హనుమంతుడికి సమర్పించే వడ మాలకు రాహు గ్రహానికి సంబంధం ఉందా ?
హనుమంతుడికి సమర్పించే వడ మాలకు రాహు గ్రహానికి సంబంధం ఉందా ?
సేకరణ
రామ భక్తుడు అయిన హనుమంతునికి (Hanuman) వడలతో (Vada) చేసిన మాలను (Mala) ఎందుకు సమర్పిస్తారో తెలుసా? వడలంటే హనుమంతునికి ఇష్టం. అని సమాధానం చెప్పేశారంటే, మీరు ఈ కథనం చదవాల్సిందే! మనవాళ్ళు ఏ విధానాన్ని చెప్పినా దాని వెనుక పరమార్థం మరొకటి ఉండకుండా ఉండదు. ఇక్కడ ఆ వడమాలకీ, ఆంజనేయునికి, రాహు గ్రహానికి ఉన్న సంబంధం కూడా అలాంటిదే.
అంజనా దేవికి, వాయు భగవానుడికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో ఆకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు. వాయుపుత్రుడు కావడంతో, ఆకాశానికి రివ్వున ఎగిరేశాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు అలా ఆకాశానికి ఎగిరెళ్లడం చూసిన దేవతలంతా విస్తుపోయారు.
అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిపై అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అలా వజ్రాయుధం హనుమంతుడి గడ్డాన్ని తాకింది. తద్వారా హనుమంతుని గడ్డానికి గాయమేర్పడి, కుంచించుకుపోయింది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతుడు అని పేరొందారు.
అయితే, బాల హనుమంతుడు సూర్యుడిని (Sun) పట్టేందుకు వెళ్లిన రోజు సూర్యుడిని రాహువు పట్టుకోవాల్సిన సూర్యగ్రహణ సమయం. దాంతో సూర్యుడిని పట్టేందుకు రాహువు కూడా ప్రయాణమయ్యాడు. అయితే వాయుపుత్రుని వేగానికి ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ కారణంతో సూర్యుడిని రాహువు పట్టలేకపోయాడు. సూర్యగ్రహణాన్ని అడ్డుకుని, వేగంలో తననే మించిపోయిన హనుమంతుడి సాహసాన్ని చూసి నివ్వెరపోయిన రాహువు, ఆంజనేయుడికి ఓ వరం ప్రసాదించాడు.
ఎవరైతే రాహువుకు ప్రీతికరమైన ధాన్యమైన మినుములతో గారెలు చేసి, వాటిని మాలలాగా తయారు చేసి, వాటిని హనుమంతునికి సమర్పిస్తారో వారిని రాహువు పీడించడు. రాహుగ్రహ దోషాల వల్ల ఏర్పడే బాధలు, కష్టాల నుంచి విముక్తుల్ని చేస్తానని, వారిని ఎప్పటికీ ముట్టబోనని వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. కాబట్టి రాహువుకు ప్రీతికరమైన మినుములతో గారెలు చేసి తన శరీరం పోలిన అంటే పాము లాంటి ఆకారంలో మాలగా వడలను ఆంజనేయునికి సమర్పిస్తే, రాహు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం.
అందుచేతనే మినపప్పుతో కూడిన గారెలను తయారు చేసి 54, 108, లేదా 1008 అనే సంఖ్యలో హనుమంతునికి మాలగా సమర్పించిన వారికి రాహు దోషాలంటవని పంచాంగ నిపుణులు చెబుతూ ఉంటారు .
ఈ విధంగా రాహువుకూ, హనుమంతునికి వడమాలతో విడదీయలేని సంబంధం ఏర్పడిందన్నమాట. హనుమంతుని సాహసం రాహువుని అబ్బురపరిచి, భక్తులకి పసందైన భగవదనుగ్రహంగా పరిణమించింది. అదీ సంగతి !!
శుభం.
Hanuman, Anjaneya, Vada Mala, Rahu Graham
#hanuman #anjaneya #vadamala #rahugraha