సజ్జన సాంగత్యం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి.
సజ్జన సాంగత్యం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి.
- లక్ష్మీరమణ
భారతంలోని ఎన్నో కథలు మనకి నీతిసూత్రాలని చెబుతాయి. ధర్మరాజుకి వచ్చిన ధర్మ సందేహాలకు, ఇతరత్రా పాత్రలకి వచ్చిన అనుమానాలకీ సమాధానాన్ని ఒక చిన్న ఉదంతంగా పెద్దలు చెప్పిన కథలు ధర్మాచరణలో ఇప్పటికీ మనకి అనుసరణీయమైన మార్గాన్ని చూపిస్తున్నాయి . ఎన్నో సందేహాలకు సమాధానంగా నిలుస్తున్నాయి . ధర్మాన్ని అనుసరించినప్పటికీ, ఆ ధర్మ పాలనలో జరిగే పొరపాట్లు ఎటువంటి పరిస్థితులకి దారితీస్తాయనే విషయాన్ని మాంధాతకి దేవగురువైన బృహస్పతి వివరించారు. సజ్జన సాంగత్యం వలన సమస్యలన్నీ తొలగిపోతాయని ఈ కథ మనకి చెబుతుంది . ఆ చక్కని కథని ఇక్కడ చెప్పుకుందాం .
నృగమహారాజు జనరంజకమైన పాలకుడు. సహృదయుడు. ప్రజల్ని కన్నా బిడ్డల్లా పరిపాలించేవాడు. పైగా ఆయన ధర్మనిష్టాపరుడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. నిరంతరం గోదానం చేసేవాడు. ఒకసారి ఆయన వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒక విప్రుడికి దానం చేసిన గోవు తన ఆవుల కొష్టంలోనే ఇతర ఆవులతో కలిసి మేస్తోంది. పొరపాటున ఆయన అదే ఆవుని మళ్లీ ఇంకో బ్రాహ్మణుడికి దానమిచ్చాడు.
గోవు నాదంటే నాదని ఆ విప్రులు ఇద్దరు తగువు లాడుకున్నారు. పంచాయితీ రాజుగారి దేవిడీకి చేరింది . నృగమహారాజు వారి తగవుకి కారణం తనవల్ల జరిగిన పొరపాటేనని నిజాయతీగా ఒప్పుకున్నారు. చేసిన పనికి విచారపడ్డారు. జరిగిన తప్పుని దిద్దుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు.
ఇప్పుడు ఇద్దరికీ ఒకే ఆవుని ఇవ్వడం కుదరదు . కాబట్టి, మొదటగా తాను దానమిచ్చిన విప్రునితో “అయ్యా! దీన్ని ముందు మీకు ఇచ్చిన మాట నిజమే. ఇది మా ఆవులలో కలిసిమెస్తుంటే మాదే అనుకుని గోపాలకులు తీసుకొచ్చారు. తెలియక నేను దాన్ని మళ్ళీ ఈయనకు దానం ఇచ్చాను. పొరపాటుకు క్షమించండి. మీకు మంచి మేలయిన నూరువేళా గోవుల్ని ఈ గోవుకి బదులుగా ఇస్తాను . దయచేసి ఈ గోవుని ఆ బ్రాహ్మణునికి ఇయ్యండి.” అన్నాడు. అప్పుడు మొదటి బ్రాహ్మణుడు “మహారాజా! ఇది చాలా శ్రేష్టమైన ఆవు. నా కుమారుడు పాలకు ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు తీసుకొనిస్తుంది. అంత మంచి స్వభావం దీనిది. ఈ ఆవు నా ఇంట్లో లక్ష్మీలా ఉంటే, నాకు సంతోషం. దీనికి మారుగా కోటి గోవులు ఇచ్చినా నాకు అవసరం లేదు.” అని వెళ్ళిపోయాడు.
రాజుగారు విధిలేక రెండవ విప్రుని వద్దకి వెళ్లి “అయ్యా! మీరు కోరినన్ని రత్నాలు మణి మాణిక్యాలు , గోవులు ఇస్తాను. ఈ ఆవును ఆ విప్రునికి ఇచ్చేయండి.” అని బ్రతిమాలాడారు. “ఈ ఆవు ఒక్కటి తప్ప నాకు నీ రాజ్యమంతా ధారపోసినా అక్కర్లేదు” అంటూ మొండిగా ఆ ఆవును తీసుకొని వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు.
ఈ ఉదంతం తర్వాత, నృగమహారాజు కొన్నాళ్లకి కాలం చేశాడు. యమదూతలు వచ్చి యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్లారు. యమధర్మరాజు “ఓ మహారాజా!నువ్వు ఎన్నో పుణ్య కార్యాలు చేశావు. కానీ ఒకరికి ఇచ్చిన గోవునే, మరొకరికి దానం ఇచ్చి పొరపాటు చేశావు. విప్రుని మనసు కలత పెట్టావు. అందుచేత కొంచెం పాపం సంప్రాప్తించింది. ముందు పాపం అనుభవిస్తావా? పుణ్యం అనుభవిస్తావా? అని ప్రశ్నించారు. నృగుడు “ పాపమే అనుభవిస్తాను” అన్నాడు. వెంటనే తలకిందులుగా భూమ్మీద పడ్డాడు. అలా భూమిని చేరుతూ ఉండగానే “రాజా! విచారించకు. కొంతకాలమయ్యాక వాసుదేవునిగా ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు. అప్పుడు నీకు జననమరణ ఛత్రం నుండీ విముక్తి లభించి, శాశ్వత సౌఖ్యం కలుగుతుంది”అంటూ దీవించారు యమధర్మరాజు.
నృకుడు భూమి మీద తొండ రూపం పొంది తిరగసాగాడు. అలా చాలా రోజులు గడిచాయి. ఒకనాడు విధి వశాత్తూ ఆ తొండ ఒక నూతిలో చేరింది. ఆ నూతిలోకి వచ్చిన మరుక్షణంలోనే అతని శరీరం విపరీతంగా పెరిగిపోయింది. యమధర్మరాజు అనుగ్రహం వల్ల అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. తనను చూసుకుని తానే ఆశ్చర్యపడ్డాడు. నూతి దగ్గరికి వచ్చిన ప్రజలు ఆ తొండ ను చూసి, ఇది ఇందులో ఉంటే నీళ్లు పాడైపోతాయి. అనుకుని పెద్ద పెద్ద తాళ్లు తెచ్చి, దానికి కట్టి పైకి లాగబోయారు. కానీ అది కదిలితేగా!! వాళ్లకేమో భయము ఆశ్చర్యము కూడా కలిగాయి. గబగబా వెళ్లి సంగతంతా కృష్ణ భగవానుడితో చెప్పారు. ఆయన వెంటనే ఆ నూతి దగ్గరకు వెళ్లి, ఆ తొండ ను బయటకు తీశాడు. అప్పుడు నృగుడు దివ్య రూపాన్ని ధరించి, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు.
కృష్ణ స్పర్శ వల్ల నృగుడికి ఉత్తమ గతి కలిగినట్టే సజ్జన సాంగత్యం వల్ల సర్వసుఖాలు కలుగుతాయి అని మాందాత్రుడికి బృహస్పతి వివరించారు . అందుకే మన పెద్దలు సత్సంగం చేయమంటారు . మంచివారితో , విజ్ఞులతో కలిసి ఉండడం వలన మనకూ ఆ సౌగంధం ఎంతో కొంత అబ్బి, జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. శుభం .
#bharathamlokathalu
Tags: bharatam stories, bharatham, stories, mahabharatham,