Online Puja Services

అమ్మవారి పసుపుని ఏం చేయాలి ?

3.21.246.123

పసుపు అంత పవిత్రమైనది ఎలా అయ్యింది ? అమ్మవారి పసుపుని ఏం చేయాలి ?
-లక్ష్మీ రమణ . 
  
ప్రకృతిని శక్తి స్వరూపంగా, సాక్షాత్తు పరమేశ్వరిగా ఆరాధించడం మనకి అనాదినుండి ఉన్న ఆచారమే కదా ! భారతీయుల వంటలు, పూజలు, సంప్రదాయాలు, పసుపు ఉంటేనే పూర్తవుతాయి . ఏదైనా శుభకార్యమంటే పసుపుదే ప్రధమ స్థానం.  ఆఖరికి సరుకులేం కావాలనే చిట్టా కూడా పసుపుతోనే మొదలవుతుంది . పసుపు మన సంప్రదాయంలో సాక్షాత్తూ ఆ లలితాంబికే . దీనికి సంబంధించిన ఆధారాలూ మన ప్రాచీన గ్రంధాలలో లభ్యమవుతున్నాయి . 

ప్రపంచం వాడుకునే మొత్తం పసుపుని దాదాపుగా భారతదేశమే ఉత్పత్తి చేస్తోంది.  దాంట్లో దాదాపు 80% భారతీయులే వాడుతూ ఉండడం విశేషం .  భారతీయ పసుపుని  ప్రపంచంలోనే , మేలైన నాణ్యమైన పసుపుగా పరిగణిస్తారు. భారతదేశంలో పసుపుని అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ‘ ఎల్లో సిటీ’ అని పేరొందిన రాష్ట్రం తమిళనాడు .   ఆ తర్వాత మహారాష్ట్ర పసుపు ఉత్పత్తిలో రెండవ రాష్ట్రంగా ఉంది .
 
పసుపు వాడకం  భారతదేశంలో ఈనాటిది కాదు.  దాదాపు 4000 సంవత్సరాల క్రితంనాటి వేదకాలానికి పూర్వము  నుండే పసుపుని భారతీయులు వినియోగిస్తున్నారు .  హిందూ సంప్రదాయాలలో పసుపు ఒక భాగం . చైనా , దక్షిణాఫ్రికా , జమైకా తదితర దేశాలలో పసుపుని ఒక మూలికగా , ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నప్పటికీ, అది భారతీయుల తర్వాతే. 1280లలో మార్కోపోలో పసుపుని ఒక దినుసుగా , కుంకుమపువ్వుతో సమానమైన గుణాలు కలిగినదానిగా వివరించారు .  కానీ, భారతీయులు పసుపు యొక్క ప్రాశస్త్యాన్ని యుగాల క్రిందటే గుర్తించారు . సంసృతంలో వ్రాయబడిన మన ఆయుర్వేద , యునాని వైద్యాలు దక్షిణ ఆసియాలోని  వైద్యవిధానాలలో పసుపు వినియోగాన్ని , ఉపయోగాన్ని గొప్పగా వివరించాయి . సుమారు క్రీస్తు పూర్వం 250 ల కాలంనాటి సుశృతుని ‘ఆయుర్వేద సంహిత’ విషాహారం వల్ల కలిగే దుష్ప్రభావాలు  పసుపుని నూరి తీసుకోవడంవల్ల తగ్గుతాయని చెబుతుంది . పసుపుని కాష్ప- క్రిములని నాశనం చేసేది , విషాగ్ని - విషాన్ని నాశనం చేసేది అని సంస్కృతంలో వివరించడాన్ని ఇక్కడ మనం గమనించాలి .   ‘ దీనివల్ల పసుపు మన సంప్రదాయంలో ఎప్పటి నుండీ ఉందనేది ఒక అంచనా వేసుకోవచ్చు .    

పసుపుని ఉత్తరాదివారు హిందీ భాషలో హల్దీ అంటారు . ఇది సంస్కృతంలోని హరిద్ర అనే మాట నుండీ వచ్చింది. హరిద్ర అంటే ప్రక్రుతి అని అర్థం . సంస్కృతంలో పసుపుకి కనీసం  53 దాకా  నామాంతరాలు కనిపిస్తాయి  . అవన్నీ కూడా పసుపు యొక్క విశిష్టతని, గొప్పదనాన్ని తెలియజేసేవే . అదృష్టాన్ని తెచ్చిపెట్టే ద్రవ్యం అనే అర్థంలో - ‘ భద్ర’ అనీ, అనేకమైన ఉపయోగాలుగలిగినది అనే అర్థంలో ‘బహుళ’ అనీ,   ‘గంధప్లాషిక’ అంటే సుగంధాన్ని వెదజల్లేదనీ,  ‘గౌరీ’ అంటే శక్తి స్వరూపమనీ అదేవిధంగా తెల్లని వర్ణాన్ని ఇచ్చేదనీ ,  ‘హరిద్ర’,’ హరిత’ అంటే ప్రకృతి అనీ అదేవిధంగా హరికి ప్రియమైనది అనీ , ‘జయంతి’ - అమ్మవారి స్వరూపం విజయానికి సంకేతం , వ్యాధుల నివారిణి అని అర్థం , ఇక జ్వరాంతిక, లక్ష్మీ , మాంగళ్య , మంగళప్రద, సువర్ణ  అని అనేక నామాలు కనిపిస్తున్నాయి .  

హిందూ సంస్కృతికి మూలం వేదాలు.  అటువంటి అధర్వణ వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. మన సంస్కృతిలోని ప్రతి ఆచారం వ్యవహారం చాలా లోతైన ఆలోచనతోటి అనంతమైన తాత్వికతతోటి నిండి ఉంటాయి . చాలా సులువుగా కనిపించే చిన్న చిన్న సంప్రదాయాల్లో ఎంతో లోతైన ఆయుర్వేద ప్రయోజనాలని చొప్పించారు మన మహర్షులు . పసుపుని పవిత్రమైన ద్రవ్యంగా వినియోగించే సంప్రదాయం కూడా ఇందులోని భాగమే .  పైన చెప్పుకున్న నామాలలో చాలా వరకూ పసుపుకి నామాంతరాలుగా  మనకి లక్షీ దేవి , గౌరీ దేవి పేర్లు కనిపిస్తాయి . వీటిని ఆ శక్తి స్వరూపిణుల సహస్రనామాలలో గమనించవచ్చు . అంటే, మన సంప్రదాయంలో పసుపు అనేది ‘ఒక ఔషధరూపేణా’ ఆయుర్వేద ప్రాధాన్యతని సంతరించుకోవడమే కాకుండా, అమ్మవారి స్వరూపంగా , శక్తి ప్రతీకగా ఆధ్యాత్మిక ప్రాధాన్యతని  కూడా కలిగి ఉంది . దీనిలో భాగంగానే, పసుపు ముద్దని గణపతిగా, గౌరమ్మగా భావించి పూజించడం . 

వానాకాలం, శీతాకాలాలలో వచ్చే వరుస పండుగలకి గుమ్మానికి పసుపురాసి ద్వారా పూజ చేస్తాం. ఇంట్లో, నిత్యం నీళ్ళల్లో నానుతూ ఉండే ఆడవాళ్లు,  కాళ్ళకి తప్పనిసరిగా పసుపు రాసుకుని పసుపుతో చేసిన దేవీరూపాన్ని కొలుస్తారు. ఈ ప్రక్రియకు ముందుగా ఇల్లంతా పసుపునీళ్లతో శుద్ధి చేస్తారు .  ఇది క్రిమికీటకాదులు ఇంట్లోకి రాకుండా చేయడంతో పాటు, ఇల్లాలి ఆరోగ్యాన్ని తద్వారా ఆ కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించే సంప్రదాయం కాదంటారా ? భారతీయ ఆయుర్వేదం (ప్రాచీనమైన భారతీయ విజ్ఞాన శాస్త్రం ) పసుపుని వేసిన ఆహారాన్ని వినియోగించడం వల్ల చాలా సేపు వండిన పదార్థాలలో సూక్ష్మక్రిములు పెరగకుండా ఉంటాయని పేర్కొంటుంది. ఇక సంప్రదాయం పసుపు వేయడంవల్ల ఆహారం శుద్ధవుతుందని చెబుతుంది . ఇప్పటి సైన్స్ పసుపు ప్రకృతి సిద్ధమైన యాంటీ బయోటిక్ అని చెబుతుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి సరిపోలుతున్నాయి కదా .  

దీన్ని బట్టి, పసుపుని ప్రసాదంగా స్వీకరించడం , పసుపు నీళ్లని శుద్ధికి ఉపయోగించడం , సర్వత్రా పసుపుని మంగళ ద్రవ్యంగా ఉపయోగించడం అనేవి , పసుపుకి ఉన్నటువంటి ఈ విశేషమైన లక్షణాలని బట్టీ ఆపాదించబడ్డాయని అర్థమవుతోంది కదా ! ‘యువతి’ అనే నామాంతరం పసుపుకు ఉంది. ఇప్పుడు మనం రాసుకునే ఎన్నో సౌందర్య లేపనాలకన్నా అద్భుతమైన ఫలితాలని రోజూ పసుపు ముఖానికి రాసుకొని, సున్నిపిండితో స్నానాన్ని ఆచరించడం ద్వారా పొందవచ్చు .

పసుపు దేవీ స్వరూపం కనుక దానికి మైల ఉండదు. సౌభాగ్యానికి చిహ్నం. మంగళ , మాంగళ్య అని పసుపు నామాంతరాలు . స్వయంగా మంగళ గౌరీ స్వరూపమే పసుపు. అందుకే, నిత్యం హృదయంపైనా ధరించే తమ మాంగల్యానికి పసుపుని అద్దడం, పసుపుతోకలిపి నూరిన కుంకుమని, సింధూరాన్ని నుదుటన ధరించడం మన హిందువా సంప్రదాయంలో భాగంగా చెప్పబడింది.  ఎన్నో  వ్యాధులనుండీ రక్షించ గలిగిన విశేష లక్షణాన్ని కలిగిఉన్న ఈ అద్భుత మూలికాని ఉపయోగిస్తే, ఇల్లాలి సౌభాగ్యానికి - ఇక లోటేమిటి . ఇల్లాలే కదా ఇంటికి దీపం . ఆమె ఆచార వ్యవహారాలే, ఆ ఇంటికి కొండత రక్ష మరి . ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.

దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు చాలా ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి వెళ్లినప్పుడు మనకి  పసుపు ప్రసాదాన్ని అందిస్తారు .  ఆ పసుపును ఎలా వినియోగించాలనే సందేహానికి పండితులు ఇలా వివరణ నిస్తున్నారు : 

ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం:

1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.

2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.

3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.

4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.

5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.

6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.

7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.

8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.

9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.

10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది.

కాబట్టి , పసుపుని విరివిగా ఉపయోగిద్దాం. మన ఆచారాలనూ , సంప్రదాయాలనూ గౌరవిద్దాం . ఆనందంగా, ఆరోగ్యంగా జీవిద్దాం . నమస్కారం .

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya