Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
నాయనార్ల గాథలు - అనయారు నాయనారు
లక్ష్మీ రమణ
వెదురు కొమ్మని కొట్టి , కాల్చి , దానికి రంధ్రాలు చేసి , అవసరమైన విధంగా చెక్కితే కానీ మధుర స్వరాలు పలికించే వేణువు తయారు కాదు. బహుశా ఇన్ని బాధలూ పడింది కాబట్టే , ఆ మాధవుని పెదవులని ముద్దాడే అదృష్టాన్ని పొందింది కాబోలు. ఒకసారి గోపికలంతా కలిసి కృష్ణపరమాత్మ తో వేణువు పై తమకున్న అక్కసును వెలిగక్కారట. “ స్వామీ ! మేము నిన్నే నిరంతమూ చూస్తూ, నీ ప్రేమ తాదాత్మ్యతని అనుభవించాలని తపిస్తూ ఉంటాము. కానీ నీవు మాత్రమూ మా కన్నా ఆ వేణువునే నిత్యమూ నీ దగ్గర ఉంచుకుంటూ ఉంటావు. దాన్ని చూస్తుంటే, మాకు బహు అసూయగా ఉంటుంది తెలుసా !” అని. అప్పుడు మాధవుడు “ ఆ అదృష్టం ఆ వెదురు వేణువయ్యేందుకు పడిన బాధలు, చేసిన త్యాగాలు కారణం అని చెప్పారట”. వేణువు అంతటి ధన్యమైన వాయిద్యము. హరి హరులిద్దరికీ ప్రీతికరమైన వాయిద్యము. అటువంటి వేణుగానంతో పరమేశ్వరుణ్ణి మెప్పించి, ఆయన దర్శనాన్ని పొందిన ధన్య జీవి అనయారు నాయనారు.
పశువుల కాపరులకి ప్రకృతిని మైమరపింపజేసే నాదమేదో పరిచయం అవుతుందనుకుంటా ! ఆ నాడు గోవుల్ని కాసిన నందనందనుడు తన మురళీ గానంతో ప్రకృతిని పరవశింపజేశాడు. ఆయన గానానికి మురిసిపోయిన పశువులు మోరలెత్తి ఆ గోపాలుని చుట్టూ గుముగూడేవట. నెమళ్ళు పరవశించి నాట్యమాడేవట. భ్రమరాలు మకరందం కోసం పూవులను ఆశించడం మాని, గోపాలుని మోము చుట్టూ పరిబ్రమించేవట. ఆ మధురానందుని ఆనందలీలని శివభక్తుడై చూపాలని ఆ స్వామి తలపోశారేమో అనిపిస్తుంది అనయ నాయనారు కథ చదివితే.
తమిళనాడులోని సుప్రసిద్ధ శివాలయాలలో తిరుచ్చి జిల్లాలో ఉన్న తిరుమంగళం లోని సామవేదేశ్వరుని ఆలయం ఒకటి. నాలుగు వేదాలలోని సామవేద సారమే ఈశ్వరుడై , సామవేదేశ్వరునిగా, అమ్మవారు లోకనాయకిగా పూజలందుకుంటున్న దివ్యస్థలి. ఈ సామవేదేశ్వరుడు పరశురామునికి ఇష్టదైవము. ఆయనకి పరశువుని ప్రసాదించినవాడూ , మాతృహత్యాపాతకం నుండీ రక్షించిన దయాళువు ఈ పరమేశ్వరుడు.
ఆ విధంగా పరశురాముడు తపస్సు చేసిన నేలమీద, చోళ రాజులు పరిపాలించిన కాలంలో జన్మించిన వాడు అనయారు నాయనారు. ఆయన పశువుల కాపరి. శివ భక్తుడు. నిత్యమూ విభూదిని ధారణ చేయడం, ఆ విధంగా విభూదిని ధరించిన వారిని సాక్షాత్తూ శివునిగా భావించి గౌరవించి, తోచిన విధంగా సత్కరించడం చేసేవారు అనయారు.
అనాయారు నాయనారు చాలా గొప్పగా మురళి పైన రాగాలు పలికించేవారు. ఆయనకి ఆ విద్య ఆ మురళీశ్వర దత్తము గానే లభించిందేమో మరి ! లేదా అక్కడి ఈశ్వరుడు సామవేదేశ్వరుడు కాబట్టి, ఆ మట్టిలో భక్తి బీజమై పుట్టినందుకు ఆ విద్య ఆయనకు దైవదత్తంగా అబ్బి ఉండవచ్చు. ఏదేమైనా ఆయన వేణుగానాన్ని వినిపిస్తుంటే, ప్రక్రుతి మొత్తం తన్మయమై ఆ గానాన్ని ఆలకించేది. పశుపక్ష్యాలు కూడా ఆ గానానికి పరవశమై ఆయన చుట్టూ చేరేవి. విరిసినపూలు, పరచుకున్న పచ్చిక బయలు కూడా తలలూపుతూ ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదించేవి. అంతటి ఆల్కెమీ ఏదో ఆయన మోవిని తాకిన మురళి నుండీ ప్రకృతిమొత్తం పరుచుకొనేది. ఆ మురళీ రవానికి, అందులో దాగిన పంచాక్షరీ మంత్రయుతమైన భక్తిగానానికి మైమరచిపోయేది .
పంచాక్షరీ సాక్షాత్ పరమేశ్వరుడిగా ! ఆ విధంగా పరమాత్మ గానంతో ప్రకృతిని పరవశిపజేశారు అనాయారు నాయనారు. ప్రకృతి, పురుషుల ఏకత్వాన్ని తన నాదంతో సాధించారు. ఈశ్వరుడు అమితానందపరవశాన్ని పొంది , ఆయన భక్తికి, భక్తిలయించిన పంచాక్షరీ నాదానికి వశుడై సాక్షాత్కరించాడు. తనవెంట అనయారు నయనారుని కైలాసానికి తీసుకు వెళ్లారు.
సామగానలోలుడు కదా ఈశ్వరుడు. అందులోనూ సామవేదేశ్వరుడు కావడం చేత గానానికి వశుడయ్యాడు అనుకుంటారేమో ! సంగీతానికి, గానానికి , సాహిత్యానికి, ఛందస్సుకు ఉన్న శక్తి అది. ప్రతి అక్షరమూ కూడా ఒక దేవతా స్వరూపమని మన సనాతన ధర్మం చెబుతోంది. కనుక మనధర్మాన్ని రక్షించుకుంటూ, మన భాషని , సంస్కృతిని కాపాడుకుంటూ ఆ దైవాన్ని సర్వస్య శరణాగతి చేస్తే తప్పక ఆ ఈశ్వర కృప మనకి సిద్ధిస్తుంది . అనయారు నాయనారుకి అనాయాస కైవల్యాన్ని ప్రసాదించిన ఆ సామవేదేశ్వరుడు, లోకనాయకీ మాతల దివ్య కరుణా కటాక్షాలు హితోక్తి శ్రోతలకు మెండై సిద్ధించాలని ఆ స్వామిని మనసా వేడుకుంటూ ..
సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్య చరణారవిందార్పణమస్తు .
శుభం .
Nayanar, Stories, Anaiyar, Anayar,