Online Puja Services

పాకిస్థాన్లో పంచముఖ హనుమంతుడు .

3.14.73.193

పాకిస్థాన్లో సనాతనుల పాలిటి కల్పవృక్షంగా వెలుగొందుతున్న పంచముఖ హనుమంతుడు .
- లక్ష్మి రమణ  

పంచముఖ ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు, పది ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది. పంచముఖ ఆంజనేయస్వామి  అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుడు ఈ ఐదుగురూ స్వామి పంచ ముఖాలుగా మారి దర్శనమిస్తారు. స్వామి ఈ వినూత్నమైన రూపాన్ని పొందడానికి కూడా రామరావణ యుద్ధమే కారణమయ్యింది. తన స్వామి రాముని రక్షకోసం హనుమంతుడు ఈ రూపాన్ని ధరించారని చెబుతారు . 

 రామ లక్ష్మణులని మాయోపాయంతో యుద్ధభూమినుండీ పాతాళానికి ఎత్తుకుపోతాడు  మైరావణుడు . ఆ రాక్షస సంహార సమయంలో ఈ పంచముఖి అవతారాన్ని ఎత్తారు ఆంజనేయ స్వామి. కంభ రామాయణంలో హనుమంతుని గురించి చాల గొప్ప వివరణ ఉంటుంది . పంచ భూతాలకి ప్రతి రూపం కూడా ఈ ఆంజనేయ స్వామేనని, ఇది మనకి చెబుతుంది . గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు ఈ ఐదు భూతాలనీ తనలో ఇముడ్చు కున్నవాడు అంజనీ సుతుడు. పవన తనయుడై - గాలిని , ఆకాశ (శూన్యాన్ని) మర్గాన నూరు యోజనాలు అధిగమించి - ఆకాశాన్ని . సముద్రాన్నిదాటి- నీటిని , అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసుకుని - భూమిని , లంకా దహనం చేసి - అగ్నిని స్నేహం చేసుకున్నాడు. ఆయా స్వరూపాలు తానె అయ్యి వెలుగొందాడు . 

సుందరా కాండలో కుడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండం లో చాలా చక్కగా తెలిపారు. పంచముఖి ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే అంజనేయుడు మనోభీష్టాలు తీర్చే వానిగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అబీష్ట సిద్ధిని, పడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కుని చూసే వరాహ స్వామీ ధన ప్రాప్తిని, ఊర్థ ముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని అందిస్తారని ప్రతీతి. పాకిస్థాన్ లోని కరాచీలో స్వయం వ్యక్తమైన  అద్భుతమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఇటువంటి తత్వాన్నే  విశదపరుస్తుంటారు . 

కరాచీలో  ఆంజనేయ స్వామి విగ్రహం : 

శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామి స్వయంభూవుగా వెలసిన ప్రముఖమైన శ్రీ పంచముఖి హనుమాన్ మందిరం కరాచీలో యుగయుగాల నుంచి పూజలు అందుకుంటుంది.  ఇది శ్రీరాముడు స్వయంగా దర్శించిన క్షేత్రం అని చెబుతారు. వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థల పురాణం చెబుతోంది.  హిందువులు ప్రతిఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు . 

పురావస్తు శాఖ అధ్యయనంలో ఈ ఆలయం 1500 ఏళ్ల క్రితం నిర్మించినట్టు వెల్లడైంది.  స్వయంభుగా వెలసిన ఆంజనేయుడు ఇంతకుముందరే చెప్పుకున్నట్టు దివ్యమైన పంచముఖ ఆంజనేయునిగా దర్శనమిస్తూ ఉంటారు . సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం భక్తులకు అభయమిస్తూ ఉంటుంది. 

 ఈ ఆలయంలో మూలవిరాట్ ఉన్న ప్రాంగణంలో 21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.  కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు.  ఆలయ ప్రాంగణ తవ్వకాలలో పురాతనమైన అనేక విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు.  హిందువులకు శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయం ఎంతో పవిత్రమైన ప్రదేశం. 

కరాచీలో ఉన్న ఈ దేవాలయం ఆంజనేయ వరప్రసాదాన్ని అనుగ్రహించేది . ఎంతైనా పాకిస్థాన్ ఒకప్పుడు భారత్ లో భాగమే కదా ! అందువల్ల శ్రీరాముని పాద ముద్రలు ఆ నేల మీద కూడా ఉన్నాయి . అందుకే తన స్వామిని అనుగమిస్తూ , తన స్వామిని ఆరాధించే భక్తులని కాపాడుతూ హనుమన్న కరాచీలో భక్తులని అనుగ్రహిస్తూ స్వయంభువై వెలిసి అనుగ్రహిస్తున్నారు . 

శుభం . 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi