
Aadhitya Hrudhaya Punyam
Sarva Sathru Vinaasanam
Jayaavaham Jabe nithyam
Akshayam Paramam Shivam
రథ సప్తమి
తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. "దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం " అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు. ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.