Online Puja Services

విజయవాడ కనక దుర్గమ్మ

3.22.187.239

విజయవాడ కనక దుర్గమ్మ క్షేత్రాన్ని గురించిన ఈ విషయం మీకు తెలుసా !
- లక్ష్మి రమణ 

దుర్గాదేవి దుర్గమాల నుండీ మనలని రక్షించే అమృతమూర్తి . శక్తి స్వరూపిణి . శరణన్నవారి వెంటే ఉండి రక్షించే అమ్మ . సదా విజయాల్ని అనుగ్రహించే విజయేశ్వరి.  విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువైన విజయదుర్గమ్మని కొలిచినవారికి కొంగుబంగారమే అని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.  ఆ అమ్మవారే స్వయంగా విజయవాడలో సంచరిస్తూ ఉంటారని, అలా భక్తులకి కలిగిన అనుభవాలని కూడా మనం ఈ హితోక్తి వేదికలో చెప్పుకున్నాం . ఈ క్షేత్రాన్ని దర్శించడం ఖచ్చితంగా మన జీవితంలోని ప్రతికూలతలని, నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవడమే.  విజయాలవైపు మన ప్రయాణానికి నాంది పలకడమే . అటువంటి దుర్గమ్మ క్షేత్రాన్ని గురించిన అద్భుతమైన ఈ విషయం మీకు తెలుసా ! 

  శ్లో. ఓంకార పంజర శుకీ ముపనిషదుద్యాన కేళి కలకంఠీమ్.
ఆగమ విపిన మయూరీ మార్యా మంత ర్విభావయే ద్గౌరీమ్.

ఓంకారమనే పంజరములో ఉండే రామచిలుక , ఉపనిషత్తులనే  ఉద్యానవనములో ఆటలాడుకొనే దివ్య సుందర స్వరగాత్రము గల జగన్మాతకు, జగత్తులోని సృష్టికార్యము కోసము నిరంతరము జరగవలసిన కార్యమును విశదీకరించే శాస్త్ర సముదాయమనే  మహారణ్యములో విహరించే మయూరము, గొప్ప సంస్కారముగల మహనీయుల అంతరంగములో సదా స్ఫురిస్తూ, అక్కడ నివశించే తల్లి గౌరీదేవికి నమస్కారము.

కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి వున్న కనక దుర్గామాత స్వయంభువు. ఈ దేవుడేవి దర్శనమాత్రంచేత భక్తుల సమస్త కష్టాలూ కడతేరిపోతాయి . అమ్మ అనుగ్రహం చేత మెండైన భాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమా . విశేషించి తెలుగు ప్రజలు కనకదుర్గమ్మని వారి ఆడపడుచుగా , ఇంటి ఇలవేల్పుగా కొలుచుకుంటారు. 

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన ఉన్న ఆలయంలోని కనకదుర్గమ్మ మహాశక్తి సమన్విత . ఈ ఆలయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్య మహర్షి తమ తపః ఫలాన్ని ధారపోశారని చెబుతారు. శక్తి స్వరూపిణి అయినా ఇక్కడి దుర్గమ్మ మొదట్లో రౌద్రరూపంలో వుండేదట. ఆ తర్వాత  ఆదిశంకరులు ఈ క్షేత్రానికి విచ్చేసి, శ్రీ చక్రంలోని రౌద్రబీజాలు తొలగించి అమ్మని శాంతపరిచారట. అప్పటి నుండీ దుర్గామాత శాంతస్వరూపిణిగా మారి తనను దర్శించే భక్తులు కోరికలు నేరవేరుస్తునదని చెబుతారు. కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే స్థల మహత్యం ఇలా ఉంది .

ఇంద్రకీలాద్రి కథ :- 

దుర్గామాత ఆలయం వున్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీపరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగాఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలుగి, సింహాన్ని అధిష్టించి మహిషాసురోత్తమాంగాని శూలంతో పొడుస్తూ దర్శనమిస్తారు.

ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి అష్ట  బాహువుల్లోను ధరించే ఎనిమిది ఆయుధాలు, ఈ దేవీమూర్తికి ఎడమభాగంలో శ్రీ చక్రం స్థాపించబడి వుంది. ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి వుంది, ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికే జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల మకరతోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి వున్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి ఇక్కడ ఉన్న నవదుర్గల పేర్లు.

దేవీ మహత్యం , శ్రీచక్ర సంస్థాపన , దానికి అగస్త్యులవారి శక్తి ధారపోయడం శంకరులవారి కటాక్షం ఇవన్నీ కలసి అమ్మవారి ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులని ధన్యులని చేస్తున్న విశేషాలు. ఈ సారి దుర్గమ్మని దర్శించినప్పుడు అక్కడి శ్రీ చక్రాన్ని భావించి, సందర్శించి నమస్కారం చేసుకోండి . 

శుభం . 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi