Online Puja Services

భగవద్గీత పదిహేడవ అధ్యాయ పారాయణ మహత్యం

3.145.75.238

మహామొండి వ్యాధుల్ని కూడా తగ్గించే భగవద్గీత పదిహేడవ అధ్యాయ పారాయణ మహత్యం .
- లక్ష్మీరమణ 
 
భగవద్గీతలోని సప్తదశాధ్యాయముకి భక్తిత్రయ విభాగమని పేరు .  వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞాలు , దానాలు చేస్తారనే విషయాన్ని భగవానుడు ఈ అధ్యాయంలో వివరిస్తారు. ఈ అధ్యాయాన్ని నిత్యమూ పారాయణ చేయడం వలన వచ్చే ఫలితం ఎటువంటిది అనేది పద్మ పురాణంలో వివరంగా చెప్పారు . పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించిన ఆ విశేషమైన ఉదంతం ఇక్కడ తెలుసుకుందాం . 

 పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతున్నారు “ప్రేయసి ఇంతకు ముందర పదహారవ అధ్యాయ మహత్యాన్ని చెప్పుకున్నాం కదా ! అందులో చెప్పుకున్నట్టు మహారాజు ఖడ్గబాహుడు తన  పుత్రునికి రాజ్యం అప్పజెప్పి తానూ పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ , కైవల్యాన్ని పొందారు.  వారి దగ్గర దుశ్శాశనుడు అని ఒక సేవకుడు ఉండేవాడు.  రాజుగారికి మాత్రమే లొంగిన ఆ మత్తగజాన్ని తానూ ఎలాగైనా లొంగదీసుకోవాలని అతని కోరిక . కానీ అది దైవంశ సంభూతమా అన్నట్టు సామాన్యులకి లోంగే రకం కాదు.  ఆ దుశ్శాశనుడు ఆ గజాన్ని లొంగదీసుకొనే ప్రయత్నంలో దాని పాదఘాతాలకి తాళలేక అక్కడే పడి మృతి చెందాడు .  

గజాన్ని అధిరోహించాలనే తీవ్రమైన కాంక్ష కారణంగా తిరిగి అతను  గజమై జన్మించాడు. అలా గజమై జన్మించిన ఆ దుశ్శాశనుడు దైవానుగ్రహం చేత , గీతలోని పదిహేడవ అధ్యాయ పారాయనని వినడం చేత ముక్తిని పొందాడు .”  అని చెప్పి పరమేశ్వరుడు ఆగారు .

అప్పుడా దేవదేవి మరింత కుతూహలంతో ఈశ్వరుణ్ణి ఇలా ప్రశ్నించింది .   
  
“ఓ నాథా! అసలు ఈ  దుశ్శాశనుడు ఎవరు? అతనికి ఈ గజతత్వము కేవలం గజాన్ని లొంగదీసుకోవాలనే కాంక్ష వల్ల మాత్రమే ప్రాప్తించిందా?  సప్తదశాధ్యాయమును వినగలగడానికి అతను  సుకృతం ఎటువంటిది ?  ఇదంతా కూడా తెలుసుకోవాలని ఉంది . దయచేసి వివరంగా తెలియజేయండి” అని కోరారు . 

సమాధానంగా  పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగారు. “పూర్వము ఆ దుశ్శాశనుడు మాండలిక రాజపుత్రుల తోటి ఒకసారి పందెము వేసి, గజాన్ని అధిష్టించి అతివేగంగా పోతూ ఉన్నాడు.  ఆ విధంగా వెళుతూ ఉండగా అతడు ప్రమాదవశాత్తూ జారీ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  ఆ గజము అతణ్ణి తొక్కి , అతి కోపంతో అతని శరీరము నుండి పేగులను, అస్థికలను కూడా పెకలించి మరీ ప్రాణాలు తీశింది.

 ఆ తరువాత అతడు సింహలాదీశ్వరుడైన జయదేవుని ఆస్థానములో గజమై జన్మించి చాలా కాలము గడిపాడు. ఒక సారి ఆ జయదేవుడు గజాన్ని తనకు పరమ మిత్రుడైన ఖడ్గబాహునుకు కానుకగా పంపించాడు.  ఆ ఖడ్గబాహుడు తన  ఆస్థానముకి వచ్చిన ఒక కవీశ్వరుడు వినిపించిన శ్లోకములకి సంతోషించి, ఆ గజాన్ని అతనికి బహుకరించాడు.  ఆ కవిశ్వరుడు ఆ గజమును మాలవదేశాధీశ్వరులకు దాన్ని విక్రయించాడు. 

అలా ఆ గజము మాళవదేశం చేరింది . ఒకనాడు ఆ గజానికి  భరింపనలవిగాని జ్వరము వచ్చింది. ఆ బాధ వల్ల ఏనుగు ఆహారము, నిద్ర, నీళ్లు వదిలి అలా అచేతనంగా పడివుండి కన్నీరు కార్చసాగింది. అది తెలుసుకున్న మాళవదేశాధీశుడు గజ చికిత్సలో నిపుణులైన వైద్యులని తీసుకొని ఆ ఏనుగుని చూడడానికి వచ్చారు .  

 మహారాజును చూసి, ఆ గజము ఆశ్చర్య ముట్టిపడే విధంగా మనుష్య భాషలో ఇలా చెప్పసాగింది . “ఓ భూపాలా ! ఈ వైద్యుల వల్ల, ఔషధాల వల్ల ఏమిటి ప్రయోజనం?  నువ్విప్పుడు తక్షణము ఒక బ్రాహ్మణున్ని ఇక్కడకు రప్పించు. భగవద్గీతలోని సప్తదసాధ్యాయాన్ని పారాయణ చేయించు . ఆ సప్త దశాధ్యాయ జపము చేత నాకు వచ్చినటువంటి ఈ రోగము ఖచ్చితంగా  విశ్రాంతి పొందుతుంది” అని చెప్పింది.  అప్పుడు  ఆ రాజుగారు అదే విధంగా ఒక విప్రుని పిలిచి, అతని చేత గీత సప్తదశాధ్యాయమును జపం చేయించాడు. వెంటనే ఆ గజము తన దేహాన్ని విడిచి, దివ్య రూపాన్ని దాల్చి, దివ్య విమానాన్ని అలంకరించింది. 

 రాజది చూసి ఆశ్చర్యాన్వితుడై, ఒక దివ్య రూపాధారి అయిన దుశ్శాశనుని  పూర్వవృత్తాంతం అంతా కూడా అతని ద్వారానే తెలుసుకున్నాడు.  ఆతర్వాత దుశ్శాశనుడు వైకుంఠాన్ని పొందాడు. అప్పటి నుండీ  ఆ మాళవ భూపతి కూడా గీతలోని సప్తదసాధ్యాయాన్ని పారాయణ చేస్తూ, అత్యల్ప కాలములోనే మోక్షాన్ని పొందాడు.  

కాబట్టి ఓ పర్వత రాజపుత్రి! ఈ గీతా సప్తదశాధ్యాయాన్ని పారాయణ చేయడం చేత పశువులుగా జన్మించిన వారు కూడా ముక్తిని పొందుతారు.  ఎన్ని ఔషధాలకు నివారణ కాకుండా ఉండేటటువంటి మహా మొండి వ్యాధులు కూడా ప్రశాంతత పొందుతాయి.” అని పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించారు . 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!! 

#bhagavadgeeta 

Tags: bhagawadgeeta, bhagavadgeeta, bhagavadgita

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi