కాశీ-రామేశ్వరం సంపూర్ణ యాత్ర ఎలా చేయాలి ?
కాశీ-రామేశ్వరం సంపూర్ణ యాత్ర ఎలా చేయాలి ? దీని విశిష్టత ఏమిటి ?
సేకరణ
కాశీ యాత్ర మహాపుణ్యం అని చెబుతారు. కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళి, తిరిగి కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే అది ' సంపూర్ణ కాశీ యాత్ర ' అవుతుంది. ఈ యాత్రకు సంబంధించి విధి విధానాలు ఉన్నాయి. ముందు కాశీ వెళ్ళి అక్కడ గంగాజలంతో విశ్వేశ్వరుని అభిషేకము చేయాలి. ఆ తర్వాత కాశీలోని గంగాజలంతో రామేశ్వరం లోని ఈశ్వరునికి అభిషఏకము చేయాలి.ఆ తర్వాత రామేశ్వరం లోని ఇసుక తీసుకొని తిరిగి కాశీ వెళ్ళి శివునికి అభిషకం చేయాలి.ఇలా చేస్తే దీనిని సంపూర్ణ తీర్ధయాత్ర అంటారు. పెద్దలు చెప్పిన ప్రకారం ఈ దివ్యమైన యాత్రని ఎలా చేయాలో పరిపూర్ణంగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం .
యాత్రా విధానం
మొదట వారణాశికి వెళ్ళాలి. అక్కడ గంగలో స్నానం చేసి, కాశీ విశాలాక్షిని, విశ్వనాధుణ్ణి దర్శించాలి. కాశీ క్షేత్రంలో 9 రోజులు నిద్ర చేయడం విధి అని చెబుతారు. ఇది హడావుడిగా ఒక్క రోజులో పూర్తయ్యే యాత్ర కాదు అని గుర్తుంచుకోవాలి . పవిత్ర గంగా నది జలం, గంగా మృత్తికని సేకరించాలి. ఈ రెండింటినీ భద్రపరచుకొని, రామేశ్వర యాత్రకి ఉపక్రమించాలి .
అక్కడ రామేశ్వర తీర్థంలో రామేశ్వర లింగాన్ని దర్శించాలి. కాశీ నుంచి భద్రంగా తీసుకువచ్చిన గంగా జలాలతో స్వామికి అభిషేకం చేయాలి . ఇక గంగమ్మ ఒడి నుండీ సేకరించిన మట్టిని రామేశ్వరంలోని సముద్రంలో నిమజ్జనం చేయాలి . ఇందులో ఏ ప్రకృతీ పురుషుల సమాగమం నిబిడీకృతమై ఉన్నదో మరి . ఇదొక గొప్ప సంప్రదాయంగా మన పెద్దలు అనుగ్రహించారు .
రామేశ్వరంలో సముద్ర స్నానం ఆచరించాలి. రామేశ్వర స్వామి ఆలయంలో 21 బావులు ఉంటాయి . వీటిల్లో దంపతులు స్నానాలు చేయాలి. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో స్త్రీలు చేసిన అపచారాలు తొలగి పోతాయని నమ్మిక.
ఇంతటితో కాశీ యాత్ర సంపూర్ణం అవుతుంది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అమ్మని అయ్యకి చేర్చినట్టే, తియ్యని అమ్మ ఒడికి చేర్చాలి . చూడండి , రామేశ్వరం సముద్రంలో నుండీ ఇసుక, మట్టి సేకరించి భద్రపరుచుకొని తిరిగి వారణాశి చేరాలి. అక్కడ గంగానదిలో స్నానం ఆచరించి , ఇసుకను, మట్టిని గంగలో కలపాలి.
ఇలా చేస్తే, యాత్ర కాశీ సంపూర్ణ యాత్రగా పరిగణించబడుతుంది . అయితే, ఈ యాత్రంతా ముగించుకొని ఇంటికి వచ్చాక, స౦తర్పణ చేయాలి. ఇందులో భాగంగా కాశీ క్షేత్రపాలకుడు, మన శరీరమనే క్షేత్రాన్ని రక్షించే భైరవ స్వరూపుడు, కాలభైరవ పూజ, గంగపూజ చేయాలి. గారెలు వండి, దండగా గుచ్చి, కాలభైరవుని ( కుక్క ) మెడలో వేయాలి.
సంపూర్ణ యాత్ర చేసిన వారికి కుటుంబ సభ్యులు ఎదురేగి, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు . బిడ్డలుగానీ, చిన్నవారు గానీ కాళ్ళు కడిగి, పాదపూజ చేయాలి. ఇలా ఎదురేగి, స్వాగతం చెప్పడం మన సంప్రదాయం. పూర్వం అడవులు దాటుకుని, ప్రయాస పడి కాశీ యాత్ర చేసేవారు. అలా వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని నమ్మకం వుండేది కాదు. అందుకే ' కాశీకి పోయిన వాడూ, కాటికి పోయిన వాడూ ఒకటే! ' నానుడి కూడా పుట్టింది .
ఇలా చేస్తే, కాశీ యాత్ర సంపూర్ణమవుతుంది . శుభం భూయాత్ !!