Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
నందీశ్వరుని కొమ్ముల మధ్యనుండే ఈశ్వర దర్శనం ఎందుకు ? ఆ సమయంలో చేయవలసిన ప్రార్ధన ఏమిటి ?
- లక్ష్మి రమణ
పరమేశ్వరుని ఆలయాల్లో నందీశ్వరుడు ఖచ్చితంగా ఉంటారు . నందీశ్వరుని అనుమతి లేకుండా పరమేశ్వరుని దర్శించడం ఫలితాన్నివ్వదని పెద్దలు చెబుతూంటారు . నంది కొమ్ముల మధ్య నుండీ శివలింగ దర్శనం చేసుకోవడం పద్ధతిని చెబుతారు . ఏమిటి ఇందులోని పరమార్థం? అలా దర్శం చేసుకొనేప్పుడు నందీశ్వరునికి ఒక చిన్న ప్రార్థన కూడా చెప్పుకోవాలి . కనుక వాటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం .
నందీశ్వరునికి కొమ్ముల మీద ఎడమ చేతిని ఉంచి, ఆయన వెనక భాగంలో కుడి చేతితో స్పృశిస్తూ ఈశ్వర దర్శనం చేసుకోవాలి . ఇలా దర్శనం చేసుకొనేప్పుడు భక్తుడు తన శిరస్సుని వంచుతాడు. ఆ విధంగా పరమేశ్వరునికి సర్వస్య శరణాగతి చేస్తూ, అహాన్ని , ఇహాన్ని వదిలి ఈశ్వరుని కోరడం ఒక భావన .
నంది కొమ్ముల మధ్యలో నుండి శివుని దర్శనం చేసుకోవాలి ఆనందంలో పరమార్థం ఏమిటంటే, శివుడు పశుపతి. పశువులు అంటే జీవులు అని అర్థం. జీవులన్నిటికీ ప్రభువు కాబట్టి ఆయనకి పశుపతి అని, ఈశ్వరుడు పేరు. సాధకుడు ఎప్పుడూ కూడా పశుత్వాన్ని అధిగమించి, పరమాత్మని చూడాలి. దానికి సంకేతం గానే ఈ విధంగా ఈశ్వరుని దర్శనం చేసుకునేటప్పుడు నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుని చూడమని చెబుతారు.
మరొక అర్థం కూడా ఇందులో ఇమిడి ఉంది. నంది ధర్మానికి ప్రతీక. ధర్మ స్వరూపుడు నందీశ్వరుడు. ఆ సనాతన ధర్మ స్వరూపుడైనటువంటి నందీశ్వరుని గౌరవిస్తూ, ధర్మము ద్వారానే పరమాత్మని దర్శించాలి, దర్శించగలము అనే సంకేతం కూడా ఈ దర్శనంలో ఉంది.
ఈ విధంగా నంది కొమ్ముల మధ్య నుండీ మహేశ్వరుని దర్శనం చేసుకొనేప్పుడు పఠించాల్సిన శ్లోకం ఇదీ :
నందీశ్వర నమస్తుభ్యం
శాంతానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్ధం
అనుజ్ఞామ్ దాతు మర్హసి
ఈ శ్లోకాన్ని పఠిస్తూ హరహర శివ, అంటూ శివ నామాన్ని పలుకుతూ నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి.
ఇలా చేసినట్లయితే వేద పఠనం చేసినటువంటి ఫలితము, సప్తకోటి మహామంత్ర జప ఫలితము లభిస్తాయని, పాప పరిహారం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శుభం భూయాత్
Nandi, Nandeeswara, Shiva, Siva,
#shiva #nandi