Online Puja Services

మనకు కావాల్సిన కనకాధార ‘నమస్కారమే’

3.147.13.229

మనకు కావాల్సిన కనకాధార ‘నమస్కారమే’ !
సేకరణ: లక్ష్మీ రమణ 

భారతీయులకి నమస్కారమే సంస్కారము. మనకున్న ఆస్తి అంతా నమస్కారక్రియే. భగవత్పాదుల వారు ఒకపుడు కనకధారా స్తోత్రమనే స్తోత్రంతో లక్ష్మిదేవిని ప్రార్ధించారు. ఒక బీద బ్రాహ్మణవనిత కోసం ఆయన ఈ స్తోత్రాన్ని చెప్పారు. ఆయనకు కోరికలు లేవు .  కావలసినది ఏదీ లేదు. కానీ మహాలక్ష్మిని ప్రార్ధించి ఆమె దర్శన మిచ్చిన తర్వాత,  ఆమెను ఏ కోరికా కోరకుండా ఉండకూడదు . అందుచేత ఆయన నమస్కారమనే సంపదను మాత్రం ఆమె వద్ద కోరుకొంటారు. దానిలో ఒక శక్తినిపాత రహస్యమే దాగుంది . 

‘సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితోద్దరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతునాన్యే’

అంటారాయన . కట్టకడపట 'నాన్యే' అన్న పదప్రయోగం కనకధారలో చేస్తారు శంకరాచార్యులు. ''మహాలక్ష్మీ! నేను చేసే ఈ నమస్కార క్రియను మించిన సంపద వేరే ఏదీ అక్కరలేదు. నీకు సదా వందనం చేసుకొనే భాగ్యం  తప్ప నాకింకే భాగ్యాలూ అవసరం లేదమ్మా” అని  ప్రార్ధిస్తారు .

అమ్మవారికి చేసే ఆ నమస్కారం ఎటువంటిది? సంపత్కరాణి - సంపదలు కలిగించునది. సకలేంద్రియ నందనాని - అన్ని ఇంద్రియములను సంతోషపెట్టునది. సామ్రాజ్యదాన నిరతాని. అంతేకాదు ఆ నమస్కారము సామ్రాజ్యమునే ఇవ్వగల శక్తి గల యట్టిది. లలితా సహస్ర నామములలో - రాజరాజేశ్వరీ - రాజ్యదాయిని, రాజపీఠ నివేశిత నిజాశ్రితా - అనే అనామాలున్నాయి కదా !  రాజ్యమును అనుగ్రహించేందుకు , తన ఆశ్రితులను ఆ రాజపీఠము పైన కూర్చో పెట్టేందుకు అమ్మవారికి అనుగ్రహశక్తి ఉంది .

ఆ నమస్కారానికి మరొక్క శక్తి కలదు. అది, దురితోద్ధరణోద్యతాని - దురితములు అంటే పాపములు.  దురితముల నుండి ఉద్ధరించుటకు ఉద్యమించే శక్తి అంటే మన పాపములను ఆ నమస్కారం పోగొడుతుంది. దీనికి మరొక పాఠాంతరమును చూస్తున్నాం. అది, ''దురితాహరణోద్యతాని'' వ్యాకరణ యుక్తంగా హరణ, ఆహారణ రెండూ ఒక్కటే హరణ అంటే పోగొట్టుట. ఆహరణ అంటే తీసుకొని వచ్చుట. అనే అర్ధం కూడ వుంది. అపుడు దురితములను తీసుకొని వస్తుందనే అపార్ధం ఔతుంది. అందుచేత, ''దురితోద్ధరణోద్యతాని'' అనేదే సరియైన పాఠం. ఆమె మన నమస్కార క్రియ చేత దురితములను వ్రేళ్ళతో పెకలించివేయగలదన్నమాట . మామేవ అన్న పదప్రయోగంలోని 'ఏవ' అను పదములను - నందనాని అనే పదముతో కలిపి చదువుకోవాలి. నందనాని ఏవమామ్‌ మాత ‘నిశంకలయాతు’ - నాన్యే - అనగా ఈ నందనం మాత్రం, వేరే ఏదీకాదు - నన్ను వచ్చి చేరుగాక అని ఆచార్యుల భావం.

అదే విధముగా , శంకరాచార్యుల వారే రచించిన ప్రశ్నోత్తర రత్నమాలికలో ''కోగురుః''? గురువెవ్వరు? అనే ప్రశ్నకు ''యో అధి గతత్త్వః శిష్యహితాయోద్యతః సతతం'' అని సమాధానం ఉంటుంది అంటే, ‘గురువు తత్వాన్వేషణ చేసి తత్త్వజ్ఞుడై వుండాలి. అతడు అనుభవశాలిగా వుండవలె. అట్టి గురువు, అన్ని కాలములలోనూ శిష్యుని హితాన్ని ఉద్దేశించి పాటు పడుతూ వుంటాడు’. ఇక ''శిష్యమితాయోత్యతః సతతం''.
శిష్యుని హితమేది? అనే ప్రశ్నకి ‘అతనిని కర్మ బంధం నుండి తప్పించి, సంసార విమోచలతో అతనికి మోక్ష సౌఖ్యం కల్గించటమే గురువు చేసే హితచర్య’. అని సమాధానం ఉంటుంది . 

 గురువుకు చేసే నమస్కార క్రియ శిష్యునికి ఆ హితాన్ని చేకూరుస్తుంది. గురువు యొక్క కృపాధార అనే కనకధార అతనిపై వర్షిస్తుంది. అందుచేత మనకు ఆ ఒక్క నమస్కారమనే సంపద వుంటే చాలు. వేరే ఏదీ అక్కరలేదు.

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya