Namastestu Mahamaye
Shree pithe sura poojite
Shanka Chakra Gadha haste
Maha Lakshmi Namoostute
ఇంట్లో లక్ష్మి నిలవాలంటే చీపురుని ఇలా వాడాలి .
- లక్ష్మి రమణ
చీపురుని తేలిగ్గా తీసేయకండి . చీపురుని వాడడం , సరైన పద్ధతిలో వాడడం అవసరమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు . వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఊడ్చే చీపురుని కూడా ఎలా పడితే పడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ధనానికి మూలమైన లక్ష్మీదేవికి కోపం వస్తుందట. చీపురు విషయంలో పాటించాల్సిన అటువంటి కొన్ని నియమాలని గురించి ఇక్కడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
చీపురిని సరిగ్గా ఉంచకపోతే, కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేలని శుభ్రం చేయడానికి వినియోగించే చీపురు సాక్షాత్ లక్ష్మీదేవి ప్రతీక. అందువల్ల మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు అనేదే నిల్వ ఉండదు.
చీపురు కింద వేసి కాళ్ళతో తొక్కడం వంటివి చేయకూడదు . అది లక్ష్మి దేవికి ఆగ్రహం కలిగిస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ వంట గదిలో చీపురును ఉంచకూడదు. కిచెన్లో చీపురును ఉంచితే ఇంట్లోనివారికి ఆహారం దొరకడం కష్టంగా మారుతుంది. వాస్తు పరంగానూ సైన్స్ పరంగా కూడా ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు.
ఇక వాస్తు ప్రకారం చీపురును ధనం, ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు.
అలాగే చీపురును ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకూడదు. చీపురుని వాడిన తర్వాత దానిని అడ్డంగా పెట్టి, ఏదైనా తలుపు వెనకాల ఉంచాలి.
సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిని ఊడవకూడదు.
చీపురును ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడకూడదు.
అలాగే పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే పడేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి పవిత్రమైన రోజుల్లో చీపురును పడవేయకూడదు.
ఇంట్లో శిశువులు జన్మించినప్పుడు, వారి పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఇంట్లో అప్పటివరకు ఉపయోగించిన చీపురును విడిచిపెట్టాలి .
అలాగే చీపురును కొనేప్పుడు, మంగళవారం, శనివారం, అమావాస్యల రోజుల్లో కొనుగోలు చేయడం మంచిది . ముఖ్యంగా కృష్ణ పక్షంలో కొనడం మంచిది.
పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు
ఈ జాగ్రత్తలు పాటించడం వలన లక్ష్మీ దేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని వాస్తు నిపుణుల సూచన . శుభం .