Online Puja Services

ఋష్యశృంగుని పేరుని స్త్రీలోలుడు అనే అర్థంలో వాడడం చాలా పాపం

3.141.19.130

ఋష్యశృంగుని పేరుని స్త్రీలోలుడు అనే అర్థంలో వాడడం చాలా పాపం!
లక్ష్మీరమణ 

ఋష్యశృంగుని పేరుని స్త్రీలోలుడు అనే అర్థంలో వాడడం చాలా చాలా పాపం . ఆయన అమోఘమైన విద్వత్తు కలిగినవాడు .  మహనీయుడు , పూజనీయుడు . ప్రకృతి ప్రకాశకుడు ఋష్యశృంగుడు. స్వయంగా శివుడు .  రాముని అవతరణకు ఇతోధికంగా సాయపడినవాడు . ఆయన గురించి తలుచుకోవడం ఒక సుకృతంతో సమానం .  అటువంటి పావన మూర్తి ఋష్యశృంగుడు . తెలిసో , తెలీకో అటువంటి మాటని ఉపయోగించి ఉన్న పాపం , వాచాదోషం ఎవరికీ కలగకూడదని కోరుకుంటూ ఆ మహనీయుని కథని మీకందించే ప్రయత్నం చేస్తున్నాం. అవలోకించండి  . 

కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి పుత్రుడే ఋష్యశృంగ మహర్షి. ఇక్కడ విభండకమహర్షి గురించి కొంత చెప్పుకోవాలి . ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. తపస్సంపన్నుడు. ఒకనాడాయన ఒక సరస్సులో స్నానం ఆచరించి సంధ్యావందనం చేస్తున్న సమయంలో  , దేవలోక అప్సరస , అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశి అటుగా వెళుతూ , ఆయన కంట పడుతుంది . ఆమె సౌందర్యానికి మనసు చెలించి, ఆ సరస్సులో స్ఖలిస్తాడు . అప్పుడే ఆ నదిలో నీళ్లు తాగేందుకు వచ్చిన జింక నీటితో పాటు , ఆయన విడిచిన వీర్యాన్ని గ్రహిస్తుంది. దాంతో గర్భవతి అవుతుంది .  

ఆ జింక , పూర్వాశ్రమంలో ‘చిత్రరేఖ’ అనే అప్సరస . ఆమె నాట్యానికి వన్యమృగాలు సైతం పరవశించిపోతాయి .  అలా ఒకనాడామె దేవేంద్రుని ఎదుట నాట్యం చేస్తోంది . దేవేంద్రుని మనసు, చూపు ఆమెమీదే నిలిచింది. కానీ ఆమె మాత్రం అతన్ని చూడకుండా, ఆమె నాట్యాన్ని చూసి పరవశమైన లేడిని చూడసాగింది . దాంతో కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు , నువ్వు జింకవై , ఒక మానవ పుత్రుడికి జన్మనిచ్చెదవు గాక ! అని శాపమిచ్చాడు .  అలా ఇంద్రుడి శాపం పొందిన జింకే , ఈ సరస్సులో నీరు తాగిన జింక. తల్లి పోలిక పుణికి పుచ్చుకొని, ఆజింక్య కడుపున ఒక శృంగము ( కొమ్ముని) కలిగి జన్మించినవాడు ఋష్యశృంగుడు . 

దివ్యదృష్టిచేత ఈ వృత్తాన్తయాన్ని తెలుసుకున్న  విభాండకుడు  ఆ బాలున్ని తన ఆశ్రమానికి తీసుకువచ్చి ,  ఋష్యశృంగుడని పేరు పెట్టి , అతనికి  సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, నేర్పుతాడు. అతనికి తండ్రే దైవం. ఆ ఆశ్రమమే ప్రపంచం. ఇంద్రియాల విషయలోలత్వం తెలియనివాడు . కనీసం స్త్రీ , పురుషుల తారతమ్యం కూడా యెరుగనివాడు. జ్ఞాననిష్ఠ , తపస్సంపదతో జ్వలిస్తున్న అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశించేవాడు . అరికాలిలో అదృష్ట రేఖలున్నవాడు . ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రకృతి పరవశిస్తుంది. చక్కగా వర్షాలు పడతాయి . పంటలు పండి , దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది.  ఇది ఆయనకున్న వరం . 

ఇదిలా ఉండగా , అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణముగా ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టి తో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏం  చెయ్యాలని తన మంత్రులను అడుగుతాడు.  వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే, రాజ్యములో వర్షాలు పడాతాయి అని సలహా చెబుతారు.

కానీ అది అంత సులువైన విషయం కాదు. ఋష్యశృంగుడు విశ్యాలోలత్వం తెలియనివాడు. అతన్ని తండ్రి విభాండకుడు ఆశ్రమం నుండీ బయటికి పంపేందుకు ఇష్టపడడు . కాబట్టి అది అసాధ్యమైన విషయంగా ఉంది . దానికి తరుణోపాయం ఏమిటని ఆలోచించి , అందమైన స్త్రీలను ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు రాజు రోమపాదుడు .

ఆ స్త్రీలు విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయం చూసుకొని , ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని, అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు బయటికి  వస్తాడు. స్త్రీ, పురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వారిని తోటి మునికుమారులని ఎంచి , ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని భావించి  సేవిస్తాడు. ఇక ఇతరములైన వాంఛలను అతనిలో ఉద్దీపించేలా వారు ప్రవర్తిస్తారు . అమాయకుడైన ఆ మహర్షికి దీంతో కొత్త ఆకర్షణ కలిగి ,  వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు . అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.

ఆ తర్వాత, రోమపాదుడు కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని, ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు. దానికి ప్రతిగా రోమపాదుడు తన కూతురైన శాంత ను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు. నిజానికి శాంత దశరథ మహారాజు కుమార్తె. రాములవారికి స్వయంగా అక్క. 

అనంతర కాలంలో ఋష్యశృంగుడు దశరథుడికి పుత్రసంతానం కోసం అశ్వమేధయాగం, చేయించాడు. కులగురువయిన వసిష్ఠ మహర్షి సహాయంతో పుత్రకామేష్టి శాస్త్రోక్తంగా చేయించాడు ఋష్యశృంగుడు. 

ఋష్యశృంగుడు రాసిన గ్రంథం “ఋష్యశృంగ స్మృతి" అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. దానిలో ఆచారం, శౌచం, శ్రాద్ధం, ప్రాయశ్చిత్తం మొదలయిన వాటి గురించి రాయబడి ఉంది.

ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరి కి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. ఈ ఆలయం లో శివలింగానికి శృంగం ఉండడం గమనించవచ్చు.ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికి తీవ్ర క్షామం అనుభవిస్తున్న ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి జగద్గురువుల ఆదేశాల మేరకు పూజలు చేస్తూవుంటారు. ఫలితంగా వారి ప్రాంతాలలో  చక్కగా వానలు పడి సుభిక్షమవుతాయి. 
 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi