Online Puja Services

శ్రీ లలితా సహస్రనామం ఇలా చేయడం వలన గొప్ప ఫలితాలుంటాయి

18.221.175.164

శ్రీ లలితా సహస్రనామం ఇలా చేయడం వలన గొప్ప ఫలితాలుంటాయి .  
- లక్ష్మి రమణ 

ప్రతి రోజు లలితా సహస్ర నామాన్ని చదవడం మహా ఫలం. రోజూ చదువుకోవడం, శ్రద్ధగా చేసుకోవడం  వీలుకాని వారు శుక్రవారం అయినా చేసుకుంటే మంచిది .  అమ్మవారి సహస్రనామాలు ఇంతా అంతా అని చెప్పలేనంత మహిమాన్వితమైనవి . ఆ వేయినామాలలో ఒక్క నామం పట్టుకున్నా చాలు జన్మ తరించి పోవడానికి ! ఇక లౌకికమైన కామ్యాలు ఒక లెక్కా !! మరి అమ్మవారి అనుగ్రహం కోసం చేయాల్సిన పనులని పండితులు చెప్పిన విధంగా ఇక్కడ మీకోసం అందిస్తున్నాం .   

పెళ్లి కావాలనుకునేవారు : 

" కదంబ వన వాసిన్యై నమః  " అని అమ్మవారి నామము. 

 కదంబవనాలాలో అమ్మవారు కొలువై ఉంటారుట. కదంబ వనం అంటే అమ్మకి చాలా ఇష్టం. కాబట్టి  కదంబ వృక్షం కింద కుర్చుని 11 రోజులు గాని 21 రోజులు కాని లలితా సహస్ర నామాన్ని పారాయణం చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. మరియు అనుకున్న కార్యాలు తప్పక జరుగుతాయి. కదంబ పుష్పాలు అమ్మవారికి అర్పించినా గొప్ప మేలు జరుగుతుంది . 

ఎముకలకు సంబంధించిన సమస్యలు తీరడం  కోసం : 

" ఓం ఐం హ్రీం శ్రీం పంచవక్త్రాస్తి సంస్థితాయై నమః  "

ఆస్థి అంటే ఎముకలు. అటువంటి వాటిల్లో కూడా వ్యాపించి ఉన్నదిట అమ్మవారు. పైన చెప్పిన ప్రకారంగా  మంత్రాన్ని ఎముకలు విరిగిన వారు రోజు 108 సార్లు జపం చేసి, అమ్మవారికి  నానపెట్టిన పెసలు  నైవేద్యంగా  పెడితే ఎముకలకి సంబంధించిన సమస్యలు  చాలా త్వరగా సరవుతాయి. స్వయంగా చేసుకోలేకపోతే, బందువులు అయినా  ఈ మంత్ర జపం చేసి తీర్ధాన్ని ఇచ్చినా, ఎముకలు సరి అవుతాయి.

కుటుంబ శాంతి కోసం : 

పుణ్య ఘడియల్లో, పుణ్య తిదులలో లలితా సహస్ర నామ పారాయణ ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా లభిస్తుంది. అలాగే కుటుంభ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబ శాంతి ఫలిస్తుంది .

అమ్మ అనుగ్రహం కోసం : 

పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తూ, పూర్తి లలితా సహస్రాన్ని  చదవడం వల్ల సాక్షాత్ లలితాదేవి ఎదురుగా చదివన పలితం కలుగుతుంది. పళ్ళెంలో పాలు పోసి చంద్రబింబం చూస్తూ లలితా పారాయణం చేస్తే, చాలా మంచిది. అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది.

పౌర్ణమి నాడు, లలితా పారాయణం వలన అమ్మ దృష్టి మనపై ప్రసరిస్తుంది.

లలితాదేవికి కలువలు, మారేడు దళాలు, తులసి దళాలు, మల్లెపూలు ఇష్టం . వాటితో పూజిస్తే అమ్మ త్వరగా ప్రసన్నమవుతుంది. అలాగే నైవేద్యముగా పాయసము, పులగము, చిత్రాన్నము (పులిహోర )దానిమ్మ, బూడిద గుమ్మడికాయ ప్రీతి కరమైనవి. కాబట్టి లలితాదేవికి వీటిని  నైవేద్యముగా సమర్పిస్తే,  సకల శుభ ప్రదం. 

ఓం శ్రీ లలితాదేవ్యయై నమః.

-గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ గారి రచన ఆధారంగా 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore