Online Puja Services

భగవద్గీత పదహారవ అధ్యాయ పారాయణ మహత్యం

3.133.112.82

గజసమానమైన బలాన్ని, సాహసాన్ని, మోక్షాన్ని  ప్రసాదించే భగవద్గీత పదహారవ అధ్యాయ పారాయణ మహత్యం. 
- లక్ష్మీరమణ 

భగవద్గీతలోని పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ అధ్యాయంలో భగవానుడు అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును వివరించారు. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవించడానికి ఏ లక్షణములను అలవరచుకోవాలి, ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములని తెలుసుకోవడానికి ఈ అధ్యాయము ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి, అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయాలని ఈ అధ్యాయంలో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. ఈ అద్యాయానని నిత్యమూ పారాయణం చేయడం వలన గజసమానమైన బలాన్ని, సాహసాన్ని, అంతాన మోక్షాన్ని పొందుతారు అని పద్మ పురాణం తెలియజేస్తోంది.  

 పవిత్రమైన పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేయడం వలన లభించే ఫలితాన్ని ఈశ్వరుడు పరమేశ్వరికి ఈ విధంగా వివరిస్తున్నారు . “ ఓ ఈశ్వరీ ! పూర్వము సౌరాష్ట్రమనే నగరాన్ని ఖడ్గబాహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని వద్ద అమితమైన బలశాలయిన ఒక ఏనుగు ఉంది.  ఆ మత్త గజానికి వారు ‘అరిమర్ధనము’ అని పేరు పెట్టారు.  ఒకరోజు  ఆ ఏనుగు గొలుసులను తెంచుకొని ఉక్కు స్తంభాలను విరగగొడుతూ, బజారు పైన పడింది. వెంటనే దాన్ని బంధించడానికి రెండు ఆయుధాలను చేత పట్టుకుని ఆ గజమును వెంబడించాడు.  కానీ యెంత ప్రయత్నం చేసినా అతడు ఆ మత్తగజాన్ని అదుపు చేయలేక పోయాడు. ఆదిసృష్టిస్తున్న భీభత్సాన్ని తట్టుకోలేక, ఆటను భయం భయంగా దూరం నుంచి చూస్తూ నిలబడిపోయాడు. 

ఇంతలో రాజుగారికి ఆ సమాచారం తెలిసి, అక్కడికి వచ్చారు. గజాన్ని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అది కూడా వృధా ప్రయాసే అయ్యింది . ఆ ఏనుగు చేసే వీరంగాన్ని చూసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఆందోళన చెందసాగారు . ఇంతలో ఒక బ్రాహ్మణుడు స్నానం చేసి, ఆ మార్గంలో పోతున్నాడు.  పౌరులందరూ ఆయన్ని చూసి, “అయ్యా! మీరు అటు వెళ్ళకండి, అక్కడ రాజావారి ఏనుగు అదుపుతప్పి వీరంగం వేస్తోంది. మీకు ప్రమాదం ఏర్పడవచ్చు” అని చెప్పారు. కానీ వారి మాటల్ని ఆ బ్రాహ్మణుడు ఏ మాత్రం లెక్కచేయలేదు .  బ్రాహ్మణుడు  అదే దారిలో నేరుగా ఆ మత్తగజం దగ్గరికి వెళ్ళాడు . ధైర్యంగా ఆ ఏనుగుని సమీపించి దాన్ని తన చేతితో నిమురుతూ శాంతింపజేశారు. 
అది చూసి రాజుగారు , ఆయన సేవకులు, పౌరులు ఎంతగానో ఆశ్చర్యపోయారు.  రాజుగారు అప్పుడు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్లి భక్తితో ఆయనకు నమస్కరించి “ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఇంట సులభంగా ఈ మత్త గజాన్ని ఎలా లొంగదీసుకున్నారు ? ఇంత ప్రేమగా దీంతో ఎలా మాట్లాడగలిగారు ? ఇది నిజంగా ఒక అలౌకిక కార్యంగా అనిపిస్తుంది. దయచేసి వివరించండి” అని ప్రశ్నించారు.  అప్పుడు బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. “ఓ రాజా! నేను ప్రతి రోజు కూడా శ్రీమద్భగవద్గీత షోడశదశాధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాను. దానివల్లే  నాకు ఇంతటి సిద్ధి కలిగింది”. ఈ విధంగా బ్రాహ్మణుని మాటలు విన్నటువంటి రాజు వెంటనే ఆ గజాన్ని అక్కడే వదిలి ఆయన్ని తన భవనానికి తీసుకుపోయాడు. 

 ఒక సుముహూర్త సమయంలో అతడు లక్ష సువర్ణ నాణాలని ఆ బ్రాహ్మణునికి గురుదక్షిణగా ఇచ్చి,  భగవద్గీత లోని పదహారవ అధ్యాయాన్ని ఉపదేశింప జేసుకున్నారు.  ఆ రోజు నుంచీ రాజు భగవద్గీత పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేయసాగారు. మొదటి రోజున రాజు ఒక్క శ్లోకాన్ని మాత్రము చదివి తన ఏనుగుని చూడడానికి గజశాలకు వెళ్లారు. మావంటి వాని చేత దాని బంధములను తీయించి, నిర్భయంగా ఆ గజం దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ ఏనుగు ఎంత మాత్రం చెలించకుండా గొప్ప సాధు స్వభావాన్ని ప్రదర్శించింది. అది గమనించిన రాజు చాలా ఆశ్చర్యపోయారు.  అది తానూ ఆరోజు పారాయణం చేసిన  గీతా మహత్యమే అని తలపోశాడు.

 ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా, క్రమంగా ఆయనకి వార్ధక్యము సమీపించింది.  రాజ్య కాంక్ష తగ్గిపోయింది. తన జీవితాన్ని తృణముగా ఎంచి,  గీతా షోడశాధ్యాయమే తన పాలిటికల్ప వృక్షమని నిర్ణయించుకుని, రాజ్య భారాన్ని తన కుమారుడికి అప్పగించారు.  ఈ విధంగా ఖడ్గబాహుడు నిత్యము అమితమైన భక్తితో గీత లోని పదహారవ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ చివరికి పరమపదాన్ని పొందారు.

 కాబట్టి ఓ దేవీ ! గీతలోని 16వ అధ్యాయాన్ని ఎవరైతే చక్కటి భక్తితో, శ్రద్ధతో పారాయణ చేస్తారో, వారు గజ సమానమైన బలాన్ని, అమితమైన సాహసాన్ని, పొందడమే కాక యోగులకు కూడా దుర్లభమైన మోక్షాన్ని పొందగలుగుతారు. “ అని పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించారు. 

 సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!!

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi