Online Puja Services

ప్రకృతితో మమేకమైన తెలంగాణా బతుకమ్మ సంబురం

18.118.254.28

ప్రకృతితో మమేకమైన తెలంగాణా బతుకమ్మ సంబురం

ప్రాంతీయ ప్రత్యేకతలను ఆపాదించుకొని, దసరా వేడుకలు ఒక్కొక్కప్రాంతంలో ఒక్కోరకంగా జరుగుతుంటాయి .  తెలంగాణలో దసరా సంబురాలంటే అచ్చంగా  రంగుపూల బతుకమ్మ వేడుకలే. ప్రకృతితో మమేకమైన తెలంగాణా బతుకమ్మ సంబురం ఆడపడుచుల పండుగగా ప్రసిద్ధిని పొందింది .  

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ,
బంగారు బతుకమ్మ ఉయ్యాలో …

 అంటూ తెలంగాణ లోని వీధులన్నీ ఏకమై ఆలపిస్తుంటాయి.  వాడలన్నీ పూల సోయగాలతో శోభిస్తుంటాయి .  ఆడపడుచులు  నిండైన అలంకారాలతో, పట్టు చీరలతో అచ్చంగా అమ్మవారిని తలపిస్తుంటారు . ప్రతి లోగిలీ అమ్మ సన్నిధిలా మారి గౌరమ్మకి 9రోజుల కొలుపులు, నిత్యనైవేద్యాలతో దీపిస్తుంటుంది .  తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక బతుకమ్మ సంబురాలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి .

ప్రకృతి జగన్మాత తత్వానికి ప్రతీక. ఆ ప్రకృతిని పూల బతుకమ్మగా మలచి, గౌరమ్మగా తలచి పూజించే సంప్రదాయమే బతుకమ్మ పండుగగా చెప్పొచ్చు. తెలంగాణా ప్రాంతమంతా దసరాసమయంలో ఒక పూల తేరులా మారిపోతుంది.   ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఈ ప్రాంతంలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి . గౌరీ పండుగగా కూడా పిలిచే ఈ  సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందే మొదలవుతుంది . నవరాత్రులూ పూలబతుకమ్మలు తయారుచేసి, ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి ఆ గోరమ్మను   తమ ఆటపాటలతో అర్చిస్తారు.  చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ చేసుకుంటారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ.

బతుకమ్మ పండుగంటే , ఆడపడుచుల పండుగ .  

బతుకమ్మ లంటే ఇంటి ఆడబిడ్డలు. ఇంటి గౌరమ్మలు . అందుకే దసరాకి  ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఆనందంగా ఆడుతూ పాడుతూ ఒక్కచోట చేరి, ఆనందంగా పూలతో బతుకమ్మలు పేరుస్తారు. తాంబాళంలో నీళ్ళుపోసి , ఆపైన  ఆకువేసి , త్రికోణాకృతిలో పూలను పేరుస్తూ , పొట్టనింపుతూ సాగే ప్రక్రియ బతుకమ్మపైన పసుపుగౌరిని నిలపడంతో ముగుస్తుంది. ఇలా సాగే బతుకమ్మ బొడ్డెమ్మతో మొదలై ఎంగిలిపుప్వు బతుకమ్మగా , సద్దుల బతుకమ్మగా పూల గౌరమ్మ  నవరాతుల్లో ని 9రోజులూ ప్రత్యేకపూజందుకుంటుంది  . బతుకమ్మ పేర్చేప్పుడు  బంతులు , చేమంతులు , మల్లెలు, జాజులు , మందారాలు ఇలా అందాలు చిందే పూలెన్ని ఉన్నా  గునుగు, తంగెడు పూలదే అగ్రతాంబూలం. తీరొక్కపూలతో సొగసైన బతుకమ్మలు చేసి , ప్రతీ సాయంత్రం దాని చుట్టూ వలయాకారంలో తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. 

బతుకమ్మ అంటే సాక్షాత్తూ గౌరమ్మే . 

బతుకమ్మ సంప్రదాయం పుట్టుక వెనుక ఎన్నో కథలున్నాయి. అయితే మహిషాసురమర్ధిని గా అమ్మవారు పూజలందుకునే దసరా పర్వదినాల్లో అదే నేపధ్యంతోటి ఉన్న కథను కూడా జానపదులు చెప్పుకుంటుంటారు. మహిషాసురవధ అనంతరం అలసటతో మూర్ఛిల్లిన దేవికి తమపాటలతో ఊరటనిచ్చి, తిరిగి బతుకమ్మా అని వేడుకున్నారట ఆడపడుచులు. ఆలా 5రోజులు వేడుకోగా దేవికోలుకోని, తిరిగి బ్రతికింది అందుకే ఆమెను బతుకమ్మరూపంగా , ఆటపాటలతో అర్చిస్తారని ఒక కథ.  ఒక్కేసి పూవేసి చందమామ … ఒక్కజాములాయె చందమామ అంటూ వినసొంపుగా సాగే బతుకమ్మ  పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.తప్పేటలా తాళం వేస్తూ, పదంపాడుతూ , పాదం కదుపుతూ సాగె బతుకమ్మ కోలాహలం అద్భుతం అనిపించక మానదు . 

వైభోగమదియన్న తెలంగాణా నేలది కాక మరియేది

తెలంగాణలో ఓవైపు పూల దిన్నెల్లో ఒదిగిన గోరమ్మకు జానపదుల నృత్య గాన నైవేద్యం, మరోవైపు సుప్రసిద్ధ దేవాలయాలలో అమ్మలగన్నఅమ్మకు ప్రత్యేకార్చనల నీరాజనం . వైభోగమదియన్న తెలంగాణా నేలది కాక మరియేది మదితలచ అని పాడుకొనేలా దసరా ఉత్సవవేళ శరన్నవరాత్రి ఉత్సవ హేల అంబరాన్ని తాకుతుంది.  

కరీంనగర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం:

దక్షణ కాశీగా పేరుగాంచిన కరీంనగర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి . దేవాలయ ప్రాంగణమంతా విద్యుదీపాల శోభలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుండగా ,శ్రీ రాజరాజేశ్వరీ దేవి నవదుర్గలుగా రూపుదాల్చి తన భక్తులను అనుగ్రహిస్తుంటారు .  
 

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపురం జోగుళాంబ ఆలయం:

తెలంగాణా నేలపైనున్న మరో ప్రఖ్యాత శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపురం జోగుళాంబ ఆలయం. దసరా నవరాత్రుల్లో జోగుళాంబకు  వివిధ సేవలతో పాటుగా నవఅలంకారాలు చేసి పెద్దఎత్తున పూజాదికాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ  నవ రాత్రుల్లో ఇక్కడి యోగేశ్వరీ మాతని దర్శించుకోవడం అంటే పూర్వ జన్మపుణ్యఫలమేనని భక్తుల నమ్మకం.

వరంగల్ భద్రకాళీ దేవాలయం :

వరంగల్ లో వెలసిన భద్రకాళీ దేవాలయంలో కూడా సంప్రదాయానుసారంగా, శాస్త్ర యుక్తంగా శరన్నవరాత్రి పూజలు నిర్వహిస్తారు . శ్రీచక్ర నివాసినికి , సువాసినులు విశేష కుంకుమార్చనలు చేస్తారు . ఆది మధ్యాంత రహితని నవరూపాలలో అలంకరించి, అమ్మ ఆశీస్సులందుకొనేందుకు ఆతురతపడుతుంటారు . 

జ్ఞానాంబిక వెలసిన క్షేత్రం బాసర:

చదువులతల్లి జ్ఞానాంబిక వెలసిన క్షేత్రం బాసరలో కూడా నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు . రోజుకో శక్తి స్వరూపాన్ని ధరించి శారదాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది .  ఇక మూలా నక్షత్రం రోజున అమ్మవారి సన్నిధిలో విశేషపూజలు చేస్తారు . విశేషించి ఈ రోజు  కుంకుమార్చనలు , అక్షరాభ్యాసాలు శారదాదేవి సన్నిధిలో వేలాదిగా జరుగుతాయి . తెలంగాణా నుండే కాక అనేక ప్రదేశాలనుండీ ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు . జ్ఞానేశ్వరిని తమకి జ్ఞానభిక్ష పెట్టమని వేడుకుంటుంటారు .

ప్రాంతీయ నేపధ్యం ఏదైనా, ప్రాస్త్యాన్ని తెలిపే కథ వేరైనా దసరా అంటే చెడుమీద మంచి సాధించిన విజయానికి ప్రతీక. అతివలు అబలలు కారు, శక్తి స్వరూపాలని చాటే వేడుక. ఈ పర్వదినాలు మీ అందరికీ శుభాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ దసరా శుభాకంక్షలతో శలవు .

- లక్ష్మి రమణ 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi