Online Puja Services

రామకోటి రాయడానికి నియమాలు, పద్ధతులు ఏమిటి?

3.141.47.163

రామకోటి రాయడానికి నియమాలు, పద్ధతులు ఏమిటి?
- లక్ష్మీరమణ 

రామ నామం  ఒక్కసారి పలికితే వేయిసార్లు పలికిన ఫలాన్నిస్తాడు ఆ పరమాత్మ .  రామ నామం పలకడం ఎంతో సులభం . ఆ నామాన్ని కూడా సరిగ్గా పలకలేని ఒక బోయవాడు, నారదోపదేశంతో ‘రామ’ కి బదులుగా అదేనామాన్ని తిరగేసి ‘మరా మరా అని’ తపిస్తే, ఆ బోయని వాల్మీకిని చేశాడా రాముడు . అదీ రాముని కృప ! అందుకే  ‘శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కోక్క పేరూ బహుతీపి’ అంటాడో  కవి ! ‘రామనామము రామ నామము రమ్యమైనది రామనామము’ అంటాడు మరో కవి .  అనినిత్యం ఆ నామామృత పానంలోనే మునిగి ఉంటాడు ఆ రామదాసుడైన హనుమయ్య. అంతటి ప్రశస్తి కలిగిన  రామ నామాన్ని కోటి సార్లు  రాయాలన్న ఆలోచన రావడమే ఒక  అదృష్టం. రామకోటిని రాసేప్పుడు ఇలాటిని నియమాలు పాటిస్తే మంచిదని పెద్దలు అంటుటారు . 

‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. అటువంటిది కోటిసార్లు రామనామాన్ని మనసుతో ,శరీరంతో , వాచకంతో చేసే రామనామం ఎంతటి గొప్ప ఫలాన్నిస్తుందో మాటల్లో వర్ణించలేము .  

రామకోటిని రోజులో ఈ సమయంలోనే రాయాలని లేదు. మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా రాయవచ్చు. రాసేప్పుడు శుచిగా, పవిత్రంగా ఉండాలి. రాసేటప్పుడు, మధ్యలో లేవాల్సిన పని వస్తే లేవచ్చు. కానీ, తిరిగి వచ్చి కూర్చుని రాయడానికి ముందు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని, భగవంతునికి నమస్కరించుకుని ప్రారంభించాలి . మనస్సు కోతి కదండీ ! దానికి పదే పదే రామ భజన చేయవే మనసా అని చెబుతూనే ఉండాలి . తిరిగి రామకోటిని రాసేముందు మళ్ళీ రాముడిపైకి మనసుని మళ్ళించి, రాయాలి.

రామకోటిని రాయడం ఎంత ముఖ్యమో, మనస్సు ఆ రామనామం మీదే  ఉండడమూ అంతే ముఖ్యం. మధ్యలో నిద్ర వచ్చినా, దృష్టి చెదిరిపోతూ ఉన్నా, వేరే ఆలోచనలు వస్తున్నా రాయడం ఆపేయాలి. అంతే తప్ప యాంత్రికంగా రాసుకుపోకూడదు.

ఆరంభించండి  ఇలా :

మొట్టమొదట ప్రారంభించినప్పుడు సీతారాముల చిత్రపటానికి పూజచేసి , పూజలో పుస్తకాన్ని పెట్టి మొదలుపెట్టాలి. 
రామకోటి రాసేముందర రోజూ  స్నానం చేసి,  నియమ నిష్ఠలతో ఒక శుభ్రమైన ప్రదేశంలో గానీ,  పూజ గదిలో గాని కూర్చుని రాయాలి. 
ప్రతిరోజూ కనీసం 108కి తక్కువ కాకుండా రాయగలిగితే మంచిది . 
రామకోటి రాసేవారు రాసేప్పుడు  నోటితో రామనామాన్ని పలుకుతూ రాయాలి.  దీనివల్ల మానసిక,కాయిక,వాచిక జపం చేసినట్లు అవుతుంది. . మనసులో తలుచుకోవడం వల్ల మానసిక జపం,  చేతితో రాయడం వల్ల కాయిక జపం,  నోటితో ఉచ్చరించడం వల్ల వాచిక జపం అవుతాయన్నమాట . ఈ పద్దతిని నడిచే దేవుడని పేరొందిన కంచిపరమాచార్య శ్రీశ్రీశ్రీ  చంద్రశేఖర సరస్వతి వారు  ప్రతిపాదించారు. 

 రామకోటి రాయడం లక్ష పూర్తి అయిన తరువాత రామునికి పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచాలి. ఈవిధంగా ప్రతీ లక్షకు చేయాలి.
 రామకోటి గ్రంథాన్ని రాయడం పూర్తి అయిన తరువాత ఎవరూ తాకకుండా ఒక పవిత్ర ప్రదేశంలో ఉంచండి.  అశుచి సమయాలలో, మైల, నెలసరి ఉన్నరోజుల్లో  రామకోటి గ్రంథాన్ని తాకకండి. 
రామకోటి రాయడం పూర్తయ్యాకా బంధుమిత్రులను ఆహ్వానించి రాముడిని పూజించి, శక్తికొలది సమారాధన చేయండి  .
 

రామకోటి రాశాక ఆ పుస్తకాన్ని ఏం చేయాలి : 

రామకోటి గ్రంధాలని ఒక పసుపు వస్త్రంలో మూటగట్టి రామునికి పూజ చేసి ఆ గ్రంథాలను శిరస్సున పెట్టుకుని రాముడిని స్మరిస్తూ కాలినడకన గాని రవాణా మార్గాల ద్వారా గాని భద్రాచలం రాముల వారి దేవస్థానానికి అప్పగించాలి.
 సాధ్యం కాకపోతే స్థానిక దేవాలయాల్లో స్వీకరిస్తే , అక్కడైనా సమర్పించవచ్చు . 
అదికూడా సాధ్యం కానప్పుడు పుణ్యనదీ మధ్యంలో నిమజ్జనం చేయవచ్చని కొందరు పండితులు సూచిస్తున్నారు . 

 

 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore