Online Puja Services

రామరాజ్యం అనే పేరు ఎందుకు వచ్చింది ?

3.21.76.7

రామరాజ్యం అనే పేరు ఎందుకు వచ్చింది ? శ్రీ రామ చంద్ర ప్రభువు అవతార సమాప్తి ఎందుకు చేసారు?
- లక్ష్మి రమణ 

పిల్లాడు బుద్ధిమంతుడైతే , రాముడిలా మంచి బాలుడు అంటాం. ఏవ్యసనం లేకపోతే, వాడు రాముడయ్యా! ఏ అలవాటూ లేదని మెచ్చుకుంటాం. భార్య తప్ప మిగిలినవారందరూ తల్లి సమానులయితే, ఏకపత్నీవ్రతుడయ్యా , రామచంద్రుడే ! అంటాం .  చక్కని పరిపాలన సాగించే నాయకుడైతే , ఆయన వస్తే రామరాజ్యమే అంటాం. ఇలా రాముడు మనకి  ప్రతి విషయంలోనూ ఆదర్శ పురుషుడు. ఆ మహాపురుషుడు సాక్షాత్తూ పరమాత్మే ! కానీ ఆయన అవతార పరిసమాప్తి ఎందుకు చేశారు? రామరాజ్యం అనే ఉత్తమ ప్రమాణాన్ని ఆయన ఎలా సాధించారు ?  అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం . 

మానవరూపంలో అవతరించి , మానవుడి ధర్మం అనుసరించాడు ఆ శ్రీ రామ చంద్రుడు.
జాతస్య హి ధ్రువో మృత్యుః— అనే ధర్మం పాటించారు.

జయ విజయులు రావణుడు కుంభకర్ణుడుగా పుట్టి ఉగ్రులైనారు.

ముందు ఇచ్చిన మాట ప్రకారం వాళ్లను దాటించడానికి భూలోకానికి వచ్చి ఆ పని పూర్తి చేసుకొని వెళ్లి పోయారు శ్రీ మహావిష్ణువు . కేవలం అదొక్కటే లక్ష్యం కాదు.  ధర్మ సంస్థాపన పరమాత్మ మరో లక్ష్యం. రామరాజ్యం అనే ఉత్తమ ప్రమాణాన్ని ఆదర్శంగా ఇవ్వడానికి సుదీర్ఘకాలం ఈ భువిపైన ఉన్నారు. 

మానవుడిగా ఉన్న ఆ పరమాత్మని హెచ్చరించడానికి ధర్మ దేవత స్వయంగా వచ్చారు. “స్వామీ ! నీవు వచ్చిన పని పూర్తఅయ్యింది.” అని చెప్పగానే , మానవుడిగా తన అవతారాన్ని పరిసమాప్తి చేసి , తిరిగి  యథా స్థితిని పొందారు.

" దేవ మాయేవ నిర్మితా"… సీత. కాబట్టి ఆమె కారణంగా ధర్మ విరోధుల శిక్షణ చేశాడు. సత్కీర్తి కోసం స్వార్థం త్యజించాలని, ఇహ సుఖాల కోసమే బతకగూడదని తమ దాంపత్యం లోకాదర్శం కావాలని సీతారాములు జీవించి ఈ లోకానికి చూపించారు. అది కథ కాదు, మానవుడు అనుసరించాల్సిన జీవన వేదం . 

 యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. 

నదులూ, కొండలూ ఉన్నంత కాలమూ ఆ రాముడూ , ఆ సీతమ్మ, ఆ హనుమ ఉంటూనే ఉంటారు. భక్తుల హృదయాలలో ఉండి ధర్మ ప్రబోధ చేస్తూ ఉంటారు . రాక్షస శక్తులు మన హృదయాలలో ప్రవేశించకుండా అనుక్షణమూ హెచ్చరిస్తూ సద్గతికి మార్గం చూపుతూ ఉంటారు . ధర్మ కామాన్ని రక్షిస్తూ స్వైర విహారానికి అడ్డుకట్ట వేస్తునే ఉంటారు.

రాముడున్న చోట కాముడుండడు. కామం లేకపోతే క్రోధం, లోభం దరిచేరవు. సుఖ శాంతులకు దారి తనంతట అదే ఏర్పడుతుంది. 

పుత్ర మరణాలు క్వచిత్తుగా గూడా లేక పోవడం.

రోగాగ్ని భయాలు, చోర బాధలూ లేకుండడం.

కరువు కాటకాలు ఆకలి చావులు లేకుండడం. 

దేశం ధనధాన్య సమృద్ధంగా ఉండడం. 

వైధవ్యం కలగకుండడం. 

—ఇవి రామరాజ్యంలో సాధింపబడిన విశేషాలు. ఇవన్నీ ఉన్న రాజ్యాన్ని రామరాజ్యం అన్నారు . వీటన్నింటికీ మూలమైన ధర్మానుష్ఠానాన్ని విడవ కూడదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం . మనకి వీలైనంతవరకూ ధర్మానుష్ఠానాన్ని ఖచ్చితంగా పాటించాలి . అప్పుడు రామరాజయం సాధ్యమవుతుంది . 

శుభం !!

మాస్టారు మాచవోలు శివరామ ప్రసాద్ గారి సోషల్ మీడియా పోష్టు ఆధారంగా ధన్యవాదాలతో !!

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya