ ప్రకారమే చేయమని వధ్యస్థానంలో ఉండి మరణశిక్షపడి ఎవరు తీసుకు వెళ్ళని శవాన్ని తెచ్చి వండమని చెప్పాడు. 

 అనంతరం ఆ రాక్షసుడు వంటవానిలో ఆవహించి నరమాంసాన్ని సిద్ధం చేశాడు.  తన ప్రతీకారానికి రాక్షసుడు ఈ విధంగా రంగాన్ని సిద్ధం చేశాడు.  ఇంతలో నిజమైన వశిష్ఠుడు అక్కడికి రాగా, జరిగింది రాక్షసమాయ అని తెలుసుకోలేని సౌదాస మహారాజు ఆ నరమాంస భోజనాన్ని నిజమైన వశిష్టునికి పెట్టాడు.  అప్పుడు రాక్షసుడు ఊహించినట్లుగానే జరిగింది.  తనకు వడ్డించింది నరమాంసమని తెలుసుకున్న వశిష్టునికి పట్టరాని ఆగ్రహావేశాలు కలిగాయి. ఆయన క్రోధంతో “రాజా! ఇదేమి రాక్షసకృత్యము? ఈ అకృత్యానికి నువ్వెలా సాహసించావు? మతి బ్రష్టుడైనవా నీవు చేసిన ఈ ఆకృత్యానికి శిక్షగా నీవు నర మాంసభక్షకుడువై రాక్షసుడువు కావలసిందని శపించాడు. 

తనను నర మాంసం కోరిన వాడు వశిష్టుడైనని, అతడే తనని ఇప్పుడు తప్పు పట్టి శపించాడని భావించిన సౌదాసుడు కూడా క్రోధ పూరితుడయ్యాడు. నేను ప్రతి శాపం ఇవ్వగలనని శపించడానికి జలాన్ని చేతితో గ్రహించాడు.  అయితే పూజ్యుడైన వశిష్టుని శపించరాదని సౌదాసుని అతని భార్య మదయంతి శాప జలాన్ని విడువకుండా నిరోధించమని వేడుకుంది. 

అప్పుడు  సౌదాసుడు కోపాన్ని నిగ్రహించుకుని ప్రభావ సంపన్నమైన ఆ శాప జలాన్ని ఎక్కడ విడిచి పెట్టాలా అని  వితర్కించుకుని, ఆ జలాన్ని ఎక్కడ విడిచినా అపకారం జరుగుతుందని, చివరకు ఆ జలాన్ని తన పాదాలపైనే పోసుకున్నాడు.  ఆ శాపజలం పాదాల మీద పడగానే సౌదాసుని పాదాలు కల్మషదోషితాలయ్యాయి.  అందువల్ల అతనికి కల్మషపాదుడు అనే పేరు ఏర్పడింది.  అనంతరం జరిగిన దానిని వారంతా చర్చించుకోగా ఈ వృత్తాంతమంతా రాక్షసమాయా  కల్పనగా తెలిసి వచ్చింది. సౌదాసుడు, మదయంతి వశిష్ఠుని  చరణాలకు తిరిగి తిరిగి ప్రణామాలు చేసి, గురువు అనుగ్రహాన్ని శాప విమోచనాన్ని అర్థించారు. 

అయితే, అమోఘమైన వశిష్ఠుని శాపాన్ని ఉపసంహరించడం స్వయంగా వశిష్టునికె అసాధ్యం.  ఆ తరువాత 12 ఏండ్లకు కల్మషపాదని శాపం నివృత్తం అవుతుందని వశిష్ఠుడు ఆనతిచ్చాడు. ఆ ప్రకారమే జరిగింది. 

అంతటి మహిమాన్వితమైనది ఈ సృష్టిలోని జలం. అందుకే తన శక్తిని జలంలో నింపి ఆ జలాన్ని జల్లడం చేత తమ వాక్కుని శాపంగా ఇచ్చేవారు మునులు . అయితే చాలా సందర్భాల్లో వాక్కే అమోఘంగా తిరుగులేని శాపంగా పరిణమించిన సందర్భాలూ లేకపోలేదు . అదీ సంగతి. 

శుభం !! 

#jalam #sapam

Tags: jalam, water, sapam, curse, vasista, rushi, muni

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi