Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
నాయనార్ల గాథలు- తిరు నీలకంఠ నాయనారు
-లక్ష్మీ రమణ
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వార్గాలని జయించడం అంత సులువైన పనేమీ కాదు కదా ! ఆ పరమాత్మునికి సర్వస్య శరణాగతి చేయడం మాత్రమే వీటి బారి నుండీ మనల్ని కాపాడే తారకం. ఎంతటి భక్తుడైనా , ఒక్క బలహీన క్షణంలో వీటికి లొంగిపోతాడని తిరునీలకంఠ నాయనార్ కథ చెబుతుంది. అదే సమయంలో భగవంతుని మీద అచంచలమైన ప్రేమ, విశ్వాసం, నమ్మకం,వీటన్నిటితో పాటు పస్చాత్తాపం ఒక భక్తునికి ఎటువంటి సద్గతిని ప్రసాదిస్తుందో చూపిస్తుంది . ఇది మనం తరించడానికి పట్టుకోవాల్సిన విషయం . భక్తిరసరమ్యమైన ఆ భక్తుని దివ్యమైన వృత్తాంతాన్ని చదువుతూ, ఆ ఈశ్వరుని మనో యవనికపై మనమూ దర్శిద్దాం రండి .
చిదంబరం ఆ పరమేశ్వరుని విశ్వవ్యాపకత్వాన్ని పరిచయంచేసే క్షేత్రం . చూడగలిగే కనులుంటే, ఆ మహా శివుని విశ్వతాండవాన్ని ఆ క్షేత్రంలో చూడవచ్చు . అటువంటి చిదంబరంలో సదా ‘నీలకంఠా! నీలకంఠా !’ అని స్మరిస్తూ తన వృత్తిని అత్యంత అంకితభావంతో చేసుకునే కుమ్మరి ఉండేవాడు . ఆయన యోగులకి, సదాచార సంపన్నులైన బ్రాహ్మణులకి, శివభక్తులకు ఉచితంగా మృణ్మయ పాత్రలని ( మట్టి పాత్రలని) ఇస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ నీలకంఠా! నీలకంఠా! అని స్మరిస్తూ ఉండడం చేత ఆయన్ని నీలకంఠారు అని పిలిచేవారు స్థానికులు .
సదా నీలకంఠుని చరితని, ఆయన నామాన్నే స్మరిస్తూ ఉండే నీలకంఠారు కూడా మాయకి లొంగిపోవడం ఆ కాలుని లీలా విలాసమే కాబోలు ! ఒక రోజు అలా ఒక వేశ్యని చూసి మోహవశుడైయ్యాడు. ఆమె ఇంటికి వెళ్ళి తన వాంఛలు తీర్చుకొని ఇల్లు చేరాడు. నీలకంఠారు ఇల్లాలు కూడా శివ భక్తిలో ఆయనకేమీ తీసిపోదు . పైగా తన ధర్మాన్ని నిష్టగా అనుసరించే ధర్మాత్మురాలు. ఇంటికి చేరిన భర్త చేసివచ్చిన ఘనకార్యం ఆమెకు ముందుగానే ఎలాగో తెలిసిపోయింది. అయినా అతన్ని ఏమీ అనలేదు. చక్కగా అన్నం పెట్టింది. చేయవలసిన సేవలన్నీ చేసింది . కానీ, తనని తాకనివ్వలేదు. ముట్టుకోనివ్వలేదు. పైగా ఒక గొప్ప మాటన్నది ! “ఆ నీలకంఠుని మీద ఆన ! మీరు మమ్ములని తాకకూడదు” అన్నది . అంతే !
ఆవిడ ఎప్పుడైతే, నీలకంఠుని మీద ఆన పెట్టి ‘మమ్ముల్ని’ తాకరాదు అన్నదో అప్పుడు నీలకంఠారు ఒక నిర్ణయం చేసుకున్నాడు . తానిక జన్మలో భార్యతో సహా ఏ స్త్రీ ని తాకకూడదని ఒట్టు పెట్టుకున్నాడు. ఎందుకంటే, అది తన నీలకంఠుని మీద తన భార్య పెట్టిన ఆన ! తన దేవుని మీద పెట్టిన ఆన ! ప్రాణంపోయినా , తన దేవుని మీద పెట్టిన ఆన మాత్రం తప్పకూడదు . అంతే ! అదీ ఆయన నిర్ణయం .
ఇలా సంవత్సరాల కాలం గడిచిపోయింది. నీలకంఠారు , ఆయన భార్య వృద్దులయ్యారు. అయినా వారి ఒట్టు పట్టు వీడలేదు. బయటి ప్రపంచానికి ఈ ఒట్టు గుట్టు తెలియలేదు. ఆ పట్టు గట్టిదనాన్ని పరీక్షించాలనుకున్నాడు పరమేశ్వరుడు. శివయోగిగా వేషం ధరించి నీలకంఠారు దగ్గరికి వచ్చాడు.
భార్యాభర్తలిద్దరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శివయోగిని సేవించి సపర్యలు చేశారు . తన భిక్షాపాత్రని ఆ యోగి నీలకంఠారుకి ఇచ్చి జాగ్రత్తగా దాచమని, అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన ఆ పాత్రని తాను కొంతకాలం తర్వాత వచ్చి తీసుకుంటానని చెప్పాడు. సరేనన్న నీలకంఠారు దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాడు.
శివయ్య తన లీలా వినోదాన్ని ఆరంభించాడు . ఆ భిక్షాపాత్రని రహస్యంగా మాయం చేశాడు . కొంతకాలం తర్వాత తన పాత్రని తిరిగి ఇవ్వమంటూ నీలకంఠారు దగ్గరికి వెళ్ళాడు. ఆ పాత్ర యెంత వెతికినా దొరకదాయే!
ఈశ్వర చోరకళా విన్యాస లీల పాపం ఆ భక్తుని అంచనాలకి అందనిదే కదా ! నీలకంఠారు ఎంతో బాధపడిపోయాడు. పడే పడే యోగికి క్షమాపణలు చెప్పాడు . సాస్టాంగం ఆచరించాడు. అతని భార్యకూడా ఎన్నో విధాలా యోగికి నచ్చజెప్ప చూశారు . కొత్త పాత్రలు చేసిస్తానని చేపి చూశారు . అయినా ఆ యోగి ఒప్పుకోలేదు . ఆయన క్రోధం తగ్గలేదు. ఆ పాత్ర తిరిగి ఇవ్వాల్సిందే అన్న పట్టు వీడలేదు. పాత్ర దొరకలేదు .
మధ్యే మార్గంగా , భర్యాభర్తా ఒకరి చేయి ఒకరు పట్టుకొని, నీటమునిగి, ఆ నీలకంఠునిమీద ప్రమాణం చేసి పాత్రని తాము తీసుకోలేదని చెప్పమంటాడు శివయోగి. కానీ, అదెలా కుదురుతుంది? నీలకంఠుని మీద పెట్టిన ఆన ప్రకారం తన భార్య చేతిని నీలకంఠారు తాకలేడు. పోనీ అలా తాము చెయ్యలేమని శివయోగికి చెప్పుకుందామంటే, అయితే నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకోమంటాడు. చేయని తప్పు తానెలా ఒప్పుకునేది ? ఒకవేళ ఒప్పుకుంటే, అది కూడా శివద్రోహము , ధర్మ ద్రోహమూ అవుతుంది కదా ! ఇదీ నీలకంఠారు సమస్య.
చివరికి ఈ తగవు రాజుగారి సముఖానికి చేరింది . రాజుగారు కూడా ఆ యోగి కోరినట్టు భార్యాభర్తలిద్దరూ చేయి చేయి పట్టుకొని నీట మునిగి వచ్చి, ప్రమాణం చేయండి అని ఆదేశించారు . ఇక గుట్టువిప్పక తప్పదని , నీలకంఠారు తమ ఒట్టు సంగతిని అందరి ముందా చెప్పి ఒక కర్ర పుల్లని చెరోవైపు పట్టుకొని నీటమునిగారు .
ఆశ్చర్యకరంగా ఆ వృద్ధదంపతులు నీటిలో నుండీ బయటికి వచ్చే సరికి నవయౌవనంతో కళకళలాడుతూ , సర్వాలంకృతులై శోభాయమానంగా ఉన్నారు. శివయోగి, పార్వతీ సమేతుడై నీలకంఠునిగా దర్శనమిచ్చాడు . అప్పుడు “ ఓ భక్తా ! నీ అనన్యమైన భక్తి తత్పరత, అసమానమైన మీ దంపతుల నిష్ఠ నాకు అమితమైన ఆనందాన్ని చేకూర్చాయి . మిమ్మల్ని పరీక్షించేందుకు శివయోగిగా నీముందుకు వచ్చాను . ఇకపై మీరు శాశ్వతంగా నిత్య యవ్వనులై నా లోకములో నివశించండి” అని శాశ్వత శివలోకాన్ని అనుగ్రహించారు . అందరూ చూస్తుండగానే, నీలకంఠ నాయనారు తన ధర్మపత్నితో కూడా కలిసి దివ్యమైన రథాన్ని అధిరోహించి శివలోకాన్ని చేరుకున్నారు .
ఆ విధంగా శివుని మీదున్న అచంచలమైన భక్తి అరిషడ్వార్గాలని జయించే శక్తిని, సంయమనాన్ని, నిగ్రహాన్ని ప్రసాదించింది . తిరునీలకంఠ నాయనారు దంపతులకి శాశ్వత కైలాసాన్ని అనుగ్రహించింది. కాబట్టి శివానుగ్రహాన్ని పొందడానికి కావలసినవి , మంత్రాలో, తంత్రాలో మరొకటో కాదు . ఆ దేవదేవునిపై అచంచలమైన భక్తి , విశ్వాసం అంతే !!
సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు !!
Thiru Neelakanta nayanar, Neelakantha, Nayanar Stories,