పిల్లలకి చదువు బాగా రావాలంటే ఇలా ఈ ఒక్క నామం చాలు !
పిల్లలకి చదువు బాగా రావాలంటే ఇలా ఈ ఒక్క నామం చాలు !
- లక్ష్మీరమణ
పిల్లలకి చదువు సరిగ్గా రావడం లేదని బాధపడిపోయే తల్లిదండ్రులు ఈరోజుల్లో కోకొల్లలు. ఎందుకంటె మనం ఉన్నది ఒక పోటీ ప్రపంచంలో కదా ! అందుకే రేపటి పిల్ల భవిష్యత్తుకి ఆసరమైన విద్యపైన మనకి అంతటి జాగ్రత్త . ఒకవేళ ఇవాళ వాళ్ళు సరిగ్గా ఆ విద్యలో రాణించకపోతే, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఆందోళన. దీనికి సంతాన ధర్మం ఒక అద్భుతమైన దారి చూపించింది. ఒకే ఒక్క నామం రోజూ స్నానం చేసుకున్న తర్వాత పఠించేలా , పిల్లలకి అక్షరాభ్యాసం అయినా నాటి నుండీ అలవాటు చేస్తే చాలు . భగవంతుని అనుగ్రహంతో బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు కూడా పరివర్తనని పొందగలరని విశ్వాసం . మాత్రాలకే మహామంత్రంగా చెప్పబడిన ఆ నామాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం .
శ్లో|| ఈశాన స్సర్వవిద్యాన మీశ్వర సర్వ భూతానాం|
బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మశివోమే అస్తు సదాశివోం||
సర్వ విద్యలకు అధిపతి ఈశానుడు. సర్వ భూతాలకూ / ప్రాణులకూ అధిపతి ఈశ్వరుడు. బ్రహ్మము అంటే బ్రహ్మగారికి ప్రభువు , భ్రాహ్మణములకు అంటే వేదములకు అధిపథి అయిన, ఆ పరబ్రహ్మే శివుడు. అటువంటి సదాశివుడు నాకు శుభములను ఒసగుగాక! అని ఈ శ్లోకానికి అర్థం . ఇది వేదము చెప్పిన మాట !
అంటే, మనని సృష్టించినవాడు అయిన బ్రహ్మకి కూడా గురువైనవాడు ఆ ఈశ్వరుడు. కనుక ఆయనే ఆదిగురువు అని అర్థం చేసుకోవాలి . గురువు అనుగ్రహం లేకుండా ఏ విద్యా కూడా అబ్బదు. ఫలించదు. సదా శుభాలనిచ్చే ఆ పరమేశ్వరుని గురు స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి. అందువల్ల పిల్లలు ఎప్పుడైతే చిన్నగా మాట్లాడం నేర్చుకుంటూ ఉంటారో అప్పటినుండీ వారిచేత ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని చదివించడం ఉత్తమమైన ఫలితాన్నిస్తుంది ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు.
గురవే సర్వలోకానాం
భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం
శ్రీ దక్షిణా మూర్తయే నమ:
ఇంతేకాదు , సర్వ వేదములకీ అధిపతి అయిన ఆ దక్షిణామూర్తి మంత్రాన్ని కూడా వేదశాస్త్రం మనకి స్పష్టంగా చెబుతోంది. పైగా అది మంత్ర రాజమని పేర్కొంది. ఇంతటి గొప్ప మంత్రాన్ని గురువు ఉపదేశం లేకుండా కూడా పఠించవచ్చని , దాని ఫలితం అద్భుతంగా ఉంటుందని పేర్కొంది.
ఆ మహా మంత్రమే ‘శివాయ గురవే నమః’ ఇంతే ! ఇంకా దీనికి ఏవిధమైన అక్షరాలనీ జోడించవలసిన అవసరం లేదు. పలకడం ఎంతో సులభం. చిన్నారులు కూడా అతి సులభంగా నేర్చుకోగలిగిన ఈ మహామంత్రంలో పంచాక్షరి తో పాటు ‘గురవే’ అనే మూడక్షరాలు చేరడం వల్ల అష్టాక్షరిగా మారి, అనంతమైన ఫలాన్ని అనుగ్రహిస్తుంది . దీనివల్ల జ్ఞానం ప్రాప్తిస్తుంది అని చెప్పారు.
కాబట్టి ఈ రెండు, ఒకటి దక్షిణా మూర్తి శ్లోకం, తర్వాత ఈ అష్టాక్షరీ నామం పిల్లలకి రోజూ చెప్పుకోవడం , జపం చేయడం అలవాటుగా చేయండి. వాళ్ళు ఖచ్చితంగా విద్యల్లో ఉన్నత శ్రేణిని పొందడం మీరు గమనిస్తారు.