Online Puja Services

అక్షయతృతీయ తిధికి అక్షయ ఫలాలని అనుగ్రహించే మహిమ

3.19.242.46

అక్షయతృతీయ తిధికి అక్షయ ఫలాలని అనుగ్రహించే మహిమ ఏ విధంగా వచ్చింది ?
- లక్ష్మి రమణ 

నారద  (Narada) మహాముని అంబరీషునికి (Ambarisha) వైశాఖ (vaisakha)మహిమను వివరిస్తూ ఈ విధంగా పలికాడు.  “ ఓ అంబరీషా !  వైశాఖ శుద్ధ తృతీయమని అందరూ అంటారు.  అది ఎంతో పవిత్రమైంది. ఆరోజు చేసినటువంటి దానము, పూజ సర్వపాపహరము.  శ్రీహరి పదాన్ని కలిగించేటటువంటిది. ఈరోజు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదులని  ఇవ్వాలి.  ఈరోజు చేసిన ఇటువంటి పుణ్య కార్యాలకి విశేషమైన ఫలితం ఉంటుంది.  ఈ అక్షయ తృతీయనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విన్నవారు ముక్తిని పొందుతారు.  ఈ రోజు చేసినటువంటి దానము అక్షయ ఫలాలను ఇస్తుంది.  ఈ తిధి దేవతలకు, ఋషులకు పితృదేవతలకు ముగ్గురుకి తృప్తిని కలిగిస్తుంది అని ఇదివరకే మీరు వివరించి ఉన్నారు. అయితే ఈ తిధికి ఈ మహిమ ఏ విధంగా వచ్చిందో ఆ కారణాన్ని తెలియజేయండి అని శృత కీర్తి మహారాజు శృతదేవ మహామునిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ మునీంద్రుడు విశాఖ పురాణం లోని 28వ అధ్యాయాన్ని  ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. 

“పూర్వము ఇంద్రునికి బలి చక్రవర్తితో పాతాళంలో యుద్ధం జరిగింది.  ఇంద్రుడు అతనిని జయించి తిరిగి వస్తూ,భూలోకాన్ని చేరుకున్నాడు.  మార్గమధ్యంలో ఉతద్య మహాముని ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఆయన భార్య  త్రిలోక సుందరి.  గర్భవతి.  అటువంటి ఆమె ఒంటరిగా ఉండడాన్ని చూసి మోహించాడు. ఆమెను బలాత్కారముగా అనుభవించాడు.  ఆమె గర్భంలో ఉన్న పిండము ఇంద్రుని వీర్యము లోపటికి రానీయక పాదాన్ని అడ్డంగా ఉంచింది. ఇంద్రుడు కోపించి అతనిని గ్రుడ్డివాడివి కమ్మని శపించాడు.  అతని శాపాన్ని అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడు అనేవాడు పుట్టు గ్రుడ్డివాడై జన్మించాడు.  గర్భస్థ పిండము చేత అవమానించబడి, శపించినటువంటి ఇంద్రుడు మునిపత్నిని బలవంతంగా అనుభవించి, ముని చూసినట్లయితే శపిస్తాడని భయపడి త్వరగా వెళ్లాలని పరిగెత్తి పారిపోయాడు.  అతనిని చూసిన ముని శిష్యులు పరిహసించారు. 

 ఇంద్రుడు (Indra) కూడా సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు.  ఇంద్రుడు ఈ విధంగా మేరుగుహలో దాగినట్లు తెలుసుకున్నటువంటి బలి (bali) మొదలైన రాక్షసులు అమరావతిని ఆక్రమించి, దేవతలను తరిమికొట్టారు. ఏం చేయటానికి దిక్కుతోచినటువంటి దేవతలు బృహస్పతిని చేరి, ఇంద్రుడి విషయాన్ని ఆరా తీశారు.  బృహస్పతి కూడా దేవతలకు ఇంద్రుడి పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచీదేవితో కలిసి మేరు పర్వత గుహలో ఉన్నాడని తెలియజేస్తాడు.  అప్పుడు వారందరూ కూడా మేరు పర్వత గుహలు చేరి, ఇంద్రుని బహు విధాలుగా స్తుతించారు.  బృహస్పతి మొదలైన వారి స్తుతులను విన్నటువంటి ఇంద్రుడు సిగ్గుపడుతూ బయటకు వచ్చి, వారికి కనిపించాడు. 

అప్పుడే దేవతలు దీనులై , బలి మొదలైన రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించారని చెప్పారు . పర స్త్రీ సంగత్వ దోషముతో నేను అశక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పాడు.  ఇంద్రుని మాటలు విన్నటువంటి బృహస్పతి, దేవతలు ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు. అప్పుడు బృహస్పతి దేవతలతో ఈ విధంగా అన్నాడు.  ప్రస్తుతం శ్రీహరికి ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖమాసము గడుస్తూ ఉంది.  ఈ మాసంలో అన్ని తిధులు కూడా పుణ్యప్రదములు, శక్తివంతము అయినటువంటివి. అందులోనూ  శుక్లపక్షంలో వచ్చేటటువంటి తృతీయ తిధి ఎంతో శక్తివంతమైనది.  ఆరోజు చేసినటువంటి స్నానాలు ఉత్తమమైన ఫలితాలను అనుగ్రహిస్తాయి.  సర్వపాపాలను పోగొడతాయి.  కాబట్టి ఆ రోజు ఇంద్రుడి చేత  వైశాక ధర్మములను ఆచరించే విధంగా చేసినట్లయితే, ఇంద్రుడి పాపము తొలగిపోయి పూర్వపు బలము శక్తి యుక్తులు మరింతగా వస్తాయని తరుణోపాయాన్ని చెప్పారు. 

దాంతో అందరూ కలిసి ఇంద్రుడి చేత అక్షయ తృతీయనాడు ప్రాతకాలమే స్నానము తర్పణాదులు ఇవ్వడం , శ్రీహరి పూజ, కథా శ్రవణము మొదలైన వాటిని చేయించారు . ఇంద్రుడు కూడా అక్షయ తృతీయ ప్రభావముతోటి శ్రీహరి కృపతోటి ఎంతో శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని తదితర రాక్షసులను తరిమివేసి అమరావతిని తిరిగి గెలుచుకొని అందులో ప్రవేశించాడు.  అప్పుడు దేవతలు యజ్ఞం యాగాదులలో తమ భాగాలను తిరిగి పొందారు. మునులు కూడా  రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞ యాగాదులను, వేదాధ్యయనాలను కొనసాగించారు.  పితృదేవతలు కూడా యధాపూర్వకముగా తమ పిండాలను పొందారు. 

 కాబట్టి అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించేదయ్యింది.  ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకు భక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామాన్ని పొందింది.”  అని శృతదేవుడు శ్రుత కీర్తి మహారాజుకు అక్షయ తృతీయ మహిమను వివరించాడ”ని నారదుడు అంబరీష్యునికి వైశాఖమాస మహిమను వివరిస్తూ తెలియజేశాడు. 

వైశాఖ పురాణం 28వ అధ్యాయం సంపూర్ణం.  

సర్వం శ్రీ హరి పాదారవిందార్పణ మస్తు !!

Vaisakha Puranam, Akshaya Truteeya, 

#vaisakhapuranam #akshayatruteeya #akshayathrutheeya

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi