Online Puja Services

స్కందోత్పత్తి చదివినా విన్నా వారి పిల్లలు ఆపదల నుండీ రక్షింపబడతారు

3.147.85.175

స్కందోత్పత్తి చదివినా విన్నా వారి పిల్లలు ఆపదల నుండీ రక్షింపబడతారు. (29-11-22 సుబ్రహ్మణ్య షష్ఠి)
- లక్ష్మీరమణ 

పిల్లలు కలగాలంటే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం ఉండాలి.  వారిని రక్షించే దేవత షష్టీదేవి కుమారస్వామి దేవేరి అయిన దేవసేనాదేవి.  అందుకని పిల్లల క్షేమం కోసం సుబ్రహ్మణ్యారాధనకి మించింది లోకంలో మరొకటి లేదు. సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో జ్ఞానవికాసం కూడా కలుగుతుంది. ఆయన స్వయంగా శివునికి గురువైనవాడు. జ్ఞ్ఞాణమే రూపుగా దాల్చినవాడు. కాబట్టి, ఆయన అనుగ్రహం ఉంటె చదువు బాగా వస్తుంది. అలాగే దేవతలకి సైన్యాధిపతిగా ఉంది తారకాసురుణ్ణి సంహరించాడు. శక్తి అనేది ఆయన చేతిలో ఉండే ఆయుధం . కనుక పిల్లలకి బలము బాగా రావాలంటే సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేయాలి. విశేషించి సుబ్రహ్మణ్య షష్ఠి , నవమి, పంచమి తిథుల్లో , వారంలో మంగళవారం నాడు శ్రీ వల్లీ దేవసేనాసమేత సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వలన చక్కని ఫలితం ఉంటుంది. సుబ్రహ్మణ్యుని అవతారమే అటుఅంతి విశేషాలతో నిండినది. ఈ స్కందోత్పత్తి కథని  చదివినా విన్నా వారి పిల్లలు ఆపదల రక్షింపబడతారని స్కాందపురాణం చెబుతోంది. 

మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఇచ్చి వివాహం జరిపించారు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి - అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి  రాక్షసులకు తల్లి అయ్యింది.  అదితి దేవతలకి జన్మనిచ్చారు.  

ఒకనాడు దితి తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో బ్రహ్మగురించి తపస్సు చెయ్యి . నీకు కోరుకున్న కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. ఆయన ఉపదేశంతో దితి కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహము పొందింది. ఆ తర్వాత గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు. 

వజ్రాంగుడు దేవలోకము పైకి దండెత్తాడు. దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ తన కారాగారంలో బంధించేశాడు. బ్రహ్మగారు వజ్రాంగుడి తండ్రయిన కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వజ్రాంగుడు వారిద్దరినీ ఏంటో గౌరవించి పూజలు చేశాడు. అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. అప్పుడు  బ్రహ్మగారు  ‘నాయనా! నీవు నీ తల్లి కోరుకున్నట్టుగా దేవతలందరినీ గెలిచావు. సందేహం లేదు నీవు అంతటి పరాక్రమవంతుడవే ! కానీ సృష్టి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. 

వజ్రాంగుడు బ్రహ్మగారితో ‘మహానుభావా! అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమయిన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. జ్ఞాన జిజ్ఞాస ఎవరికి ఉంటుంది వాళ్ళని నుగ్రహించడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు . అందువల్ల ఆ బ్రహ్మగారు పొంగిపోయి ‘నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును అలవర్చుకొనే ప్రయత్నం చేయి. భగంతుని నిరంతరం ధ్యానం చెయ్యి, నీకు జ్ఞానం తప్పక సిద్ధిస్తుంది. నీకు ‘వరాంగి’ అనే ఆమెను భార్యగా సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని అనుగ్రహించారు. 

వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలో కోరుకో అన్నారు.’ అప్పుడామె ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది.

తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తల్లి కోరిక మేరకు తారకుడు బ్రహ్మ గారి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది.  

ఆ ఉపద్రవాన్ని గమనించిన బ్రహ్మగారు తారకుడి ఎదురుగా ప్రత్యక్షమయ్యారు . తారకుడికి ఏంకావాలో అది కోరుకోమన్నారు. శివుని వీరంలోనుండీ పుట్టిన కొడుకు చేతిలో తప్ప నాకు మరెవ్వరి చేతిలోనూ మరణం లేకుండా వరమియ్యి ‘ అన్నాడు. ఇప్పుడు చెమటలు బ్రహ్మగారికి పట్టాయి. పరమశివుడు కాముని హరించినవాడు. అంటే మన్మధుని జయించినవాడు.  ఆయనకి కోరిక అనేదే లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి, వీర్య స్ఖలనం అవ్వాలి. ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలోతారకుడు చావాలి. బ్రహ్మగారు పరమేశ్వరుని మీదే భారం వేసి, తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయారు .

తారకుడు ముల్లోకాలనూ అవలీలగా జయించి దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి , శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. కానీ రాక్షస రాజ్యంలో లోకాలన్నీ కూడా కకావికలుగా ఉన్నాయి శాంతి , సత్యం ,ధర్మం మచ్చుకైనా లేవు . ఇక వాడిని జయించడం స్థితికారకుడైన విష్ణుమూర్తి చేతిలోని సుదర్శనం వల్ల కూడా కాలేదు. 

ఇక దుస్సాధ్యమే అయినా శివునికి లేని మన్మధతాపం రగిలించడమే పరిష్కారం .  పరమాత్మని రంజిల్ల జేయగల శక్తి పరమ ప్రకృతి అయిన పరమేశ్వరి ఒక్కరే! ఆవిడ పార్వతీ దేవిగా వచ్చి నిలిచింది. కామమే లేని పరమేశ్వరునిలో మన్మథుడు కామప్రచోదనం చేయగలడా ? మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగానే శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. కానీ ఏ మన్మథుడు చేతిలో చెరకువిల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదలించ లేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. 

కానీ, ఈశ్వరుణ్ణి పొందాలంటే, పూలబాణాలు కాదు మనస్సు , భక్తి అవసరం . అందుకని ఆమె తపస్సు చేయడం మొదలుపెట్టింది . శంకరుడు అనేక పరీక్షలు పెట్టాక , అమ్మవారిని చేపట్టాడు. పార్వతీ కళ్యాణం అయింది. 

ఇక  కుమారసంభవం జరగాలి. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య వత్సరములు జరిగింది. కానీ, శివ  తేజస్సు స్ఖలనం కాలేదు . మరోవైపు  తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. కానీ దేవతలకి మరో భయం పట్టుకుంది. శివుడు అగ్ని స్వరూపుడు . ఆయన తేజస్సు మహాగ్నిగోళమే ! దానిని భరించగలగడం సాధ్యమేనా ఈ ప్రకృతికి ? జగత్తే కాలిపోతుంది. ఇదీ వారి భయం. ఇది అమ్మవారి ఆలోచనకాదు. ఇందులో స్కందుడు నేను నీకుమాత్రమే కుమారుడిగా ఉంటానని శివునితో చెప్పిన మాట దాగుందేమో . 

వాళ్ళందరూ వారి వారి అనుమానాలతో ఈశ్వరుని చూడవచ్చారు.  ఈశ్వరా! మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పడకుండు గాక! ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. 

ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేక పోయాడు. 

ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించరని దేవతలను శపించింది. తను వహించాల్సిన శివ తేజస్సుని తీసుకున్నందుకు భూమిని ‘నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అన్నది’. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయన వెంటే అమ్మవారు వెళ్ళిపోయింది. 

అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగలో విడిచిపెడితే గంగమ్మ ఆ అగ్నిని భరిస్తుందని దేవతలు భావించారు. ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగలో విడిచిపెట్టాడు. కానీ ఆవిడ కూడా ఆ తేజస్సును భరించలేకపోయింది.  అప్పుడావిడ హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టింది. అలా ఆ తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే బంగారం, వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. 

అక్కడ శరవణపు పొదలు,దగ్గరలో ఒక తటాకం ఉన్నది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకములో చేరింది . వెంటనే బంగారు రంగులో కాంతులీనుతూ , ఆరు ముఖాలతో ఉన్న పిల్లవాడు బయటికొచ్చాడు. కుమార సంభవం జరిగింది.

పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని కృత్తికా నక్షత్ర దేవతలైన ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి ఆ పిల్లవాడిని చూస్తూనే మాతృత్వాన్ని పొందారు. అలా ఆయన కార్తికేయుడయ్యారు. ఆరు ముఖములతో ఉద్భవించి ‘షణ్ముఖుడు’ అయ్యారు . గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.

ఆయన భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేసారు. ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనకే ‘గుహా’ అనే పేరు ఉంది. 

పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననవృత్తాంతం చదవడం ,  వినడం అదృష్టం ఉంటె తప్ప దొరికే భాగ్యం కాదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తుంటారో వారు ఆయుష్మంతులై ,పుత్రపౌత్రులను చూసి అంతాన స్కందలోకమును పొందుతారని స్కాందపురాణం చెబుతుంది. 

శ్రీ సుబ్రహ్మణ్యానుగ్రహ సిద్ధిరస్తు !

#subrahmanyashasti #skanda #shanmukha

Tags: subrahmanyeswara, subrahmanyashasti, subrahmanya, shasti, shasthi, skanda, shanmukha

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya