Online Puja Services

పేరిణికి ప్రేరణనిచ్చిన రామప్ప దేవాలయం.

3.15.179.121

పేరిణికి ప్రేరణనిచ్చిన రామప్ప దేవాలయం. 

వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం అద్భుతమైన శిల్పకళకు నిలయం .  ఇది కాకతీయుల కళా తృష్ణకి ఒక మచ్చుతునక అంటే అతిశయోక్తి కాదు .  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రయ్య సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన  దేవాలయం  ఇది.  కాల గమనం లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ , తరగని కళా నిధిలా,  వెలుగులీనుతోంది . 

 రామప్పదేవాలయం మానవ సృజనాత్మకతకు పరాకాస్టేమో అనిపిస్తుంది . దర్శించిన వారి కనులే కనులు కదా అనిపించేలా  , అద్భుత శిల్ప సౌందర్యం చూపు తిప్పుకోనివ్వదు . ఒక్కోశిల్పాన్ని తరిచి చూస్తే, ఆలయ కుడ్యాలపై వయ్యారంగా నిలచిన మదవతి సైతం అనంతమైన అంతరార్థాన్ని కలిగి ఉన్న వైనం అబ్బురపరుస్తుంది.   ఆ శిల్పాల కళా చాతుర్యం , ఆలయ నిర్మాణ కౌశలం అణువణువునా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు . ఈశ్వరుడు ప్రధాన దైవంగా వెలుగొందుతున్న ఈ ఆలయానికి రామప్ప దేవాలయమని పేరెలా వచ్చిందనేది ఇప్పటికీ చరిత్రకారులకి చిక్కు ప్రశ్న గానే మిగిలింది . అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన  శిల్పులలో ఒకరి పేరు రామప్ప అని ఆయన గౌరవార్థం ఈ శిల్పకళా నిలయానికి రామప్ప దేవాలయమని పేరు వచ్చిందని స్థానిక కథనం . 

రామలింగేశ్వరుడు:

రామప్ప దేవాలయంలో విరాజిల్లుతున్న ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. సుమారు 6 అడుగులుందా అనిపించేలా ఎత్తైన పానవట్టం పై కొలువైన పరమేశ్వరుడు అద్బుతమనిపించక మానడు. కాకతీయులు యుద్ధ సన్నాహాలు చేసేముందు ఈ స్వామి అనుగ్రహం కోసం ఆలయాన్ని దర్శించేవారని చెబుతారు . అల్లంతదూరానికి సైతం అద్భుతంగా కానవచ్చే రామలింగేశ్వర  స్వరూపం చూడగానే మనసులో చెరగని ముద్ర వేస్తుంది. అభయహస్తమేదో వెన్ను నిమిరి అనంత ధైర్యాన్ని నింపిన అనుభూతి అనుభవమవుతుంది. ఇక్కడ నిత్యం రామలింగేశ్వరునికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు . ఇక గుడి ఆవరణలో మరో 3 ఆలయాలు కూడా ఉన్నాయి.  అవి కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం, ఇంకొకటి బహుశా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.  వీటిలో కొన్ని శిధిలావస్ధలో వున్నాయి.  

స్పాట్ :  

ఆలయం వెలుపల రామలింగేశ్వరునికి అభిముఖంగా ప్రత్యేక మండపంలో వున్న నంది విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.  నల్లరాతికి ఉలితో ప్రాణం పోసిన శిల్పి నైపుణ్యం అచ్చెరువుకి లోను చేస్తుంది.  జీవం  వుట్టిపడే  ఈ నంది గంటలు, ఆభరణాలు చెక్కటానికి శిల్పి ఎంత శ్రమించాడో అనిపిస్తుంది.  శిల్పకళలో ఆసక్తి లేనివారయినా సరే ఆ నందీశ్వరుణ్ణి చూస్తూ కొంచెంసేపు ఇహప్రపంచాన్ని మరచిపోతారు.

రంగమంటపం:

ఆలయంలోపలకి ప్రవేశించగానే రంగమంటపం కనబడుతుంది.  ఇక్కడ దైవారాధనలో నృత్యప్రదర్శనలు జరుగుతుండేవి.  మంటపానికి స్తంభములకు, దూలాలకి, కప్పుకు నల్లరాళ్ళు వాడబడ్డాయి.  ఆ చుట్టుపక్కల ఎక్కడా ఇలాంటి రాయి దొరకదు.  మరి ఇంతపెద్ద నల్లరాళ్ళు ఎక్కడనుంచి, ఏ వాహనాలలో తెచ్చారో, వాటిని పైకి ఎత్తి ఎలా అమర్చారో ఆశ్చర్యం వేస్తుంది.  ఈ మంటపంలో కొన్ని రాళ్ళు విరిగి ఎత్తుపల్లాలుగా తయారయ్యాయి.  భూకంపాలవల్ల అలా అయినాయన్నారు.  ఈ మంటపం కప్పు మధ్యలో నటరాజు పదిచేతులతో వున్నాడు.  ఆయనకి ఎనిమిది దిక్కులలో దిక్పాలకులు వారి వాహనాలతో వున్నారు.  ఎంతటి ఎండాకాలమైనా ఈ మండపంలో చల్లగా వుంటుంది.

చారిత్రిక విశేషాలు :
 
కాకతీయులకు రాజధానిగా విరాజిల్లిన నాటి ఓరుగల్లు, నేటి వరంగల్ లోని ఆలయాలను ఆ చారిత్రిక విశేషాలను తెలుసుకుంటూ దర్శించినప్పుడు కలిగే అనుభూతే వేరు. ఆధ్యాత్మిక దర్శనం , అనంత విజ్ఞాన సముపార్జనం ఏకకాలంలో సిద్ధిస్తాయి . 

కాకతీయుల కంచుకోటగానేకాక ఓరుగల్లు కాకతీయుల కళాతృష్ణకి కూడా నిదర్శనంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తటాకం,నగరం ,దేవాలయం అనే కాకతీయుల శైలికి నిర్శనంగా ఇక్కడి రామప్ప చెరువు నిలుస్తుంది. ఇక  ప్రత్యేకించి రామప్ప దేవాలయం ఒక కళానిలయం అంటే అతిశయోక్తి కాదు . ఈ ప్రదేశాన్ని సందర్శించేప్పుడు     తప్పకుండా అక్కడ వుండే గైడ్ సహాయం తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతాల్ని సావకాశంగా చూసే అవకాశం దొరుకుతుంది .  ఎన్నో అద్భుత శిల్పాలను వదలకుండా, వివరాలతో చూడవచ్చు.

గుడి గోడపై చెక్కబడ్డ శిల్పాలను శ్రధ్ధగా పరిశీలిస్తే ,   ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెట్టాలో మనకు దారి చూపిస్తూ ఒక చిన్న ఏనుగుల వరస దారిచూపిస్తుంది.  వరసలో మొదట ఒక వ్యక్తి కత్తి పట్టుకుని వుంటాడు.  చివరి ఏనుగు దేవుని ముందు భక్తితో తలవంచుకుని వుంటుంది. అధికారం ఇచ్చే అహంకారం కన్నా సర్వాంతర్యామికి చేసుకొనే ఆత్మ సమర్పణ మిన్నని ఈ వరుస చెబుతుంది.  ఈ ఏనుగుల వరసపైన రెండు విప్పారిన తామర పువ్వుల వరస ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నమనిపిస్తుంది. వీటి మధ్య, గుడి కప్పులోవున్న సుందరీమణుల విగ్రహాల సూక్ష్మ రూపాలు చెక్కబడివున్నాయి. ఐహికమైన సుఖములన్నీ ఆధ్యాత్మిక ఉన్నతి ముందు చిన్నబోతాయనే సందేశం ఇస్తున్నట్టు కనిపిస్తాయి.  ఇక ఇతర కుడ్యాలను  పరిశీలించి చూస్తే శైవ, వైష్ణవ, బౌధ్ధ, జైన మతాల దేవతలు, మహనీయుల శిల్పాలు కానవస్తాయి.  ఇవి ఆనాటి రాజుల సర్వమత సమైక్యతను ప్రతిబింబించడమే కాక, భిన్నత్వంలో ఏకత్వంమై ప్రకాశించే పరమాత్మ తత్వాన్ని ప్రబోధిస్తాయి  .  

రాణీ రుద్రమదేవి పరిపాలనలో వికసించిన ఓరుగల్లు సామాజిక పరిస్థితులను, నాటి సమాజంలోని స్త్రీ ఔన్నత్యం, సాధికారత వంటి వాటిని సైతం ఈ ఆలయశిల్పాలలో మనం గమనించ వచ్చు. విద్యా విశేషాలలో, వేదవేదాంగాలలో, ఆచార వ్యవహారాలలో,  యుధ్ధ విద్యలలో సైతం స్త్రీలు ఆరితేరారనటానికి నిదర్శంగా నిలిచే విగ్రహాలు ఎన్నో ఇక్కడ మనం గమనించవచ్చు .  

ఏనుగులు మనిషి తత్వానికి ప్రతీకలైతే , సింహం భగవంతుని సార్వభౌమత్వానికి ప్రతీక. రామప్ప ఆలయంలో ప్రస్తుతం స్తంబములకు, పై కప్పుకు మధ్యగల ప్రదేశంలో సుమారు 26 విగ్రహాలు  ఏనుగు పైన చెక్కిన  సింహముతోటి ఉంటాయి. మరో విధంగా చూస్తే కాకతీయ రాజుల బిరుదాలయిన రాయగజకేసరి, అరిగజకేసరిలకు గుర్తుగా ఇవి చెక్కబడి వుండవచ్చు.  ఇవికాక ఆలయానికే పేరు తెచ్చిపెట్టిన 12 సాలభంజికలు  మూర్తులు అపురూపాలు.  ఒక్కొక్కటి ఒక్కొక్క విలక్షణమైన హావభావాలతో చెక్కబడ్డాయి.   ఈ సుందర మూర్తులే రామప్ప దేవాలయానికి ప్రధాన ఆకర్షణ.  ఇవ్వన్నీ నల్లరాతి శిల్పాలు.  ఈ విగ్రహముల వస్త్రములు, ఆభరణములు, హావ భావాలు, భంగిమలు, కేశములు ఆ నాటి శిల్పుల కళానైపుణ్యాన్ని చాటి చెబుతుంటాయి.  

 నాట్యశిల్పమంతా రామప్ప గుడిలోనే ఉంది :

గర్భగుడి ద్వారమునకు ఆనుకుని వున్న రెండు శిలాఫలకాల మీద నాట్య, మృదంగ వాద్యకారుల బొమ్మలు రకరకాల భంగిమలలో ఆద్భుతంగా మలచబడ్డాయి.  జాయప సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంటుంది . వీటిని చూసే ప్రముఖ నాట్య విద్వాంసులు శ్రీ నటరాజ రామకృష్ణ, పేరిణి నాట్యాన్ని పునరుధ్ధిరించారు. ఇంత గొప్ప శిల్ప సంపదతోకూడిన ఈ ఆలయాన్నిప్రతి ఒక్క తెలుగువారూ తప్పక దర్శించాలి.

చేరుకోవడం ఎలా :

ఈ దేవాలయం వరంగల్ జిల్లా, వెంకటాపూర్ మండలం, పాలంపేట గ్రామంలో, వరంగల్ కు 60 కి.మీ. ల దూరంలో వున్నది.  బస్సు సౌకర్యంతో పాటు వరంగల్ వరకూ రైలు సౌకర్యం కూడా ఉంది .

- లక్ష్మి రమణ 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi