Online Puja Services

భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయ పారాయణం మహత్యం

18.190.176.78

కలియుగంలో మనుష్యుల్ని తరింపజేసే ఉత్తమ సాధనం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయ పారాయణం మహత్యం .  
- లక్ష్మీరమణ 

భగవద్గీతలోని చివరి అధ్యాయం , పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగము. ఈ అధ్యాయంలో భగవానుడు అన్ని సంశయములను పరిత్యజించి, తన పైనే  మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని అర్జనునికి చెబుతారు . ఇక్కడ అర్జనుడు మానవుడు, కృష్ణుడు పరమాత్ముడు, చేస్తున్న యుద్ధం సంసారం అనే కర్మ . మనకి విధించిన కర్మాణి ఫలితం ఆశించకుండా చేయాలి . ఆ ఫలితాన్ని పరమాత్మకే వదిలేయాలి . భగవంతునిపై పూర్ణమైన విశ్వాసంతో ఉండాలి . అప్పుడు చేసిన కర్మ ఫలితం మనకి అంటుకోదు. ఈ ఉపదేశాన్ని విన్నతర్వాత  అర్జునుడు మోహ విరహితుడయ్యాడు. ఈ అర్జున, కృష్ణ సంవాదాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉన్నారు . ఆ క్రమంలోనే “యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని” సంజయుడు వ్యాఖ్యానించారు. భగవద్గీతలోని ఈ అద్భుతమైన అధ్యాయానని ఎవరైతే నిత్యమూ పారాయణ చేస్తారో , వారికి కలిగే ఫలితాలని గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా వివరిస్తున్నారు .  

“ఓ గిరినందినీ! చిన్మయానంద సుధా రసం ప్రవహింప చేసేటటువంటి అష్టదశాధ్యాయము వేదాలలో ఉత్తమమైనది. ఇది సర్వశాస్త్ర సారము. సంసార బంధనాలని సులభంగా ఛేదించగలిగిన దివ్య  పారాయణము. సిద్దులకు మాత్రమే తెలిసిన పరమ రహస్యము.  అవిద్యను నాశనం చేసేటటువంటిది.  శ్రీమహావిష్ణువుకు నిలయమైనటువంటిది.  కామ కామము క్రోధము మొదలైన అరిషట్ వర్గాలని నాశనం చేయగల శక్తిని కలిగినది.  ఈ అధ్యాయాన్ని చదివినంత మాత్రంచేత, ఎవరైనా చదువుతుంటే, విన్నంత మాత్రం చేత  యమబాధలు తొలగిపోతాయి. 

ఓ పార్వతి! ఇంతకంటే అధికమైనటువంటి పరమ రహస్యము ఇంకొకటి లేదు.  దీనివలన త్రివిధ తాపముల చేత దహించబడేటటువంటి మనుషుల తాపము కూడా తొలగిపోతుంది.  దేవతలతో ఇంద్రుడిలాగా, రసములలో అమృతము లాగా, పర్వతములలో కైలాసము లాగా, నక్షత్రాలలో చంద్రుడిలాగా, తీర్థములలో పుష్కరము లాగా, పుష్పములలో పద్మము లాగా, పతివ్రతలలో అరుంధతి లాగా, క్రతువులలో అశ్వమేధము లా,గా ఉద్యానవనములలో నందనోద్యాన వనము లాగా, ఏకాదశ రుద్రులలో వీరభద్రుడి లాగా, కాలములలో పరమేశ్వరుడిలాగా, పశువులందు కామధేనువు లాగా , మునులలో బ్రహ్మ వేత్త అయినటువంటి వ్యాసుని లాగా , దానములలో భూదానము లాగా, లోకములందు వైకుంఠము లాగా,ఈ పద్దెనిమిదవ  అధ్యాయము లోకోతరమైనది.  

సర్వతీర్థముల యొక్క పుణ్యము ఇందులో ఇమిడి  ఉన్నది. ఇది పర్వతముల లాగా పెరిగి ఉన్న పాప రాశులను కూడా క్షణకాలంలో నశింప చేస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక పురాతన ఇతిహాసాన్ని నీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అంటూ పరమేశ్వరుడు చెప్పసాగారు. 

“భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని విన్నంత మాత్రము చేతనే జీవులన్నీ కూడా సర్వపాపాల నుండి విముక్తిని పొందుతాయి . పూర్వము మేరు పర్వత శిఖరము పైన వినోదార్థమై సృష్టికర్త చేత అమరావతి అనే పట్టణము నిర్మించబడింది.  అక్కడ సమస్త దేవతల చేత కీర్తింపబడుతూ సచీదేవితో కూడా కలిసి ఇంద్రుడు పరిపాలకుడిగా సర్వభోగాలూ అనుభవిస్తూ ఉండేవాడు .  ఒక రోజున విష్ణు దూతల చేత సేవించబడుతూ, తన సన్నిధికి వస్తున్నటువంటి ఒక పురుషున్ని ఆశ్చర్య చకితుడై చూశాడు. ఆ నూతన పురుషుని తేజము చూడలేక, సింహాసము నుండి కింద పడిపోయాడు. 

అప్పుడు దేవతలు, దేవదూతలు కలిసి ఆ పురుషుణ్ణి ఆ సింహాసనము మీదే ఎక్కించి ఆ స్వర్గ రాజ్యానికి పట్టభద్రుడిని చేశారు.  దేవాంగనలు దివ్య గానము చేస్తూ, రత్న హారతులు ఇస్తున్నారు.  ఋషి సంఘములన్నీ కూడా వేదాశీర్వచనాల్ని చెబుతూ ఉన్నాయి.  రంభ మొదలైన అప్సరసలు ఆ నూతన పురుషుని ఎదుట నృత్యం చేయసాగారు.  గంధర్వులు మంగళ గానాన్ని చేస్తూ ఉన్నారు. పూర్వము ఇంద్రుడు అనుభవించిన భోగములన్నీ కూడా అతడు అనుభవించసాగాడు. 
 
 ఈ చిత్రాన్ని చూసి మహేంద్రుడు ఈ విధంగా ఆలోచించాడు.  ‘ఆహా ఇతనిది ఎంతటి అదృష్టమో ఇటువంటి మహా భోగమునకు కారణం ఏమై ఉంటుంది? ఇతడు నా లాగా 100 క్రతువులు గాని చెయ్యలేదు కదా! బాటసారుల సౌకర్యార్థం చెట్లని నాటించడం ,  బావులు తవ్వించడం,  ఆకలిగా ఉన్నవారికి పట్టెడన్నము పెట్టడం, ధర్మశాలలు స్థాపించడం, తీర్థయాత్రలు చేయడం కానీ ఆచరించినట్లుగా లేదే! అటువంటిది, ఇతనికి ఇటువంటి భాగ్యము ఏ విధంగా చేకూరింది? అని ఆలోచిస్తూ’,  క్షీరసముద్రంలో యోగనిద్రలో  ఉన్నటువంటి మహావిష్ణువును ఆశ్రయించాడు.  

ఆయనకీ నమస్కరించి ఈ విధంగా పలికాడు.  “ఓ లక్ష్మీనాథ! పూర్వము నేను మీ ఆజ్ఞానుసారముగా నూరు యజ్ఞములు చేసి ఈ ఇంద్ర పదవిని సంపాదించుకున్నాను ఇప్పుడు మరొక పురుషుడు వచ్చి,  నా సింహాసనాన్ని అధిష్టించి, ఇంద్ర భోగాలని అనుభవిస్తున్నాడు.  ఇంతకీ అతడు ఎవరు? అతనికి ఈ ఇంద్ర ఆధిపత్యం ఏ విధంగా లభించింది? ఈ విషయాన్ని తెలియజేయండి” అని కోరాడు.  

అప్పుడు శ్రీహరి ఈ విధంగా చెప్పారు . “ ఓ ఇంద్రా, ఆ పురుషుడు ప్రతి  రోజు భగవద్గీతలోని అష్టదసాధ్యాయములోని ఐదు శ్లోకాలను భక్తితో పఠిస్తూ ఉన్నాడు.  దాని వలన అతనికి ఈ ఇంద్ర పదవి లభించింది.  ఈ అష్టదశాధ్యాయ పారాయణ  అనేది పుణ్యములకు శిరోమణి వంటిది.  నీవు కూడా దానినే  ఆశ్రయించి, మళ్లీ నీ స్థానాన్ని పొందు” అని వివరించారు. 

 అది విని ఇంద్రుడు “మంచి తరుణోపాయం దొరికిందని బ్రాహ్మణ వేషాన్ని పొంది భూలోకము చేరుకున్నారు .  కాలిక అనే గ్రామానికి వెళ్ళాడు.  అక్కడ గోదావరి తీరంలో ఒక ధర్మాత్ముడు ఉన్నారు . వేద వేదాంగ కోవిదుడు, దయాసముద్రుడు, జితేంద్రుడు అయిన ఆ బ్రాహ్మణుడు నిత్యము భగవద్గీతలోని అష్టదశాధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉన్నాడు. ఇంద్రుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్లి ప్రణామాన్ని ఆచరించి, అతని చేత అష్టదసాధ్యాయాన్ని ఉపదేశము పొంది భక్తితో పారా యణం చేయసాగారు . 
 
మహావిష్ణువు అనుగ్రహించినట్టు, చివరికి  దానివల్లనే ఆ  ఇంద్రుడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు.  కాబట్టి ఈ అష్టదశాధ్యాయము మహర్షుల పరమతత్వం అని చెప్పబడుతోంది.  ఓ పార్వతీ ! అపార మహత్యపూర్ణమైనటువంటి ఈ అష్టదసాధ్యాయ మహత్యము పూర్తయింది.  ఈ అధ్యాయమును శ్రవణము చేసినంత మాత్రము చేతనే సమస్త సమస్తమైనటువంటి కష్టాలు నశించిపోతాయి.  పాపములన్ని తొలగిపోతాయి.  ఈ విధంగా నీపై ఉన్న ప్రేమతోటి పాప నాశనమైనటువంటి గీతా మహత్యాన్ని అంతా కూడా ఉపదేశించాను.  ఈ అధ్యాయాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రవణము చేస్తాడో, అతడు సర్వ యజ్ఞములను చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు.  

కలియుగంలో  మానవజన్మకు తరుణోపాయములు అనేకమైనవి ఉన్నాయి.  అందులో ఏ ఉపాయాన్ని అనుసరించినా కూడా, మానవుడు తరించగలుగుతాడు.  శ్రీకృష్ణ ముఖారవిందము నుండి వెలువ వెలువడిన ఈ గీత అనే  గంగోదకాన్ని పానము చేయనివాని జన్మ జన్మమే అనిపించుకోదు . మానవ జన్మకు పరమావధి ముక్తిని పొందడమే అటువంటి తరుణాన్ని పోగొట్టుకున్నట్లయితే తిరిగి ఈ మానవ జన్మ లభించడం చాలా కష్టమైన పని.  

కలియుగంలో జనులు అల్ప వయస్కులు.  వారిని ఉద్ధరించడానికి భగవంతుడు ఈ గీతని సృష్టించారు.  అందులో గీతలోని ఒక అధ్యాయాన్ని కానీ, ఒక శ్లోకాన్ని కానీ, శ్లోకార్ధ భాగాన్ని కానీ, శ్లోకములోని ఒక పాదమును కానీ, భక్తితో పఠించినట్లయితే మనిషి ఉత్తమ గతిని పొందగలుగుతాడని స్వయంగా చెప్పి ఉన్నారు భగవానుడు.  కాబట్టి ఈ గీతా మహత్యాన్ని ఎవరు వర్ణించగలడు? కలి ప్రజలు తరించడానికి  గీతా పారాయణాన్ని కలి బాధ నుంచి ప్రజలు తరించడానికి గీతా పారాయణాన్ని మించినటువంటి సాధనము మరొకటి ఏదీ లేదు. 
 

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం ప్రజా,
 అహం త్వా సర్వపాపేబ్యో మోక్ష ఇష్యామి మాశుగః 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi