Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
నాయనార్ల గాధలు | Stories of Nayanars
భక్తి మాత్రమే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం . భక్తి, భావన చేత పరిమళిస్తుంది. కొందరు పరమాత్మని తమ ప్రియుడని భావించి మధురభక్తి భావంతో ఆయన్ని చేరుకున్నారు . మరికొందరు తమ మిత్రుడని పరమాత్మని భావన చేశారు . కొందరు తన పుత్రుడని భావిస్తే, కొందరు ఆయన్ని నిర్గుణ పరమాత్మునిగానే ఆరాధించి, ఆయన సన్నిధికి చేరుకున్నారు . నిర్గుణముకన్నా సగుణముగా నన్ను ఆరాధించినవారికి త్వరగా వశపడటాని పరమాత్మే స్వయంగా భగవద్గీతలో చెప్పారుకదా ! నారద భక్తి సూత్రాలు కూడా భక్తి, మనము పరమాత్మని చేసే భావముతో, తదనుగుణమైన తాదాత్మముతో త్వరిత ఫలాలని అనుగ్రహిస్తుంది తెలియజేస్తోంది . ఆవిధంగా పరమాత్ముని చేరిన శివ భక్తులు నాయనార్లు .
నాయనార్లందరూ కూడా ఆ పరమేశ్వర దర్శనాన్ని స్వయంగా పొందినవారే !అందుకే తమిళనాట విష్ణుభక్తి పరాయణులైన ఆళ్వారులు ఏవిధంగా నైతే అన్ని వైష్ణవ దేవాలయాల్లో కొలువై ఉంటారో, అదే విధంగా శివాలయాల్లో నాయనార్లు కొలువై ఉంటారు. నాయనార్లు రచించిన భక్తి సాహిత్యం ఈశ్వరుని సర్వవ్యాపకత్వాన్ని, సర్వేశ్వరుడైన ఈశ్వర తత్వాన్ని తెలియజేస్తుంది . ఇవి మనకి పెరియపురాణం అనే పుస్తకంగా లభిస్తుంన్నాయి . వీటిని శేక్కినార్ అనే రచయత అద్భుతంగా రచించారు.
ఈ నాయనార్ల గాధలు తనని ఎంతగానో ప్రభావితం చేశాయని స్వయంగా శ్రీ రమణమహర్షి చెప్పడం విశేషం . నాయనార్లలో సుప్రసిద్ధుడైన, తెలుగువారికి సుపరిచుతుడైన భక్త కన్నప్ప కూడా ఒకరు . అదే విధంగా జ్ఞాన సంబందార్ , అప్పర్, సుందరర్ తదితర 63 మంది నాయనార్లు ఉంటారు. వీరిలో సుందరర్ నాయనారే ఈ 63 మంది గురించి తమిళంలో పాడి ప్రచారం చేశారు. శైవభక్తి తత్వంతో రసరమ్యమైన వీరి జీవన విధానం ఆనాడు ఎందరో భక్తుల జీవితాలని ప్రభావితం చేసింది . నాటి నుండీ నేటిదాకా ఆ గాధలు వారిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి . ఆలయాల రాష్ట్రమని పేరొందిన తమిళనాట అత్యంత పురాతన శివాలయాలలో వీరి విగ్రహాలు , ప్రస్తావన ఖచ్చితంగా ఉంటాయి.
అటువంటి ప్రభావితమైన, అద్భుత భక్తి రసాన్వితమైన నాయనార్ల కథలని ప్రత్యేకంగా ఈ పవిత్ర కార్తీకమాసంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది హితోక్తి. కామ్.
కార్తీక పురాణాన్ని వీడియోలుగా , అక్షరరూపంలో రోజూ పారాయణకి అనువుగానూ హితోక్తి ఇప్పటికే మీ ముందుకు తీసుకొచ్చింది. భక్తి రసా స్వాదనాలో తన్మయులయ్యే భగవద్భక్తుల కోసం, వారి సౌకర్యంకోసం చేస్తున్న మరో బృహద్ ప్రయత్నమే నాయనార్ల చరితలని సరళమైన తెలుగులో అందించే చిరు ప్రయత్నం . ఇది ఆ దక్షిణామూరి యొక్క సంకల్పంగా , వారియొక్క అపారమైన కృపగా భావిస్తూ , గురుపాదాలకి సవినయ సమర్పణగా మీ ముందుకు తీసుకువస్తున్నాం . మా ఈ ప్రయత్నం మిమ్మల్ని రంజింపజేస్తుందని ఆశిస్తున్నాం .
హితోక్తి .