Online Puja Services

పంచభూతేశ్వరుడు శివుడు

3.142.114.245

పంచభూతేశ్వరుడు శివుడు
కూర్పు - లక్ష్మీ రమణ 

పంచభూతాలకూ అధిపతి భూతనాధుడు శివుడు. ఈ లయకారుని లీలావిలాసం అనంతం అసామాన్యం , ఆత్మతత్వ ప్రబోధకం . జ్యోతిరూపంలో ఆత్మ ప్రబోధంచేస్తూ జ్యోతిర్లింగాలుగా అవనిపైన అవతరించి పూజలందుకుంటున్న పరమేశ్వరుడు పంచభూతాలకు అధిపతిగా పంచభూతాత్మక లింగాలుగా వెలసిన క్షేత్రాలున్నాయి . ఆ క్షత్రదర్శనం చేయడం విశిష్టం ,పావనం, విజ్ఞానదాయకం . ఇంకెందుకాలస్యం , రండి శివతత్వాన్ని తలచుకుంటూ ఆ శివాలయ దర్శనానికి వెళదాం . 

విశాల విశ్వంలో పరమశివుని చిహ్నంగా శివలింగం ఆదరణ పొందుతోంది. ‘శివుడు’ అంటే శుభప్రదుడు అని అర్థం . ‘లింగం’ అంటే సంకేతం లేదా ప్రతీక అని అర్థం. ‘లీనయతీతి లింగః’ అని శాస్త్ర వచనం. సర్వం లీనమయ్యేది అందులోనే! లింగంలో మూడు భాగాలు ఉంటాయి. అట్టడుగు భాగం సృష్టికర్త బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి దాన్ని ‘బ్రహ్మ భాగం’ అంటారు. మధ్య భాగం స్థితి కారకుడైన విష్ణువును సూచిస్తుంది. ఈ రెండు భాగాలూ పానవట్టంలో పొదిగినట్టు అమర్చి ఉంటాయి. లింగ పీఠానికి అంటే పానవట్టానికి వెలుపల, ముందుకు వచ్చిన స్తంభాకార భాగమే పూజలు అందుకొనే ‘రుద్ర భాగం’. ఇదే పూజాభాగంగా ప్రసిద్ధి చెందింది. 

శివార్చన ఇలా చేయాలి:
శివ పంచాక్షరి పఠిస్తూ, లింగాష్టకాన్ని స్మరిస్తూ శివుణ్ణి ఆరాధించాలి. ‘అభిషేక ప్రియ శ్శివః’ అంటారు. కాబట్టి వేద మంత్రాలు పఠిస్తూ, పంచామృతాలను పూలతో శివలింగంపై చిలకరించాలి. అభిషేకం తరువాత గంధం, నైవేద్యం, ధూపం, దీపం, తాంబూలం సమర్పించాలి. వరి అన్నం నివేదించాలి. శివారాధనలో భస్మం, రుద్రాక్ష, మారేడు (బిల్వ) దళాలు ఉండాలి. మారేడు వృక్షం చుట్టూ దీపాలు వెలిగిస్తే శివజ్ఞానం సిద్ధిస్తుంది బిల్వ వృక్షం శివ స్వరూపం. భస్మం ఐశ్వర్యప్రదాయకం. అందుకే బిల్వార్చన సాగించాలి. ‘ఓం నమశ్శివాయ’ అంటూ శివ పంచాక్షరి జపిస్తూ ఉండాలి.

శివుడు పంచాననమూర్తి:
 ఆయన ‘ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు’ అనే నామాలతో, రూపాలతో ప్రసిద్ధుడు. శివుడు ప్రదోషవేళలో నటరాజుగా తాండవం చేస్తాడు. హిమాలయాల్లో దక్షిణాభిముఖంగా ఋషులకు జగద్గురువై ఉపదేశామృతం అందిస్తాడు. అందుకే ఆయన ‘దక్షిణామూర్తి’ అయ్యాడు.
 

ఆలయానికి వెళ్ళినప్పుడు నంది అనుమతి తప్పనిసరి :
శివాలయాలలో గర్భగుడి ఎదురుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ఆలయ ప్రవేశ వేళ నంది అనుమతిని భక్తులు కోరాలని పెద్దలు చెబుతారు.
 

‘నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం
మహాదేవస్య సేవార్ధం అనుజ్ఞా దాతుమర్హసి’

అని ఆయనను శరణు వేడాలి, ప్రార్థించాలి. నందితో పాటు భృంగి, వీరభధ్రుడు, చండీశ్వరుడు అనే లఘుదేవతలు కూడా శివ పరివారంలో ఉంటారు. శివుడి అనుచరుల్లో ప్రమధ గణాలు ఉంటాయి. ఈశ్వరుడు భవుడు. లోకంలోని జ్ఞాతుల తత్త్వం బాగా ఎరిగినవాడు.
 

పంచభూత లింగాలు :
పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం. 

1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
అవకాశమున్నది ఆకాశమని నానుడి ! ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చింది.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం (అగ్ని స్వరూపమే ఈ తేజోలింగం ) ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. 

ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు.

‘ శివ! నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!’ అంటాడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో మహాకవి ధూర్జటి.
 
‘శివ’ అనే రెండు అక్షరాల నామం సర్వవశీకరణ మంత్రం. సర్వవశ్యౌషధం. ఆ అక్షరాలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తాయి. పాతకాలను హరిస్తాయి. పుణ్యాలను ప్రోగుచేస్తాయి. ఆయన దర్శనం సర్వ శుభకరం . మంగళప్రదం . మోక్షదాయకం . శుభం .

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya