Online Puja Services

సాలకట్ల బ్రహ్మోత్సవాలకీ, బ్రహ్మోత్సవాలకీ తేడా ఏమిటి ?

3.17.176.70

సాలకట్ల బ్రహ్మోత్సవాలకీ,  బ్రహ్మోత్సవాలకీ తేడా ఏమిటి ? 
- లక్ష్మి రమణ 

తిరుమల శ్రీవారు నిత్య కళ్యాణ వైభోగంతో అలరారుతుంటారు. ఆ స్వామికి ఏం చేసినా అనంత సౌందర్య సమ్మోహనమే !! తిరుమల వేంకటేశ్వరునికి సాధారణంగా దసరా నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అయితే, ఈ బ్రహ్మోత్సవాలు కాకుండా స్వామికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి . సాలకట్ల బ్రహ్మోత్సవాలకీ, ప్రతి ఏడాదీ సంప్రదాయ బద్ధంగా జరిగే బ్రహ్మోత్సవాలకీ తేడా ఏమిటి ? 

శ్రీనివాసుని సేవించుకోవ‌డానికి సాక్షాత్తూ ఆ బ్ర‌హ్మ‌దేవుడే ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను మొద‌లుపెట్టిన‌ట్లు చెబుతారు. వేయి సంవ‌త్స‌రాల ముందు నుంచే తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్నాయ‌న‌డానికి ఆధారాలు ఉన్నాయి. అందుకు తగినట్టుగానే బ్రహ్మోత్సవాల సమయం వచ్చిందంటే, తిరుమల వీధులన్నీ భక్తుల రద్దీతో జనసంద్రంలా కనిపిస్తాయి . ఆ కోనేటిరాయుని కరుణా కటాక్ష చిరు వీక్షణం కోసం, చకోరాలై ఎదురుచూస్తుంటాయి . 

ఒక‌ప్పుడు బ్ర‌హ్మోత్స‌వాలు ఏడాదికి పొడ‌వునా, నెల‌కి ఒక‌సారి చొప్పున జ‌రిగేవ‌ట‌. ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక‌సారి మాత్రమే  జరుగుతున్నాయి . నిజమేలే , ఆ తిరుమల రాయుడికి రోజుకి 24 గంటల సమయము కూడా భక్తుల బాధలు తీర్చడానికి సరిపోవంటే అతిశయోక్తి కాదు . గంటల తరబడి, ఒక్కోసారి రోజుల తరబడి క్యూ లైనుల్లో నించోవలసి వచ్చినా, ఆపదమొక్కులవాడి అభయం పొందేవరకూ భక్తులు వెనక్కి తగ్గకుండా వేచి ఉంటారు . 

సాధారణంగా ఈ బ్రహ్మోత్సవాలు ద‌స‌రా సమ‌యంలో జ‌రుగుతూంటాయి . ఈ  స‌మ‌యంలో తిరుమ‌ల మాడ‌వీధుల‌లో వేర్వేరు ర‌థాల మీద ఊరేగుతూ వచ్చే స్వామిని ద‌ర్శించుకునేందుకు, ఎక్క‌డెక్క‌డి నుంచో భ‌క్తులు వ‌స్తారు. ర‌థోత్స‌వంలో ఉన్న స్వామిని క‌నుక చూస్తే, త‌న క‌ష్టాల‌న్నీ తీరిపోయి అంతులేని అనుగ్ర‌హం ద‌క్కుతుంద‌ని న‌మ్ముతారు.

అలాంటి బ్ర‌హ్మోత్స‌వాలు రెండుసార్లు వ‌స్తే, సాంప్రదాయ  బ్ర‌హ్మోత్స‌వాల‌ను కాకుండా రెండవ దానిని సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అని పిలుస్తారు. ఒక ఏడాదిలో క‌నుక అధిక‌మాసం వ‌స్తే ఇలా సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు. 

ద‌స‌రాలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల‌లాగానే ఇవి కూడా తొమ్మిది రోజుల‌పాటు జ‌రుగుతాయి.  కానీ ఈ రెండు బ్ర‌హ్మోత్స‌వాల మ‌ధ్యా కొన్ని తేడాలు లేక‌పోలేదు. సాధార‌ణ బ్ర‌హ్మోత్స‌వాల మొద‌టి రోజున ధ్వ‌జారోహ‌ణం ఉంటుంది. స్వామివారి వాహ‌నం అయిన గ‌రుడుని బొమ్మ ఉన్న జెండాను ఎగ‌ర‌వేయ‌డ‌మే ఈ ధ్వ‌జారోహ‌ణం. అలా ధ్వ‌జ‌స్తంభం మీద‌కు చేరిన గ‌రుడుడు, త‌న య‌జ‌మాని బ్ర‌హ్మోత్స‌వాల‌కు ర‌మ్మంటూ ముల్లోకాల‌లో ఉన్న దేవ‌త‌లంద‌రినీ ఆహ్వానిస్తాడు. కానీ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌లో ఈ ధ్వ‌జారోహ‌ణం జ‌ర‌గ‌దు.

ధ్వ‌జారోహ‌ణం బ‌దులు స్వామివారు మొద‌టి రోజు బంగారు ర‌థం మీద తిరుగుతారు. అలాగే బ్ర‌హ్మోత్స‌వాల‌లో ఆరో రోజు సాయంత్రం పుష్ప‌క‌విమానం బ‌దులు స్వ‌ర్ణ‌ర‌థం మీద ఊరేగుతారు. ఎనిమిదో రోజు ఉద‌యం కూడా స్వ‌ర్ణ ర‌థోత్స‌వం బ‌దులు సాధార‌ణ ర‌థం మీద భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తారు. ఇలాంటి చిన్న‌చిన్న తేడాలు త‌ప్పితే... సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కీ, సాధార‌ణ బ్ర‌హ్మోత్స‌వాల‌కీ మ‌ధ్య ఎలాంటి వ్య‌త్యాసం ఉండ‌దు. సంద‌డిలోను, సంప్ర‌దాయంలోనూ ఇవి ఏ ఉత్స‌వానికీ తీసిపోవు. 

అదన్నమాట సంగతి . ఒకరికి ఇద్దరైతే వేడుకేలే అన్నట్టు ,  బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు రెండు సార్లు జరగుతాయంటే, అంతకన్నా కావాల్సిన వేడుక భక్తులకి ఇంకేముంటుంది? సదా ఆ పాదమొక్కుల వాడి అనుగ్రహమే ఆయన భక్తులకి రక్ష !! ఆ అనంతుని  దివ్య కటాక్షం సదా మనందరికీ ఉండాలని తురుమలేశుని కైమోడ్పులతో వేడుకుంటూ శలవు !!  

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi