Online Puja Services

రావణవధ తర్వాత రాముడు కోరిన వరం ఇదే !

3.12.154.121

రావణవధ  తర్వాత రాముడు కోరిన వరం ఇదే ! 
-సేకరణ: లక్ష్మి రమణ   

రామ రావణ యుద్ధం ముగిసింది. యుద్ధం జరుగుతుండగా అక్కడికి దేవతలందరితో పాటు శివుడు వచ్చాడు. ఈ సమయంలో రాముడ్ని ఉద్దేశించి పరమేశ్వరుడు ఇలా అన్నాడు. ‘నాయన రామా! అయోధ్యలో దీనంగా ఉన్న నీ తమ్ముడు భరతుడిని ఓదార్చి, నీ తల్లి కౌసల్యను ఊరడించు. పిన తల్లులు కైకేయి, సుమిత్రలకు నమస్కరించు. ఇక్ష్వాక వంశీకులు పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, ప్రజలను సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు నిర్వహించి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువు గానీ. అదిగో, ఆ విమానంలో మీ తండ్రి దశరథ మహారాజు ఉన్నాడు, వెళ్లి చూడు’అన్నాడు.

రామలక్ష్మణులు ఇద్దరూ తండ్రిని చూడగానే నమస్కారం చేశారు. అప్పుడు దశరథుడు రాముడిని ఆనందంతో గట్టిగా కౌగిలించుకు తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. రామా! నేను స్వర్గలోకంలో విహరించాను, ఇంద్రలోకంలో తిరిగాను కానీ నువ్వు లేకపోతే అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదు. ఆనాడు నీకు పట్టాభిషేకం చేయాలన్న తలంపుతో ఉన్నప్పుడు కైక వరాలు కోరి తన కుమారుడు భరతుడికి సింహాసనం కట్టబెట్టమంది. దీంతో ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం ఇంకా జ్ఞాపకం ఉంది. అయితే, ఆ పట్టాభిషేకం భగ్నం కావడానికి కారణం దేవతలని ఇప్పుడు తెలిసింది.. రావణ సంహారం జరగాలి కాబట్టి దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు’ అని అన్నాడు.

అప్పుడు రాముడు, నా పట్టాభిషేకం భగ్నం కావడానికి కైకేయి కారణమని భావించిన మీరు ఆమెను విడిచిపెట్టేస్తున్నానని అన్నారు. ‘ నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు అన్నారు’.  ఆ మాటని మీరు ఉపసంహారించుకుంటే నేను సంతోషిస్తానని అన్నాడు. దీనికి దశరథుడు అంతా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుందని బదులిచ్చాడు. అనంతరం లక్ష్మణుడితో నాయనా! ప్రాజ్ఞుడవి అంటే నువ్వే. అన్న సేవ చేశావు, ఇలాగే సర్వకాలంలో అన్నావదినలను సేవిస్తూ నీ జన్మ చరితార్ధం చేసుకోమని సూచించాడు.

రామలక్ష్మణుల వెనుక తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతను దగ్గరికి పిలిచిన దశరథుడు, నీతో నాకు ప్రయోజనం లేదని, విడిచిపెట్టేస్తున్నానని, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లమని నా కుమారుడు అన్నాడు కదా? దానికి నువ్వు బాధపడ్డావా తల్లీ? నీకొక నిజం చెప్పనా, రాముడికి నీ మీద ఎప్పుడూ అలాంటి అభిప్రాయం లేదు. నిన్ను వేరొకరు వేలెత్తి చూపించరాదనేది కౌసల్యా తనయుడి తాపత్రయమని వివరించారు. అనంతరం దశరథుడు ఊర్ధ్వలోకాలకి తరలిపోయాడు.

అక్కడే ఉన్న దేవేంద్రుడు. రామా! ఒకసారి మేము ప్రత్యక్షమైతే, ఆ దర్శనం వృధా కారాదు. కాబట్టి ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. ‘నాకోసం తమ భార్యా పిల్లలను వదలి కోట్ల వానరాలు, భల్లూకాలు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మరణించాయి. కొన్నింటికి చేతులు, కాళ్లు తెగిపడి యుద్ధభూమిలో రక్తమోడుతున్నాయి. 

మీకు నిజంగా నాపై ప్రేమ ఉంటే యమపురికి వెళ్లిన వానరాలన్నీ బతకాలి.  కాళ్లు, చేతులు తెగిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్లీ జవసత్వములతో పైకి లేవాలన్నాడు. యుద్ధానికి వచ్చేటప్పుడు అవి ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్లే అంతే బలంతో ఉండాలి. వీరు ఎక్కడికి వెళ్లినా చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు వికసించాలి. సమృద్ధిగా తేనె, తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి’ అని రాముడు అన్నాడు. దీంతో ఇంద్రుడు తప్పకుండా నీకు ఈ వరాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు, యమపురికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషించారు.

అదేకదా కరుణా సముద్రుడు, ఉత్తమమైన పురుషుడు అయిన రాముని వక్తిత్వంలోని గొప్పదనం . తనకోసం ఎవరమూ కోరలేదు . తనకోసం తన తండ్రిని అభ్యర్ధించలేదు . ఇతరుల కోసమే పాటుపడ్డ అమరత్వం ఆయన వ్యక్తిత్వం .  అందుకే ఆయన చరితం ఒక అమృతం. 

శుభం .

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi