Online Puja Services

సంపదప్రదాత శ్వేతార్క గణపతి

3.14.153.176

సంపదప్రదాత శ్వేతార్క గణపతి 
-లక్ష్మీ రమణ 

 శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకో గలిగితే శుభప్రదం. శ్వేతార్క మూలాన్ని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞానసంపద, రక్షణ , సుఖశాంతులు లభిస్తాయి. శ్వేతార్కం అంటే తెల్లజిల్లేడు చెట్టు  . తెల్లజిల్లేడు దాదాపు 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత , దాని వేర్లు ప్రకృతి సహజంగా గణపతి రూపం పొందుతాయని శాస్త్రం చెబుతోంది . అటువంటివి చాలా అరుదే ! కానీ ఆ తెల్లజిల్లేడు గణపతిని పూజిస్తే, ఇక ఇంట్లో సంపదకి లోటుండదని చెబుతున్నారు పండితులు . 

తెల్ల జిల్లేడును ‘శ్వేతార్కం’ అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది.. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ, గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. 

జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట. శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు.

ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదని శాస్త్రం చెబుతోంది.

శ్వేతార్క మూలానికి వశీకరణ శక్తి ఉంటుందిట.. ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవు నెయ్యి , గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, ఈ ఆవు నెయ్యి,  గోరోజనం లో శ్వేతార్క మూలాన్ని గంథం లాగా అరగదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్ధిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి వశీకరణ శక్తి ఉంటుందని చెబుతారు .

శ్వేతార్క గణపతి గూర్చి నారదాది పురాణ గ్రంథాలలో చెప్పబడింది .  తెల్లజిల్లేడు వృక్షంలో ప్రత్యేకించి మూలములో గణపతి ఆకృతి తయారు కాగలదని ఇవి చెబుతున్నాయి .శ్వేతం అంటే తెల్లని రంగు . అర్క అంటే సూర్యుడు , ప్రకాశం కలిగినవాడు . శ్వేతార్క గణపతి అంటే, సూర్యునిలా ప్రకాశించే తెల్లని జిల్లేడు గణపతి అని అర్థం . తెల్లజిల్లేడు చెట్టు 100 సంవత్సరాలు దాటిన దాని వేరు  సహజం గానే గణపతి రూపం పొందుతుంది . ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం రోజున ఈ వేరును సేకరించాలి. జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతక చక్రంలో సూర్యుడు నీచ స్థానంలో ఉన్నవారు, ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ఉంచుకుని పూజిస్తే చాలా మంచిది.. కానీ ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పురోహితుల్ని సంప్రదించి వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి..

శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం.

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya