Online Puja Services

విష్ణువుకి పాలనా శక్తిని నిచ్చిన అండ అరుణాచల కొండ.

3.142.171.137

విష్ణువుకి పాలనా శక్తిని నిచ్చిన అండ అరుణాచల కొండ. 
- లక్ష్మి రమణ 

కల్పాల కొద్దీ కాలం గడిచిపోయింది . శ్వేతవరాహకల్పంలోని వైవస్వత మన్వంతరంలోని  కలికాలంలో ఉన్నాం మనం. కానీ ఇంతకు ముందర గడిచిన కల్పాంతరాల నుండే, ఈ భువి మీద ఆ అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నాడు . తన ఉనికిని ఒకానొక కల్పంలో స్వయంగా విష్ణుమూర్తికి వివరించారు . విషమూర్తి తానూ చేసిన తప్పుకి పాలనా శక్తిని కోల్పోయి, తిరిగి ఆ ఆరుణాచలేశ్వరుని కృపతోటి జగత్ స్థితి కారక బాధ్యతని నిర్వహించే శక్తిని పొందిన స్థలం అరుణాచలమని స్కాందపురాణంలోని రెండవ అధ్యాయం తెలియజేస్తుంది . ఆ అరుణ గిరి కృపని విన్నా చదివినా తీరని కోరికనేదే ఉండదు . 

పూర్వం ఒక కల్పనలో శేష పాన్పు మీద నిద్రించిన శ్రీహరి యోగనిద్ర నుంచి ఎంతకాలం గడిచినా మేలుకోలేదు.  ఆయనలా నిద్ర మేలుకోకపోవడంతో జగత్తంతా అంధకారం ఆవరించింది.  అది చూసి మునులంతా “అయ్యో ఏమిటిది? అకాలంలో కల్పాంతమైనట్టు ఉంది”.  అని ఆందోళన చెందారు.  “ఏమిటీ  దుస్థితి? కల్పం గడిచిపోయినా  శ్రీహరి ఎందుకు మేలుకోలేదు ?”  అని ఆందోళన చెందుతూ పరమేశ్వరుని ధ్యానించారు. 

వారి  ప్రార్థన ఆలకించిన ఈశ్వరుడు విశ్వరక్షణకి పూనుకున్నాడు . వెంటనే తన తేజస్సు నుంచి విస్పూలింగాల్లాంటి  33 కోట్ల మంది దేవతలను సృష్టించాడు. వాళ్ళందరూ ఒక్కసారిగా విష్ణువుని నిద్రలేమని ప్రబోధించగా, శ్రీహరికి మాయ వదిలిపోయింది.  వెంటనే నిద్ర నుంచి మేలుకొన్నాడు.  

కళ్ళు తెరవగానే ఎదురుగా ప్రభాత కాంతిని చూసి, “అయ్యో తామస  గుణం పెరిగిపోయి నేనిలా నిద్రలోనే మునిగిపోయాను.  నన్ను లేపడం కోసం సాక్షాత్తు శివుడే స్వయంగా పూనుకోవలసి వచ్చింది కదా !ఇది ఎంతటి దురదృష్టకరము !! ఎంత అవివేకమైన పని చేశాను! ఇక నాకు శంకరుని క్షమించమని వేడుకోవడం తప్ప మరో మార్గం లేదు” అని తలపోసి, పరమేశ్వరున్ని శరణు వేడుకుంటూ, దివ్యంగా స్తుతించాడు.  

శ్రీహరి ప్రార్ధన విని ప్రసన్నుడైన శివుడు తేజో రూపంగా ఆవిర్భవించి శ్రీహరిని కటాక్షించాడు.  దివ్య తేజో రూపంతో తనకి దర్శనం ఇచ్చిన శంకరుడిని చూసి, తన్మయత్వంతో “హే శంకరా ! త్రిభువన పాలకా! త్రిమూర్తిరూపా, త్రినేత్రా , త్రిగుణాతీతా, త్రిపురహరా  నీవే సర్వేశ్వరుడివి .  నీ అంశతోనే ఈ దేవతలందరూ జన్మించారు.  సర్వ కార్య కారణ  రూపంతో ఈ ప్రపంచాన్ని నడిపించేది నీవే! ఓ జగత్ పాలక నా భారమంతా నీదే.  అ కాలంలో నిద్రపోయిన నన్ను దోషిగా కూడా నీవు పరిగణించడం లేదు. నా ఈ తప్పుకి నిష్కృతి లేదా ! నన్ను కనికరించావా !”అంటూ  దీనంగా విలపించాడు. 

 అలా బాధపడుతున్న శ్రీహరిని ఓదారాస్తూ పరమేశ్వరుడు ప్రత్యక్షమై , అతనికి ఈ విధంగా ప్రాయశ్చితాన్ని వివరించాడు. “ ఓ మధుసూదనా  నేను భూలోకంలో అరుణాచలుడి రూపంలో కొలువై ఉన్నాను.  అది నా జ్యోతిర్లింగం .  ఆ దివ్య లింగాన్ని చూస్తే చాలు! నీలో ఉన్న తమోగుణం మొత్తము నశిస్తుంది.  ప్రశాంతమైన ఆ జ్యోతిర్లింగం స్థావర లింగంగా నిలిచి ఉంది.  అంతర్ జ్యోతిమయమైన ఆ అరుణాచల పర్వతం సకల ప్రాణులకి వరప్రసాదితమైనది . ఓ కేశవా ! ఆ క్షేత్రంలో అరుణాచలేశ్వరున్ని శరణన్నవారికి తీరని కోరిక లేదు .  అంధులకు నేత్రాలని, పుత్ర సంతానము లేని వారికి పుత్రులని, మూగవారికి మాటల్ని వ్యాధి పీడితులకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.  అక్కడ నేనే స్వయంగా స్థిరమై నిలచి ఉన్నాను. వెళ్ళు వెళ్లి ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని దర్శించు.  అప్పుడే నువ్వు చేసిన దోషానికి పరిహారం జరుగుతుంది.” అని చెప్పి అంతర్ధానమయ్యాడు. 

 శంకరుడి మాట ప్రకారం శ్రీహరి భూలోకంలో ఉన్న అరుణాచలానికి బయలుదేరాడు.  భూలోకానికి వచ్చిన శ్రీహరి అరుణాచలాన్ని చూసి ఎంతగానో ఆనందించాడు.  అది గొప్ప తపోభూమి అని గుర్తించి, వెంటనే సకల దేవతలను పిలిచి ఆ పర్వతం మీద నివసించమని ఆదేశించాడు.  తాను కూడా ఆ పర్వత శిఖరం మీదకి చేరి తపస్సు చేయటం ప్రారంభించాడు.  ఆ పర్వతం మీదే ఋషులు నివసించడానికి తగిన ఆశ్రమాలను నిర్మించి, సాంగ వేదాల్ని అధ్యయనం చేసుకునే వాతావరణాన్ని కల్పించాడు.  అలాగే నిత్యము వందల మంది అప్సరసల నృత్య గీతాలతో ఆ గిరి మొత్తము శోభాయమానంగా ఉండేలా చేశాడు. 

 ఈ విధంగా చేసిన శ్రీహరి తానే స్వయంగా అక్కడున్న బ్రహ్మ సరస్సులో స్నానం చేసి, మహిమాన్వితమైన ఆ అరుణగిరికి ప్రదక్షిణం చేశాడు.  తరువాత అరుణాచలేశ్వరుని అర్చించి  సకల పాపాల నుంచి విముక్తుడై , తిరిగి సృష్టిని పాలించే శక్తిని పొందాడు. 

ఈ కథని విన్నా , చదివినా, ఆ అరుణాచలేశ్వరుని కృపాకటాక్షాలతో , సకల పాపాలూ తొలగిపోయి, ఆరోగ్యము, సౌభాగ్యమూ సిద్ధిస్తాయి . 

అరుణాచల శివ శరణం !

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya