Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
దేవతలు ఎటువంటి లింగాలని అర్చిస్తారు ?
- లక్ష్మి రమణ
పరమేశ్వరుని అర్చించడానికి ఎటువంటి లింగము శ్రేష్టమైనది ? అని అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు . ఇసుకని లింగస్వరూపంగా చేసి పరమేశ్వరుణ్ణి అర్చించుకోవచ్చు . మృత్తికతో (మట్టితో) లింగాన్ని చేసి పూజించుకోవచ్చు . ఓపికున్న వారు లోహంతో లింగాన్ని చేసుకొని ఆ లింగాన్ని పూజించుకోవచ్చు. ఐశ్వర్యవంతులు బంగారు లింగాన్ని పూజించుకోవచ్చు . బాణలింగాన్ని , స్పటిక లింగాన్ని అర్చించుకోవచ్చు . ఇలా లింగముని ఏ రూపములో నిర్మించుకుని అర్చించినా పరమేశ్వరుని అనుగ్రహము ఖచ్చితంగా సిద్ధిస్తుంది . మనకున్న వీలుని బట్టి ఈవిధంగా పరమేశ్వర ఆరాధన చేసుకోవచ్చు . అయితే, మరి దేవతలు ఎటువంటి లింగాన్ని అర్చిస్తారు ?
ఈ జగత్తు దేనియందు లీనమై ఉన్నదో దానిని లింగము అన్నారు . జగత్తు పరమేశ్వరుని యందు లీనమై ఉన్నది . అంటే, ఆ లింగమే ఒకేఒక్క ఆ పరమాత్మ చిహ్నము. పరమాత్మ , పదార్ధము తానె అయ్యున్న పరమాత్మని ఏ పదార్థంతో నిర్మించినా, ఆ పదార్థము తానే అయున్నాడు కదా ! అందువల్ల మనం ముందే చెప్పుకున్నట్టు రకరకాల లింగస్వరూపాలని మనం ఆరాధించుకోవచ్చు . అవన్నీ కూడా అనుగ్రహప్రదాయకాలే ! రాముడూ, అమ్మవారూ స్వయంగా సైకత లింగాలని ప్రతిష్ఠించారు. పూజించారు . ఇప్పటికీ ఆ ఆలయాలని మనం దర్శించుకుంటున్నాం .
అయితే, స్కాందపురాణంలో ఈ దేవతలు ఎటువంటి లింగాలని అర్చిస్తారనే విషయాన్ని వివరించారు . ఆ ప్రకారంగా , బ్రహ్మదేవుడు ఎప్పుడూ మణిమయమైన శివలింగాన్నే పూజిస్తాడు. ఇంద్రుడు రత్నాలతో చేసిన లింగాన్ని, చంద్రుడు ముత్యాలతో చేసిన లింగాన్ని, సూర్యుడు రాగితో చేసిన లింగాన్ని, నిత్యము పూజిస్తారు. అలాగే కుబేరుడు బంగారంతో చేసిన లింగాన్ని, వరుణుడు ఎర్రటి రాతితో చేసిన లింగాన్ని, యముడు నీలం రంగు లింగాన్ని, నైరుతి వెండితో చేసిన లింగాన్ని, వాయుదేవుడు మంచులింగాన్ని ప్రతిరోజు నియమంగా పూజిస్తారు. ఈ లోహాలు లేదా పదార్థాలు ఆయా దేవతలకి సంబంధించిన రత్నాలుగా/ లోహాలుగా కనిపిస్తున్నాయి కదా ! అలాగే మిగిలిన లోకపాలకులందరూ నిత్యము లింగ పూజ చేసేవారే!
ఇక పాతాళంలో ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి లాంటి వాళ్ళు విష్ణుభక్తులుగా ఉండగా, విభీషణాది రాక్షసులు శివలింగాన్ని నిత్యం సేవిస్తూ ఉంటారు. వారిలో బలి, బాణుడు ఇంకా శుక్రాచార్యుడి శిష్యులైన మరి కొంతమంది దానవులు శివ భక్తి పరాయణులు. రాక్షసుల్లో అందరూ నిత్యము శివుడిని పూజిస్తారు. శివ పూజా దురంధరులైన అటువంటి వారిలో ప్రముఖులు హేతి , ప్రహేతి, సంయాతి , విఘనుడు ప్రఘనుడు, తీక్షణ ద్రంష్ఠుడు, ధూమ్రాక్షుడు, మాలి, సుమాలి, మాల్యవంతుడు, విద్యుత్కేసుడు, రావణుడు, కుంభకర్ణుడు వీరంతా నిరంతరము శివలింగార్చన చేసి ఎన్నో సిద్దులను పొందారు.
కాబట్టి శివలింగార్చన చేయాలి . అది అనంత ఫలదాయకం అని గుర్తుంచుకోండి . శివుడు అంటేనే శుభాన్ని కలిగించేవాడు అని అర్థం . నిత్యమూ శుభాలు, విజయమూ కలగాలంటే, శివారాధన చేయడం చాలా చక్కని శుభఫలితాలని అనుగ్రహిస్తుంది .