Online Puja Services

అక్షయ తృతీయకు ఈ చందన బంగారం మీ సొంతమైందా !

18.118.93.123

అక్షయ తృతీయకు ఈ చందన బంగారం మీ సొంతమైందా ! అదృష్టం మీ వెంటే ! 
- లక్ష్మి రమణ 

వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనం చేసినట్టయితే  విష్ణు లోక సాయిజ్యం కలుగుతుందని స్రుతి వాక్యం. ఈ తిథిని మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం . ఇలా చందనాన్ని విష్ణువుకి అర్పించడం వలన లక్ష్మీ దేవి కటాక్షిస్తుంది . ఈ ఉత్సవాన్ని అచ్యుతుడైన నరసింహుని క్షేత్రంలో  చందన సమర్పణ మహోత్సవముగా నిర్వహించడం తెలుగు రాష్టాలలో ఆనవాయితీగా ఉంది .  ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పణాదులు అక్షయమై పుణ్యఫలములిస్తాయి. రండి ఎన్నో దివ్యమైన విశేషాలతో కూడిన  ఆ నారసింహుని క్షేత్రాన్ని దర్శించి, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం .  

హిరాణ్యాక్ష, హిరణ్యకశిపులు రాక్షసులు, అన్నదమ్ములు . ఈ ఇద్దరినీ సంహరించడానికి శ్రీహరి ఎత్తిన అవతారాలు కూడా రెండున్నాయి . ఏవ్ వరాహ , నారసింహ అవతారాలు. రాముడు , కృష్ణుడు సున్నితమైన సుకుమారమైన దివ్య సౌందర్యమూర్తులుగా దర్శనమిస్తారు . కానీ ఈ రెండు అవతారాలూ మాత్రం మహా రౌద్రంతో జ్వలిస్తున్న మూర్తులుగా స్వామి కనిపిస్తారు . ఈ రెండు అవతారాల కలయికగా సింహాచలంలో అప్పన్నగా శ్రీహరి కొలువైయున్నారు.

హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు.  ఆ చిన్నారి హరి భక్తిని ఎలాగైనా మాన్పించాలన్నది ఆ రాక్షస రాజు కోరిక . హరిభక్తి మానని కుమారుని సముద్రంలో పడవేయించి, పైకి లేవకుండా పర్వతాన్ని అతని పైకి వేయించాడు. కానీ శ్రీహరి వచ్చి తన భక్తుణ్ణి రక్షించుకున్నాడు. అలా ఆ తండ్రి కుమారుణ్ణి పడత్రోసిన సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆపైన వేసిన పర్వతమే సింహాచలము. ఆ విధంగా తన భక్తుని కోసం అవతరించి  హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం. 

ప్రహల్లాదుని కోరికమేరకు పిన తండ్రిని చంపిన వరహామూర్తి, తండ్రిని చంపిన నరసింహ అవతారం కలిసి అవతరించిన రూపమే సింహాద్రి అప్పన్న. హిరణ్యకశిపుని వధించాక, లక్ష్మీదేవితో కలిసి నేను ప్రహల్లాదునితో పూజలందుకుంటూ, సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటాను అన్నారు స్వామి.

స్వామి రూపం సింహాచలంలో వరాహ ముఖంతో, తెల్లని నరుని శరీరంతో ఉంటారు .  తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, నెలలో దాగివున్నపాదాలు, స్వామి వారి ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే లభిస్తుంది. అది కూడా కేవలం  కొన్ని గంటలు సేపు చందనం తీసినప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుంటారు. మళ్ళీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి, తిరిగి చందనం లేపనం చేస్తారు అర్చకస్వాములు. 

ఇప్పటికే వరాహ , నృసింహ రూపాలతో ఉన్న శ్రీహరి  చందన లేపనం తరువాత  శివలింగాకారంగా  దర్శనమివ్వడం మరో అద్భుతం . శివకేశవుల ఏకీకృత స్వరూపంగా ఇలా స్వామీ విభిన్నంగా దర్శనమివ్వడం జగతిలో ఈ క్షేత్రానికి మాత్రమే చెల్లింది . అలా  ప్రసాదంగా స్వామీ నుంచీ తీసిన గంధం, అంటే చందన ప్రసాదం ముఖాన పెట్టుకొని, కొంత నీటిలో కలిపి తీర్థంగా సేవిస్తే దీర్ఘరోగాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం . 

   నారసింహుడు ఎక్కడున్నా, ఏ అవతారంలో ఉన్నా ఖచ్చితంగా ఆరోగ్య ప్రదాతగా మాత్రం ఉంటారు . అక్షయ తృతీయనాడు స్వామి చందనం ప్రసాదంగా లభించిన వారు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని వరంగా పొందుతారని చెప్పుకోవచ్చు .  విశాఖ పట్నంలో ఉన్న ఈ ఆలయానికి తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలలోని అన్ని ప్రధాన నగరాల నుండీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి .  విశాఖపట్నానికి రైలు, విమాన ప్రయాణ సౌకర్యం కూడా ఉంది . 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore