Online Puja Services

పెళ్ళికూతురు గౌరీ పూజ ఎందుకు చేయాలి ?

13.59.100.205

పెళ్ళికూతురు గౌరీ పూజ ఎందుకు చేయాలి ?
-లక్ష్మీ రమణ

తెలుగువారు తమిళులు ఒక సంప్రదాయాన్ని పాటిస్తారు. పెళ్ళికి ముందర పెళ్లికూతురి చేత తప్పనిసరిగా  గౌరీపూజ చేయిస్తారు . ఇలా  గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అనంతమైన అన్యోన్యత కాబోయే జంటకి సిద్ధించాలన్న ఆకాంక్ష ఉంది . ఇలా వివాహంలో ప్రతి తంతుకీ ఒక వివరణ ఉన్నప్పటికీ , ఈ గౌరీ పూజకి ఉన్న ప్రాముఖ్యత మాత్రం సామాన్యమైనది కాదు . ఆ విషయాలని తెలుసుకుందామా!

దేవతామూర్తులలో స్త్రీ  స్వరూపములన్ని  అమ్మవారి రూపములే. లక్ష్మీ , సరస్వతీ, పార్వతి త్రిమూర్తుల శక్తులు . వారిలో మిగిలిన వారికన్నా పరమేశ్వరునికి ఇల్లాలయిన గౌరమ్మనే పెళ్లికూతురి చేత పూజింపజేయడంలోని ఆంతర్యం చాలా ఉన్నతమైనది . పరమేశ్వరునికి ఇల్లాలిగా  ఉండడం చాలా కష్టం. ఆయన నిత్యం సమాధి స్థితిలో రమించేవాడు.  తపస్సులో నిమగ్నమయి ఉండేవాడు . ఆయన మనసుని గెలుచుకొని, ప్రజాసంక్షేమం కోసం , సమస్త సృష్టి సంక్షేమం కోసం సంసారంలోకి దించడం సామాన్యమైన విషయమా ? 

ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేసికూడా , ఆ మన్మధుడు  సాధించలేకపోయాడో,  ఆ చెరుకు విల్లు తాను స్వయంగా ధరించిన లలిత,  ఏమీ మాట్లాడకుండా కూర్చున్న శివుణ్ణి  సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. తన బిడ్డలకి తండ్రిని చేసింది . మరోవైపు పరమేశ్వరిగా  ఈ సృష్టి నంతటినీ చేసి, తిరిగి తన  అనుగ్రహంతోటే  ఆ లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది.  ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. అదీ ఆవిడ ప్రజ్ఞ .  

నూతన వధువు అంటే స్వయంగా ఆ గౌరము ! ఇక  ఇల్లాలు కాబోతున్న యువతి తాను గౌరమ్మ ఏవిధంగా పరమేశ్వరుని మనసుని గెలిచిందో అదే విధంగా భర్త మనసుని గెలవాలి. ఆవిధంగా ఆయనకీ ప్రీతిని కలిగించే విధంగా ప్రవర్తించాలి . మంత్రిగా ప్రతికార్యమూ తానె నిర్వహించాలి . సర్వకాలములలోనూ  కష్టం వచ్చినా సుఖం వచ్చినా, భార్య భర్తకు విశ్రాంతి స్థానముగా నిలవాలి .  కనుక,  ఆమెకి అటువంటి శక్తి రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. 

ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు కొన్ని చక్కని విషయాలు చెప్తారు. అలా చెప్పాలి కూడా ! ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద, మామమీద, మరిది మీద, ఆడపడుచుల మీద, భర్తకు వేరొక రకమయిన మాటలను  చెప్పి కష్టం కలిగించ కూడదు . తద్వారా ఇంటి విభజనకి కారణం కాకూడదు . అని చెప్తారు . 

ఇక నవ వధువు ‘నా భర్తను అనుసరించి, నా భర్త కు సేవలు చేసి,  నా భర్త పొంగి  పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. నేను కూడా నా భర్త చేత, నీవు ఎటువంటి అనురాగాన్ని ఆ పరమేశ్వరుని వద్ద పొందావో  అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని ఆ గౌరమ్మని ప్రార్ధించాలి .  మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi